WPL Auction: డిసెంబర్‌ 9న డబ్ల్యూపీఎల్‌ వేలం.. స్లాట్‌లు 30.. అందుబాటులోకి 165 మంది

మహిళా ప్రీమియర్‌ లీగ్‌ 2024 (WPL 2024) కోసం క్రికెటర్ల వేలానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే తేదీ ఖరారు కాగా.. తాజాగా ప్లేయర్ల జాబితా కూడా సిద్ధమైంది.

Published : 02 Dec 2023 15:02 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టాటా మహిళా ప్రీమియర్‌ లీగ్‌ రెండో ఎడిషన్‌(WPL 2024) వేలానికి సంబంధించి జాబితాను నిర్వాహకులు విడుదల చేశారు. మొత్తం 165 మంది క్రికెటర్లు తమ పేరును నమోదు చేసుకున్నారు. డిసెంబర్‌ 9న ముంబయి వేదికగా ఈ వేలం జరగనుంది. మొత్తం 165 మందిలో 104 మంది భారత క్రికెటర్లు కాగా.. 61 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. మరో 15 మంది అసోసియేట్ దేశాల నుంచి కూడా తమ పేర్లను నమోదు చేసుకోవడం గమనార్హం. అయితే, 56 మంది మాత్రమే క్యాప్‌డ్ ప్లేయర్లు కాగా.. 109 మంది అన్‌క్యాప్‌డ్ క్రికెటర్లు. జాతీయ జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించిన వారిని క్యాప్‌డ్ ప్లేయర్లు అంటారు. నేషనల్ టీమ్‌కు ఇంకా ఆడనివారినే అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లుగా పిలుస్తారు. 

ఐదు ఫ్రాంచైజీ జట్లు ఈ వేలంలో పాల్గొంటాయి. 30 స్లాట్లు మాత్రమే అందుబాటులో ఉండటం గమనార్హం. వీటిలోనూ 9 స్లాట్లు ఓవర్సీస్‌ ప్లేయర్లవే. దిల్లీ క్యాపిటల్స్‌ 3 స్లాట్ల కోసం రూ.2.25 కోట్లు, గుజరాత్‌ జెయింట్స్‌ 10 స్లాట్ల కోసం రూ. 5.95 కోట్లు, ముంబయి ఇండియన్స్‌ 5 స్లాట్ల కోసం రూ. 2.1 కోట్లు, ఆర్‌సీబీ 7 స్లాట్ల కోసం రూ. 3.35 కోట్లు, యూపీ వారియర్స్ 5 స్లాట్ల కోసం రూ. 4 కోట్లను వెచ్చించనున్నాయి. దీంద్రా డాటిన్‌, కిమ్‌ గార్త్‌ అత్యధికంగా రూ. 50 లక్షలతో వేలంలోకి రానున్నారు. గతేడాది డాటిన్‌ను రూ. 60 లక్షలకు గుజరాత్‌ జెయింట్స్ కొనుగోలు చేసింది. అయితే, వైద్యపరమైన వివాదంతో రిలీజ్‌ చేయాల్సి వచ్చింది.  డాటిన్‌ ప్లేస్‌లో జట్టులోకి వచ్చిన గార్త్‌ను కూడా గుజరాత్‌ వదిలేయడం విశేషం. మరో నలుగురు ప్లేయర్లు రూ. 40 లక్షలతో తమ పేరును నమోదు చేసుకున్నారు. కనీసం రూ. 10 లక్షలతో కూడా క్రికెటర్లు వేలంలోకి వచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని