IND vs ENG: ఈ ఇంగ్లిష్‌ టెస్టు చాలా టఫ్‌ గురూ! ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌లో టీమ్‌ఇండియా సవాళ్లివే

కొత్త ఏడాదిలో టీమ్‌ఇండియాకు అసలు సిసలైన పరీక్ష. ప్రమాదకర ఇంగ్లాండ్‌తో (IND vs ENG 2024) అయిదు టెస్టుల సిరీస్‌ గురువారమే ఆరంభం కానుంది.

Published : 24 Jan 2024 17:10 IST

భారత క్రికెట్‌ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పోరుకు సమయం ఆసన్నమైంది. ప్రమాదకర ఇంగ్లాండ్‌తో (IND vs ENG 2024) అయిదు టెస్టుల సిరీస్‌ గురువారమే ఆరంభం కానుంది. తొలి టెస్టు మన ఉప్పల్‌లోనే. ఆడేది స్వదేశంలోనే అయినా.. ఇక్కడ రోహిత్‌ సేనకు తిరుగులేకపోయినా.. ఈ ఇంగ్లిష్‌ టెస్టు మాత్రం చాలా టఫ్‌. బజ్‌బాల్‌ ఆటతీరుతో సాగుతున్న ఇంగ్లాండ్‌కు చెక్‌ పెట్టడం అంత సులువు కాదు. ఈ సిరీస్‌లో టీమ్‌ఇండియాకు సవాళ్లు ఎదురుకానున్నాయి. కొన్ని సమస్యలూ ఉన్నాయి. మరి స్వదేశంలో గత 16 టెస్టు సిరీస్‌లను సొంతం చేసుకున్న టీమ్‌ఇండియా ఈ ఛాలెంజ్‌లను దాటి అదరగొడుతుందా?ఉప్పల్‌లో జెండా ఎగరేసి సిరీస్‌ను ఘనంగా మొదలెడుతుందా? 

ఓపెనింగ్‌తో మొదలు!

భారత టెస్టు జట్టు సవాళ్లు ఓపెనింగ్‌తోనే మొదలవుతున్నాయి. ఓ ఓపెనర్‌గా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) ఆడతాడు. మరో ఓపెనర్‌గా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌ బరిలో దిగుతాడు. కానీ ఈ జోడీ ఇంకా కుదురుకోలేదనే చెప్పాలి. అనుకున్న స్థాయిలో రాణించడం లేదు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో ఈ ఓపెనర్ల ప్రదర్శనే అందుకు నిదర్శనం. సఫారీ గడ్డపై నాలుగు ఇన్నింగ్స్‌ల్లో ఒక్కసారి మాత్రమే వీళ్ల భాగస్వామ్యం 20 పరుగులు దాటింది. వెస్టిండీస్‌తో టెస్టు అరంగేట్రం చేసిన యశస్వికి స్వదేశంలో ఇదే తొలి టెస్టు సిరీస్‌. మరి ఈ సిరీస్‌లో రోహిత్‌తో కలిసి అతను మంచి ఆరంభాలను ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక మూడో స్థానంలో వచ్చే శుభ్‌మన్‌ కూడా టెస్టుల్లో ఆకట్టుకోలేకపోతున్నాడు. 20 టెస్టుల్లో 30.58 సగటు మాత్రమే నమోదు చేశాడు. 2021లో ఇంగ్లాండ్‌తో సొంతగడ్డపై ఆడిన నాలుగు టెస్టుల్లోనూ రాణించలేకపోయాడు. మూడో స్థానంలో ఆడి 6 ఇన్నింగ్స్‌ల్లో 103 పరుగులు మాత్రమే చేశాడు. సంధి దశలో ఉన్న జట్టుకు శుభ్‌మన్‌ ఫామ్‌ అందుకోవడం అత్యంత అవసరం.

బలహీనంగా మిడిలార్డర్‌

2021లో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో కోహ్లీ, పుజారా, రహానె ఉండటంతో మిడిలార్డర్‌ బాగుంది. కోహ్లీకి 113, పుజారాకు 103, రహానెకు 85 టెస్టుల అనుభవం ఉంది. కానీ వ్యక్తిగత కారణాల వల్ల తొలి రెండు టెస్టుల నుంచి కోహ్లీ తప్పుకోవడం.. పుజారా, రహానెకు జట్టులో చోటు దక్కకపోవడంతో మిడిలార్డర్‌ బలహీనంగా కనిపిస్తోంది. శ్రేయస్‌ అయ్యర్, కేఎల్‌ రాహుల్, కేఎస్‌ భరత్‌ ఏమేరకు రాణిస్తారో చూడాలి. ఇక కోహ్లీ లేని లోటు తీర్చలేనిదే. సొంతగడ్డపై కోహ్లీ టెస్టు సగటు 60.05గా ఉంది. ఇప్పుడా భారాన్ని శ్రేయస్‌ మోయగలడా? అన్నది ఆసక్తికరంగా మారింది. శ్రేయస్‌కు సొంతగడ్డపై మంచి రికార్డే ఉంది. కానీ నిరుడు ఆస్ట్రేలియా బౌలర్లను అతను సమర్థంగా ఎదుర్కోలేకపోయాడు. ముఖ్యంగా షార్ట్‌పిచ్‌ బంతి బలహీనతను అధిగమించాల్సి ఉంది. ఇప్పుడు ఇంగ్లాండ్‌ పేసర్లు కూడా ఇదే ఆయుధంతో అతడిని కట్టడి చేసేందుకు ప్రయత్నించొచ్చు. రాహుల్‌ ఫామ్‌ గురించి చింత లేదు. మరోవైపు జట్టులో పేస్‌ ఆల్‌రౌండర్‌ లేకపోవడం కూడా లోటే. భారత్‌ ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో ఆడే ఆస్కారముంది.

భరత్‌కు భలే ఛాన్స్‌

కేఎస్‌ భరత్‌కు మరోసారి మంచి అవకాశం దక్కనుంది. కేఎల్‌ రాహుల్‌ వికెట్‌ కీపింగ్‌ చేయడని కోచ్‌ ద్రవిడ్‌ చెప్పిన నేపథ్యంలో భరత్‌కు ఆ బాధ్యతలు అప్పజెప్పనున్నారు. మరి ఈ ఛాన్స్‌ను అతను ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి. వికెట్ల వెనకాల అతని ప్రదర్శనపై ఎలాంటి సందేహాలు లేవు. భారత అత్యుత్తమ వికెట్‌ కీపర్లలో అతను ఒకడు. స్పిన్‌ బౌలింగ్‌లోనూ మెరుగ్గా వికెట్‌ కీపింగ్‌ చేస్తాడు. కానీ అతను బ్యాటింగ్‌తో రాణించడం వ్యక్తిగతంగా భరత్‌కే కాకుండా జట్టుకు చాలా అవసరం. ఇప్పటివరకూ అయిదు టెస్టులాడిన ఈ ఆంధ్ర ఆటగాడు 129 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సిరీస్‌ అతని కెరీర్‌కు ఎంతో కీలకమైందనే చెప్పాలి. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని