T20 World cup 2024: భారత్‌ X పాక్‌.. ఒక్కో టికెట్‌ రూ.16.65 లక్షలు

ఏ క్రికెట్‌ ప్రపంచకప్‌కైనా ప్రధాన ఆకర్షణగా నిలిచేది భారత్, పాకిస్థాన్‌ మ్యాచే. వచ్చే నెల 1న ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌లోనూ ఈ చిరకాల ప్రత్యర్థుల మధ్య సమరం కోసమే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Updated : 24 May 2024 09:27 IST

దిల్లీ: ఏ క్రికెట్‌ ప్రపంచకప్‌కైనా ప్రధాన ఆకర్షణగా నిలిచేది భారత్, పాకిస్థాన్‌ మ్యాచే. వచ్చే నెల 1న ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌లోనూ ఈ చిరకాల ప్రత్యర్థుల మధ్య సమరం కోసమే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌ టికెట్లకు విపరీతమైన డిమాండ్‌ నెలకొంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ టికెట్ల ధరను అమాంతం పెంచేసి ఐసీసీ ఆదాయం పొందాలనుకోవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. వచ్చే నెల 9న న్యూయార్క్‌లో జరిగే భారత్, పాక్‌ మ్యాచ్‌కు స్టేడియంలోని డైమండ్‌ క్లబ్‌ విభాగంలోని ఒక్కో సీటును 20 వేల అమెరికా డాలర్ల (సుమారు రూ.16.65 లక్షలు)కు అమ్మడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఐపీఎల్‌ మాజీ కమిషనర్‌ లలిత్‌ మోదీ తీవ్ర విమర్శలు చేశాడు. ‘‘ప్రపంచకప్‌లో భారత్, పాక్‌ మ్యాచ్‌కు డైమండ్‌ క్లబ్‌లోని ఒక్కో సీటు టికెట్‌ను ఐసీసీ 20 వేల డాలర్లకు విక్రయిస్తోందని తెలిసి షాక్‌కు గురయ్యా. అమెరికాలో ఈ ప్రపంచకప్‌ను నిర్వహించడానికి ముఖ్య కారణం ఆటను విస్తరించడం, అభిమానులను సంపాదించుకోవడమే. టికెట్ల విక్రయాలపై లాభం పొందడానికి కాదు’’ అని మోదీ ఎక్స్‌లో పోస్టు చేశాడు. ఐసీసీ ప్రకారం భారత్, పాక్‌ మ్యాచ్‌ టికెట్ల ధరలు 300 నుంచి 10 వేల డాలర్ల వరకూ ఉన్నాయి. అమెరికా, వెస్టిండీస్‌ ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న పొట్టికప్పులో భారత్‌ జూన్‌ 5న తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని