Team India: ర్యాంకుల్లో మనమే.. ప్రపంచ క్రికెట్లో భార‌త్ తిరుగులేని ఆధిప‌త్యం

ప్రస్తుత వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) టీమ్‌ఇండియా హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జట్టు కోణంలోనే కాదు.. ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన తీసుకున్నా మనమే టాప్‌ కావడం విశేషం.

Updated : 10 Nov 2023 11:27 IST

ప్రపంచ క్రికెట్లో భారత జట్టు ఆధిపత్యం మామూలుగా లేదిప్పుడు. టెస్టులు, వన్డేలు, టీ20లు.. ఈ మూడింట్లోనూ మన జట్టే నంబర్‌వన్‌ అన్న సంగతి తెలిసిందే. అంతే కాక ఐసీసీ ప్లేయర్‌ ర్యాంకింగ్స్‌లోనూ మనవాళ్లదే ఆధిపత్యం. ఇక ప్రస్తుత వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జట్టు కోణంలోనే కాదు.. ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన తీసుకున్నా భారత్‌ తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తోంది.

టీమ్‌ఇండియా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌.. తాజాగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకొచ్చాడు. సచిన్, ధోని, కోహ్లి లాంటి దిగ్గజ ఆటగాళ్ల తర్వాత భారత్‌ నుంచి వన్డేల్లో నంబర్‌వన్‌ అయింది శుభ్‌మనే. ఇప్పటిదాకా ఈ యువ ఓపెనర్‌ వన్డేల్లో ఆడింది 41 ఇన్నింగ్స్‌లే. ఇంతలోనే అగ్రస్థానం సాధించడం అనూహ్యం. కోహ్లి వల్ల కూడా సాధ్యం కాని డబుల్‌ సెంచరీని గిల్‌ అందుకున్నాడు. అతనిప్పటికే 6 శతకాలు బాదేశాడు. 2022 ఆరంభానికి ముందు టాప్‌-10లో కూడా లేని గిల్‌.. ఇప్పుడు బాబర్‌ అజామ్‌ను వెనక్కి నెట్టి ఏకంగా నంబర్‌వన్‌ అయిపోయాడు. ప్రస్తుతం శుభ్‌మన్‌ ఖాతాలో 830 పాయింట్లుంటే.. బాబర్‌ 824 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. విశేషం ఏంటంటే.. వన్డేల్లో నంబర్‌వన్‌ బౌలర్‌ కూడా భారతీయుడే. ఈ ఏడాది సూపర్‌ ఫామ్‌లో ఉన్న సిరాజ్‌ వికెట్ల మీద వికెట్లు తీస్తూ నంబర్‌వన్‌ బౌలరయ్యాడు. అతను 709 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బ్యాటర్ల టాప్‌-10 ర్యాంకింగ్స్‌లో భారత్‌ నుంచి ఇంకో ఇద్దరు ఆటగాళ్లున్నారు. కోహ్లి (770 పాయింట్లు) నాలుగో స్థానంలో ఉండగా.. రోహిత్‌ (739) ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.

బౌలర్ల టాప్‌-10లోనూ ఇంకో ముగ్గురు భారత ఆటగాళ్లున్నారు. కుల్‌దీప్‌ (661 పాయింట్లు), 4, బుమ్రా (654), 8, షమి (635) వరుసగా 4, 8, 10 స్థానాల్లో కొనసాగుతున్నారు. టీమ్‌ర్యాంకింగ్స్‌లో భారత్‌ కూడా ఈ ఏడాదే తిరిగి నంబర్‌వన్‌ అయిన సంగతి తెలిసిందే. టీ20ల్లో సూర్యకుమార్‌ చాన్నాళ్ల నుంచి నంబర్‌వన్‌ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. అతడి ఖాతాలో 863 పాయింట్లున్నాయి. రెండో స్థానంలో ఉన్న రిజ్వాన్‌ (787)కు అతడికి చాలా అంతరం ఉండటంతో సూర్య ఫామ్‌ కోల్పోతే తప్ప ఇంకా చాలా రోజులు అగ్రస్థానంలో కొనసాగే అవకాశముంది. ఈ ఫార్మాట్లో హార్దిక్‌ పాండ్య ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్నాడు. టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ భారత ఆటగాళ్ల హవా నడుస్తోంది. నంబర్‌వన్‌ బౌలర్‌ అశ్విన్‌ (879) కాగా, ఆల్‌రౌండర్లలో అగ్రస్థానం జడేజా (455)ది. బౌలర్లలో జడేజా మూడో స్థానంలో ఉంటే.. ఆల్‌రౌండర్లలో అశ్విన్‌ (370) రెండో స్థానంలో ఉండటం విశేషం. అక్షర్‌ పటేల్‌ (298) ఆల్‌రౌండర్లలో అయిదో స్థానంలో ఉన్నాడు. ఇలా మూడు ఫార్మాట్లలోనూ జట్టు, ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌ పరంగా భారత్‌ ఆధిపత్యం చలాయిస్తోంది.

కప్పులో దూకుడు

సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ మంచి అంచనాలతోనే బరిలోకి దిగింది. కానీ ఆ అంచనాలను మించిపోయి అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ల్లో మాత్రమే కొంచెం కష్టపడ్డ టీమ్‌ఇండియా.. మిగతా ప్రత్యర్థులను చిత్తుగా ఓడించింది. వేరే జట్లను వణికించిన దక్షిణాఫ్రికాకు చెమటలు పట్టించింది. టోర్నీలో ఇప్పటిదాకా అన్ని మ్యాచ్‌లూ గెలిచిన ఏకైక జట్టు భారతే. చివరి మ్యాచ్‌ నెదర్లాండ్స్‌తో కాబట్టి రోహిత్‌ సేన అజేయంగానే లీగ్‌ దశను ముగించే అవకాశముంది. ఇక టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన, వికెట్లు పడగొట్టిన ఆటగాళ్ల జాబితా తీస్తే అక్కడా భారత్‌ ఆధిపత్యమే కనిపిస్తోంది. బ్యాటర్లలో డికాక్‌ 550 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. కోహ్లి 543 పరుగులతో అతడి వెనుకే ఉన్నాడు. విరాట్‌ జోరు చూస్తుంటే టోర్నీలో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 442 పరుగులతో అయిదో స్థానంలో ఉన్నాడు. బౌలర్ల టాప్‌-10లో ముగ్గురు భారత ఆటగాళ్లున్నారు. టోర్నీలో 4 మ్యాచ్‌లే ఆడిన షమి 16 వికెట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. బుమ్రా (15), జడేజా వరుసగా 6, 7 స్థానాల్లో కొనసాగుతున్నారు. మన ఆటగాళ్లు ఇలాగే చెలరేగితే, జట్టు సమష్టి ప్రదర్శన కొనసాగితే వన్డే ప్రపంచకప్‌ మూడోసారి భారత్‌ సొంతం కావడం ఖాయం.

-ఈనాడు క్రీడావిభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని