T20 World Cup 2024: కంగారూలు ఘనంగా..

ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టాయినిస్‌ అదరగొట్టాడు. అతడు బ్యాటు, బంతితో చెలరేగడంతో ఆస్ట్రేలియా విజయంతో టీ20 ప్రపంచకప్‌ వేటను ఆరంభించింది.

Published : 07 Jun 2024 04:21 IST

మెరిసిన స్టాయినిస్‌
ఒమన్‌పై ఆసీస్‌ విజయం 

బ్రిడ్జ్‌టౌన్‌: ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టాయినిస్‌ అదరగొట్టాడు. అతడు బ్యాటు, బంతితో చెలరేగడంతో ఆస్ట్రేలియా విజయంతో టీ20 ప్రపంచకప్‌ వేటను ఆరంభించింది. గురువారం ఆసీస్‌ 39 పరుగుల తేడాతో ఒమన్‌ను ఓడించింది. స్టాయినిస్‌ (67 నాటౌట్‌; 36 బంతుల్లో 2×4, 6×6), వార్నర్‌ (56; 51 బంతుల్లో 6×4, 1×6) రాణించడంతో ఆసీస్‌ మొదట 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. మెహ్రాన్‌ ఖాన్‌ (2/38), బిలాల్‌ ఖాన్‌ (1/36), కలీముల్లా (1/30) బంతితో రాణించారు. వికెట్లు తీయకున్నా అకిబ్‌ (0/18), షకీల్‌ (0/28) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. ఛేదనలో ఒమన్‌ 9 వికెట్లకు 125 పరుగులే చేయగలిగింది. స్టాయినిస్‌ (3/19), స్టార్క్‌ (2/20), ఎలిస్‌ (2/28), జంపా (2/24) ఆ జట్టు పతనాన్ని శాసించారు అయాన్‌ ఖాన్‌ (36) టాప్‌ స్కోరర్‌. ఈ మ్యాచ్‌లో ఓటమి చవిచూసినప్పటికీ పసికూన ఒమన్‌ బ్యాటుతో, బంతితో ఆకట్టుకునే ప్రదర్శనే చేసింది.

రాణించిన ఆ ఇద్దరు: ఆస్ట్రేలియా విజయంపై ఏ దశలోనూ సందేహాలు లేనప్పటికీ తన బ్యాటింగ్‌ ప్రథమార్థంలో ఆ జట్టు కాస్త ఒత్తిడిని ఎదుర్కొంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 9 ఓవర్లలో 52 పరుగులే చేసి 3 వికెట్లు కోల్పోయింది. ఒమన్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. హెడ్‌ (12), మార్ష్‌ (14) విఫలమయ్యారు. పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ మ్యాక్స్‌వెల్‌ డకౌటయ్యాడు. అయితే ఓపెనర్‌ వార్నర్‌తో కలిసి స్టాయినిస్‌ జట్టును ఆదుకున్నాడు. వార్నర్‌ జాగ్రత్తగా ఆడగా.. నెమ్మదిగా మొదలెట్టిన స్టాయినిస్‌ క్రమంగా చెలరేగిపోయాడు. ఎదుర్కొన్న తొలి 15 బంతుల్లో 11 పరుగులే చేసిన స్టాయినిస్‌.. మెహ్రాన్‌ వేసిన ఓ ఓవర్లో ఏకంగా నాలుగు సిక్స్‌లు బాదాడు. వార్నర్‌తో నాలుగో వికెట్‌కు అతడు 102 పరుగులు జోడించడంతో కంగారు జట్టు 160 దాటగలిగింది. వార్నర్, టిమ్‌ డేవిడ్‌ ఆఖర్లో ఔటయ్యారు. ఛేదనలో ఒమన్‌ ఏ దశలోనూ పోటీలో లేదు. ఆసీస్‌ బౌలర్ల ధాటికి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. అయితే అయాన్‌ ఖాన్‌తో పాటు మెహ్రాన్‌ ఖాన్‌ (27) కాస్త రాణించడంతో ఒమన్‌ కాస్త గౌరవప్రదంగా ఓడింది.

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) షోయబ్‌ ఖాన్‌ (బి) కలీముల్లా 56; హెడ్‌ (సి) కైల్‌ (బి) బిలాల్‌ ఖాన్‌ 12; మిచెల్‌ మార్ష్‌ (సి) షోయబ్‌ ఖాన్‌ (బి) మెహ్రాన్‌ ఖాన్‌ 14; మ్యాక్స్‌వెల్‌ (సి) అకిబ్‌ (బి) మెహ్రాన్‌ ఖాన్‌ 0; స్టాయినిస్‌ నాటౌట్‌ 67; టిమ్‌ డేవిడ్‌ రనౌట్‌ 9; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 164; వికెట్ల పతనం: 1-19, 2-50, 3-50, 4-152, 5-164; బౌలింగ్‌: 4-0-36-1; కలీముల్లా 3-0-30-1; షకీల్‌ అహ్మద్‌ 4-0-28-0; మెహ్రాన్‌ ఖాన్‌ 4-0-38-2; అకిబ్‌ 4-0-18-0; జీషన్‌ మక్సూద్‌ 1-0-12-0

ఒమన్‌ ఇన్నింగ్స్‌: కశ్యప్‌ ఎల్బీ (బి) ఎలిస్‌ 7; ప్రతీక్‌ ఎల్బీ (బి) స్టార్క్‌ 0; అకిబ్‌ (సి) వేడ్‌ (బి) స్టాయినిస్‌ 18; జీషన్‌ (సి) వేడ్‌ (బి) స్టాయినిస్‌ 1; కైల్‌ (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) స్టార్క్‌ 8; అయాన్‌ ఖాన్‌ (సి) హేజిల్‌వుడ్‌ (బి) జంపా 36; షోయబ్‌ ఖాన్‌ (బి) జంపా 0; మెహ్రాన్‌ ఖాన్‌ (సి) డేవిడ్‌ (బి) స్టాయినిస్‌ 27; షకీల్‌ (సి) వార్నర్‌ (బి) ఎలిస్‌ 11; కలీముల్లా నాటౌట్‌ 6; బిలాల్‌ ఖాన్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 10 మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 125; వికెట్ల పతనం: 1-6, 2-23, 3-29, 4-34, 5-56, 6-67, 7-89, 8-117, 9-123; బౌలింగ్‌: స్టార్క్‌ 3-0-20-2; హేజిల్‌వుడ్‌ 4-0-21-0; ఎలిస్‌ 4-0-28-2; స్టాయినిస్‌ 3-0-19-3; మ్యాక్స్‌వెల్‌ 2-0-11-0; జంపా 4-0-24-2

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని