ODI WC 2023: భారత్ వరుస విజయాలు.. ఆస్ట్రేలియాను గుర్తుకు తెస్తోంది!

ఒకప్పటి ఆసీస్‌లాగే ఇప్పుడు భారత్‌ కూడా అప్రతిహతంగా వరల్డ్‌ కప్పు (ODI World Cup 2023) ఎగరేసుకుపోగల సత్తా ఉన్నట్లు కనబడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

Updated : 03 Nov 2023 15:16 IST

ప్రపంచకప్‌లో ఏడు మ్యాచ్‌లకు ఏడు విజయాలు! దర్జాగా సెమీఫైనల్లో ప్రవేశం. ప్రపంచకప్‌ చరిత్రలోనే భారత్‌ ఇంతటి ఆధిపత్యం ఎన్నడూ ప్రదర్శించలేదు. భీకరమైన ఆటతో ఒకప్పుడు ప్రత్యర్థి జట్లను చివురుటాకులా వణికించిన ఆస్ట్రేలియాను గుర్తుకు తెస్తోంది రోహిత్‌ సేన. 

1983, 2011 ప్రపంచకప్పుల్లో గెలిచినా.. 2003 ప్రపంచకప్‌లో ఫైనల్‌ చేరినా.. భారత్‌ ఆధిపత్యం ఎప్పుడూ ఇలా సాగలేదు. పడుతూ లేస్తూనే ముందుకు సాగింది. నాకౌట్లో స్థిరత్వాన్ని ప్రదర్శించి 1983, 2011లో కప్పు గెలిచింది. 2003లోనూ భారత్‌ గొప్పగానే రాణించినా కెన్యా లాంటి పసికూనపై సెమీస్‌లో తడబడి గంగూలీ పుణ్యమా అని గట్టెక్కింది. ఫైనల్లో ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టు చేతిలో దారుణ పరాభవం చవిచూసింది. ఈ పరాభవం ఎలాంటిదంటే కొన్నేళ్లు అభిమానులు తేరుకోలేకపోయారు. కానీ అప్పుడు ఆస్ట్రేలియా ఎంతటి ఆధిపత్యాన్ని చూపించిందో.. కనికరం అన్నదే లేకుండా ప్రత్యర్థులను ఎలా వణికించిందో.. ఇప్పుడు భారత్‌ ఆట కూడా ప్రస్తుత ప్రపంచకప్‌లో అలా ఉంది. అందుకే మాజీ ఆటగాళ్లు సైతం ఇదే అభిప్రాయాన్ని వెల్లిబుచ్చుతున్నారు. అప్పటి ఆసీస్‌లాగే ఇప్పుడు భారత్‌ కూడా అప్రతిహతంగా కప్పు ఎగరేసుకుపోగల సత్తా ఉన్నట్లు కనబడుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా 1999, 2003 ప్రపంచకప్పుల్లో ఆసీస్‌ ఆధిపత్యం ఇలాగే సాగింది. ఆసీస్‌ మాత్రమే కాదు తొలి రెండు ప్రపంచకప్పుల్లో వెస్టిండీస్‌ కూడా అంతకుమించిన ఆధిపత్యంతో పేస్‌ బలంతో కప్‌లు ఎగరేసుకపోయింది.

పేస్‌ పవర్‌

2011లో భారత్‌ కప్పు గెలిచినా స్పిన్‌ బలంతోనే ఎక్కువ మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. కానీ ఇప్పుడు సీన్‌ మారింది. ఈ కప్‌లోనే భీకర త్రయంగా కనబడుతున్న బుమ్రా-సిరాజ్‌-షమిల అండతో ప్రత్యర్థులను వణికిస్తోంది భారత్‌. ఇంగ్లాండ్, శ్రీలంకపై టీమ్‌ఇండియా విజయాలు అలాంటివే. తొలి నాలుగు మ్యాచ్‌ల్లో కనీసం జట్టులో స్థానం దక్కించుకోలేకపోయిన షమి.. దొరికిన అవకాశాన్ని రెండు చేతులా అందుకుని రికార్డుల దుమ్ము రేపుతున్నాడు. న్యూజిలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంకపై 14 వికెట్లతో సంచలన ప్రదర్శన చేశాడు. లంకపై సిరాజ్‌ తన మార్కు చూపించాడు. ఇక బుమ్రా స్థిరంగా రాణిస్తున్నాడు. పవర్‌ప్లేలో ప్రత్యర్థి టాపార్డర్‌ పని పడుతున్నాడు.

దుర్భేద్యమైన బ్యాటింగ్‌

భారత్‌కు వెన్నెముక అయిన బ్యాటింగ్‌ ఈ కప్‌లో విజయాల వెనుక ప్రధానపాత్ర. కోహ్లి, రోహిత్‌ స్థిరంగా రాణిస్తూ సెమీస్‌ చేరడంలో కీలకపాత్ర పోషించారు. కోహ్లి 7 ఇన్నింగ్స్‌ల్లో 5 సార్లు 50పైన పరుగులు చేశాడు. ఇక రోహిత్‌ ఆరంభంలోనే చెలరేగుతూ తర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి తగ్గిస్తున్నాడు. ముఖ్యంగా ఛేదనలో అతడు ఎడాపెడా బాదుతుండంతో భారత్‌ అలవోకగా లక్ష్యం దిశగా సాగుతోంది. భారత్‌ ఇప్పటిదాకా ఆడిన 7 మ్యాచ్‌ల్లో విరాట్‌ లేదా రోహిత్‌ ఎవరో ఒకరు ప్రతి మ్యాచ్‌లో కనీసం అర్ధసెంచరీ చేశారు. జ్వరం నుంచి కోలుకుని వచ్చిన శుభ్‌మన్‌ గిల్, ఫామ్‌లోకి వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌ కూడా బ్యాట్‌ పవర్‌ చూపిస్తుండడంతో భారత్‌ బ్యాటింగ్‌ దుర్భేద్యంగా కనబడుతోంది. ఒకప్పుడు ఆసీస్‌ ఇలాంటి బ్యాటింగ్‌ శక్తితోనే కప్పులు ఎగరేసుకుపోయింది. 

నాకౌట్‌ బూచి

ఎలాగో సెమీస్‌కు వెళ్లిపోయింది భారత్‌. దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌ల్లోనూ సత్తా చాటితే ఆల్‌ విన్‌ రికార్డుతో నాకౌట్లోకి అడుగుపెట్టే అవకాశముంది. కానీ కొన్నేళ్లుగా నాకౌట్లోనే తడబడుతూ అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తున్న టీమ్‌ఇండియా.. ఈసారి అలాంటి తడబాటుకు చోటు ఇవ్వకూడదని అభిమానులు ఆశిస్తున్నారు. ముఖ్యంగా వరుసగా మ్యాచ్‌లు గెలుస్తుంటే అసలైన మ్యాచ్‌లో ఎక్కడ బోల్తా కొడతారేమోనని ఫ్యాన్స్‌ భయపడుతున్నారు. అయితే ఇక్కడ భారత్‌కు ఆస్ట్రేలియాకు తేడా ఒకటుంది. ఆ జట్టు ఏమాత్రం అలసత్వానికి తావు లేకుండా విజయం కోసం ఆఖరిదాకా పోరాడి కప్‌లు గెలిచింది. 1999 ప్రపంచకప్పే ఇందుకు నిదర్శనం. సెమీస్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి అంచులదాకా వెళ్లి మ్యాచ్‌ను తనవైపు తిప్పుకొంది. టీమ్‌ఇండియా కూడా ఆసీస్‌ మాదిరే ప్రొఫెషనల్‌ క్రికెట్‌ ఆడాలి. గెలుపు మత్తును తలకెక్కించుకోకుండా ప్రతి మ్యాచ్‌లోనూ ఆఖరిదాకా పోరాడాలి. బ్యాటింగ్, బౌలింగ్‌ ఎంత బలంగా ఉన్నా అలసత్వం ఆవహిస్తే పరాభవం తప్పదు. అందుకే విజయం కోసం భారత్‌ ఆఖరిదాకా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. 

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని