Prasidh Krishna: వన్డేల్లో హిట్టు.. టీ20ల్లో ఫట్టు .. ప్రసిద్ధ్‌ పంజా విసిరేనా?

టీమ్‌ఇండియా యువ బౌలర్‌ ప్రసిధ్ కృష్ణ (Prasidh Krishna) వన్డేల్లో అదగొట్టేస్తున్నాడు. కానీ, టీ20లకు వచ్చేసరికి ఇబ్బంది పడటం గమనార్హం. ఆసీస్‌తో పొట్టి సిరీస్‌లోనూ ధారాళంగా పరుగులు ఇచ్చేస్తున్నాడు.

Updated : 02 Dec 2023 12:36 IST

ఐపీఎల్‌లో మెరుపు ప్రదర్శన.. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా వికెట్లు రాబట్టి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు ప్రసిద్ధ్‌ కృష్ణ. మంచి ఎత్తుతో వేగం రాబడుతూ.. బౌన్స్, స్వింగ్‌ చేస్తూ బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నాడు. భారత జాతీయ జట్టులోకి దూసుకొచ్చాడు. వన్డేల్లో అద్భుతంగా బౌలింగ్‌ చేస్తూ వికెట్ల వేటలో సాగుతున్నాడు. కానీ టీ20లకు వచ్చేసరికి మాత్రం తేలిపోతున్నాడు. ధారాళంగా పరుగులు ఇచ్చేస్తున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాతో మూడో టీ20లోనూ పేలవ ప్రదర్శనతో జట్టు ఓటమిలో భాగమయ్యాడు. దీంతో అన్నివైపుల నుంచి అతనిపై విమర్శలు వస్తున్నాయి. మరి ఈ వైఫల్యం నుంచి అతను పుంజుకునేనా? 

కట్టడి చేయలేక.. 

4-0-68-0.. ఇవీ ఆస్ట్రేలియాతో మూడో టీ20లో ప్రసిద్ధ్‌ కృష్ణ గణాంకాలు. ఓవర్‌కు 17 పరుగుల చొప్పున ఎకానమీ రేటు నమోదు చేశాడు. చివరి ఓవర్‌లో 21 పరుగులు కాపాడుకుంటే భారత్‌దే విజయం. కానీ బౌలింగ్‌కు వచ్చిన ప్రసిద్ధ్‌ పరుగులు కట్టడి చేయడంలో విఫలమయ్యాడు. మ్యాక్స్‌వెల్‌కు పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో గెలిచేలా కనిపించిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌ అనే కాదు ఈ సిరీస్‌లో తొలి రెండింటిలోనూ ప్రసిద్ధ్‌ ధారళంగా పరుగులు ఇచ్చుకున్నాడు. రెండో టీ20లో మూడు వికెట్లు పడగొట్టినప్పటికీ 41 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక విశాఖలో జరిగిన తొలి టీ20లో 50 పరుగులిచ్చి ఒకే ఒక్క బ్యాటర్‌ను పెవిలియన్‌ చేర్చాడు. ఈ మూడు టీ20ల్లోనూ అతను పదికి పైగా ఎకానమీ రేటు నమోదు చేశాడు. ఇప్పటివరకూ ఆడిన 5 టీ20ల్లో ప్రసిద్ధ్‌ 8 వికెట్లు తీశాడు. కానీ 120 బంతులేసి ఏకంగా 220 పరుగులు ఇవ్వడం గమనార్హం. ఎకానమీ రేటు 11గా ఉంది. అదే వన్డేల విషయానికి వస్తే మాత్రం అతని గణాంకాలు ఎంతో మెరుగ్గా ఉన్నాయి. 17 వన్డేల్లో 29 వికెట్లు పడగొట్టిన అతని ఎకానమీ రేటు 5.60గా ఉంది.

ఆ గాయం..

వన్డేల్లో రాణిస్తున్న ప్రసిద్ధ్‌ టీ20ల్లో మాత్రం తేలిపోతున్నాడు. ఒత్తిడిని ఎదుర్కోలేకపోతున్నాడు. బ్యాటర్లను కట్టడి చేయలేకపోతున్నాడు. పరుగుల వేగానికి కళ్లెం వేయలేక చేతులెత్తేస్తున్నాడు. టీమ్‌ఇండియా భవిష్యత్‌ పేసర్‌గా ఎదిగేలా కనిపిస్తున్న అతని నుంచి ఇలాంటి ప్రదర్శన ఊహించనిదే. అయితే జట్టులో చోటు నిలబెట్టుకుంటున్న క్రమంలో గాయం ప్రసిద్ధ్‌ను దెబ్బతీసిందనే చెప్పాలి. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌లో ఆడిన టీమ్‌ఇండియాలో ప్రసిద్ధ్‌ మొదట నుంచే ఉండాల్సిందని చెప్పాలి. కానీ వెన్నెముక గాయం కారణంతో దాదాపు ఏడాదిగా ఆటకు దూరమయ్యాడు. కోలుకున్న అతను.. ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియాతో వన్డేల్లో ఆడాడు. కానీ ప్రపంచకప్‌ జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. మధ్యలో గాయం కారణంగా దూరమైన హార్దిక్‌కు బదులుగా ప్రపంచకప్‌ జట్టులోకి వచ్చాడు. కానీ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాలేదు.

ఇక వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో జట్టులో యువ రక్తాన్ని ఎక్కిస్తున్నారు. ఆ మెగా టోర్నీకి ముందు టీమ్‌ఇండియా ఇంకా 8 టీ20లు మాత్రమే ఆడనుంది. ఈ నేపథ్యంలో కుర్రాళ్లతో కూడిన జట్టును బీసీసీఐ ఆడిస్తోంది. కానీ ఈ ఏడాది ఆగస్టులోనే ఐర్లాండ్‌తో సిరీస్‌లో పొట్టి ఫార్మాట్లో అరంగేట్రం చేసిన ప్రసిద్ధ్‌ మాత్రం అంచనాలను అందుకోలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ప్రపంచకప్‌లో ఆడే అవకాశాన్ని దూరం చేసుకుంటున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఆసీస్‌తో మ్యాచ్‌లో 68 పరుగులు సమర్పించుకున్న అతను.. ఓ టీ20లో అత్యధిక పరుగులు ఇచ్చిన భారత పేసర్‌గా చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. దీంతో అతనిపై సామాజిక మాధ్యమాల్లో తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. మరి 27 ఏళ్ల ఈ కర్టాటక పేసర్‌ దీని నుంచి ఎలా పుంజుకుంటాడన్నది చూడాలి. మంచి నైపుణ్యాలున్న ప్రసిద్ధ్‌ పరుగులు కట్టడి చేయడంపై దృష్టి సారిస్తే టీ20ల్లోనూ విజయవంతమవుతాడు. మరి ఆ దిశగా అతను ఎలాంటి కసరత్తులు చేస్తాడన్నది ముఖ్యం. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని