Shubman Gill: వచ్చాడు.. వచ్చాడు.. టీమ్‌ఇండియా యువరాజు

శుభ్‌మన్‌ గిల్‌.. 20 ఏళ్లకే టీమ్‌ఇండియాలో చోటు దక్కించుకుని అమోఘమైన ప్రదర్శనతో నిలకడగా రాణిస్తూ..పరుగుల వరద పారిస్తూ.. భారత భవిష్యత్‌ సూపర్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు.

Updated : 09 Nov 2023 16:57 IST

శుభ్‌మన్‌ వన్డేల్లో నంబర్‌వన్‌

పంజాబ్‌ నుంచి ఓ కుర్రాడొచ్చాడు. చిన్న వయస్సులోనే దేశవాళీ క్రికెట్లో ప్రకంపనలు సృష్టించాడు. 2018 అండర్‌-19 ప్రపంచకప్‌లో సత్తాచాటాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచి భారత్‌ ట్రోఫీ సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అప్పుడే అతని ప్రతిభ వెలుగులోకి వచ్చింది. 20 ఏళ్లకే టీమ్‌ఇండియాలో చోటు దక్కించుకున్నాడు. 2023 నుంచి అమోఘమైన ప్రదర్శనతో నిలకడగా రాణిస్తున్నాడు. పరుగుల వరద పారిస్తున్నాడు. రికార్డుల దుమ్ము దులుపుతున్నాడు. భారత భవిష్యత్‌ సూపర్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. క్రికెట్‌ దేవుడు సచిన్‌ తర్వాత కింగ్‌ కోహ్లి వచ్చాడు. ఇప్పుడు కోహ్లి తర్వాత ఎవరూ అంటే అతనే పేరే వినిపిస్తోంది. అతనే.. టీమ్‌ఇండియా యువరాజు శుభ్‌మన్‌ గిల్‌ (Shubman Gill). ఇప్పుడు వన్డే ర్యాంకింగ్స్‌లో తొలిసారి అగ్రస్థానం సాధించి తనపై అంచనాలను మరింత పెంచేశాడు.

ఆ దిగ్గజాల తర్వాత.. 

దిగ్గజం సచిన్‌ తెందుల్కర్, మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోని, కింగ్‌ కోహ్లి.. ఈ ముగ్గురూ తమదైన ఆటతీరుతో ప్రపంచ క్రికెట్లో అత్యున్నత శిఖరాలకు ఎదిగారు. టీమ్‌ఇండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. క్రికెట్‌ దేవుడిగా పేరు పొందిన సచిన్‌.. దిగ్గజ సారథిగా గుర్తింపు సాధించిన ధోని.. క్రికెట్‌ రారాజుగా కీర్తి సాధించిన కోహ్లి.. ఇలా ఈ ముగ్గురూ ఎవరికి వారే ప్రత్యేకం. అయితే వన్డే క్రికెట్లో ఈ ముగ్గురి ఆధిపత్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. వన్డే క్రికెట్లో నంబర్‌వన్‌ బ్యాటర్‌గా గతంలో ఈ ముగ్గురూ నిలిచారు. ఇప్పటికే సచిన్, ధోని జట్టుకు వీడ్కోలు పలికారు. ఇక కోహ్లి దూకుడు కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పుడు కోహ్లి వయస్సు 35 ఏళ్లు. అతని తర్వాత టీమ్‌ఇండియా సూపర్‌ స్టార్‌గా శుభ్‌మన్‌ కనిపిస్తున్నాడు. అవును.. తాజాగా ప్రపంచ నంబర్‌వన్‌ వన్డే ఆటగాడిగా ఎదిగిన అతను.. సచిన్, ధోని, కోహ్లి తర్వాత ఆ ఘనత సాధించిన నాలుగో భారత ఆటగాడిగా నిలిచాడు. 1988లో వన్డే ర్యాంకింగ్స్‌ ప్రవేశపెట్టగా ఇప్పటివరకూ భారత్‌ నుంచి కేవలం నలుగురు బ్యాటర్లే నంబర్‌వన్‌గా నిలిచారంటే దీనికున్న ప్రాముఖ్యత, ఇది సాధించడం వెనుక ఉండే కష్టం అర్థం చేసుకోవచ్చు. 

సొగసైన ఆటతో.. 

టీ20ల కాలంలో ఇప్పటి యువతరం ఆటగాళ్లు ధనాధన్‌ షాట్లు ఆడటంపైనే దృష్టి పెడుతున్నారు. కానీ 24 ఏళ్ల శుభ్‌మన్‌ మాత్రం ప్రస్తుత తరంలోని అరుదైన ఆటగాడు అని చెప్పాలి. టీ20లకు తగ్గట్లుగా వేగంగా ఆడటంతో పాటు వన్డేలకు అనుగుణంగా క్రీజులో కుదురుకోవడం, టెస్టు పరిస్థితులకు సర్దుకోవడం అతనికి తెలుసు. సొగసైన ఆటతీరు అతని సొంతం. ముఖ్యంగా వన్డేల్లో అతని ప్రదర్శన అమోఘం. క్రీజులో బలంగా నిలబడి మిడ్‌ వికెట్‌ మీదుగా బౌండరీ కోసం అతను కొట్టే హాఫ్‌ వ్యాలీ షాట్‌ చూసి వారెవా అనుకోవాల్సింది. అలాగే లాఫ్టెడ్‌ షాట్లలోనూ గిల్‌ ప్రత్యేకత వేరు. అతను 2019లో వన్డేలతోనే అంతర్జాతీయ క్రికెట్లో గిల్‌ అడుగుపెట్టాడు. జట్టులో పోటీ, కరోనా తదితర కారణాలతో 2022 జులై ముందు వరకూ అతను కేవలం మూడు వన్డేలు మాత్రమే ఆడగలిగాడు. కానీ ఆ తర్వాతే భారత క్రికెట్లో శుభ్‌మన్‌ శకం మొదలైంది. జట్టులో చోటును నిలబెట్టుకోవాలనే పట్టుదలతో పరుగుల వేటలో దూసుకెళ్తున్నాడు. శతకాలు బాదుతున్నాడు.

ఈ ఏడాది మన ఉప్పల్‌ స్టేడియంలో న్యూజిలాండ్‌పై వన్డేలో అతను సాధించిన ద్విశతకాన్ని ఎలా మర్చిపోగలం. వన్డేల్లో ద్విశతకం చేసిన అతి పిన్న వయస్సు ఆటగాడిగా శుభ్‌మన్‌ రికార్డు సృష్టించాడు. శుభ్‌మన్‌ సెంచరీలు చేసినా వెంటనే ఔటైపోవడం అతని తండ్రి లఖ్విందర్‌ సింగ్‌కు నచ్చలేదు. ఇదే విషయాన్ని గిల్‌కు చెప్తే.. వెంటనే కివీస్‌తో మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ చేసి తండ్రికి కానుకగా ఇచ్చాడు. తనయుడి కోసం లఖ్విందర్‌ సొంతంగా మైదానం ఏర్పాటు చేయడం విశేషం. ఇప్పటివరకూ గిల్‌ 41 వన్డేల్లో 61.02 సగటుతో 2136 పరుగులు చేశాడు. ప్రపంచ వన్డే క్రికెట్లో అత్యధిక వేగంగా (38 ఇన్నింగ్స్‌) 2 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడు అతనే. మరోవైపు టీ20ల్లోనూ అతని దూకుడు కొనసాగుతోంది. ఈ ఏడాది ఐఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ తరపున 17 మ్యాచ్‌ల్లో 59.33 సగటుతో 890 పరుగులు చేసి అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్‌ క్యాప్‌ సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది కివీస్‌తో టీ20లో అజేయంగా 126 పరుగులు చేసిన అతను.. పొట్టి ఫార్మాట్లో టీమ్‌ఇండియా తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇది శుభ్‌మన్‌కు ఆరంభం మాత్రమే. ఇంకెంతో సుదీర్ఘమైన కెరీర్‌ అతనికుంది. అతనిలాగే నిలకడగా రాణిస్తే దిగ్గజాలను దాటే అవకాశం ఉంది. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని