SA vs IND: కేప్‌టౌన్‌ ఎదురు చూస్తోంది... మన పేసర్లకు సవాలే

జనవరి 3 నుంచి సౌతాఫ్రికా, భారత్ (SA vs IND) మధ్య కేప్‌టౌన్‌ వేదికగా రెండో టెస్టు ప్రారంభంకానుంది. 

Updated : 03 Jan 2024 09:30 IST

సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టులో ఒకవైపు దక్షిణాఫ్రికా ఫాస్ట్‌ బౌలర్లు అదరగొట్టేస్తే భారత పేసర్లు మాత్రం తేలిపోయారు. మన బ్యాటర్లు కష్టపడిన పిచ్‌పైనే టీమ్‌ఇండియా (Team India) పేసర్లను ధాటిగా ఎదుర్కొని తొలి ఇన్నింగ్స్‌లో 400పైన స్కోరు చేసింది సఫారీ జట్టు. మరి తేడా ఎక్కడ జరిగింది? దక్షిణాఫ్రికా బ్యాటర్లు బాగా ఆడారా? లేకపోతే భారత పేసర్లు విఫలమయ్యారా? అంటే కచ్చితంగా వైఫల్యం భారత పేసర్లదే! అక్కడి పరిస్థితులను చక్కగా సద్వినియోగం చేసుకుని సఫారీ పేసర్లు చెలరేగితే.. భారత బౌలర్లు మాత్రం తేలిపోయారు. ఇప్పుడు కేప్‌టౌన్‌లో జరిగే రెండో టెస్టు భారత పేసర్లకు మరింత పరీక్ష పెట్టనుంది.

కేప్‌టౌన్‌లో అంత వీజీ కాదు

సెంచూరియన్‌ పిచ్‌పై బౌన్స్‌ ఉంటుంది.. బంతి స్వింగ్‌ అవుతుంది. ఇలాంటి అనుకూలమైన పిచ్‌పైనే టీమ్‌ఇండియా పేసర్లు బుమ్రా, సిరాజ్‌ లాంటోళ్లు విఫలమయ్యారు. మరి పేస్‌కు పెద్దగా అనుకూలించని.. కాస్త మందకొడిగా ఉండే కేప్‌టౌన్‌ పిచ్‌పై భారత పేసర్లు ఏమాత్రం రాణించగలరు? కేప్‌టౌన్‌లో భారత పేసర్లు ఏమాత్రం ఆశలు పెట్టుకోవాలన్నా కొత్త బంతితోనే రాణించాలని దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజ పేసర్‌ అలెన్‌ డొనాల్డ్‌ కూడా అన్నాడు. బంతి కళకళలాడుతుండగానే పుల్లర్‌ లెంగ్త్‌లో స్వింగ్‌ చేస్తూ విసిరితే కచ్చితంగా ఫలితాలు సానుకూలంగా ఉంటాయన్నాడు. డొనాల్డ్‌ మాటలు అక్షర సత్యం. ఎందుకంటే దక్షిణాఫ్రికా పేసర్లకు కేప్‌టౌన్‌ కొట్టిన పిండి.

ఇక్కడ ఎలా బంతులు వేయాలో వాళ్లకు బాగా తెలుసు. బ్యాక్‌ ఆఫ్‌ లెంగ్త్‌ బంతులతో పాటు పుల్లర్‌ బంతులు వేసి బ్యాటర్లకు పరీక్ష పెట్టే అవకాశాలున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ మాదిరి ఎక్కువ షార్ట్‌ బంతులు వేయడం వల్ల కూడా ప్రయోజనం ఉండదు. ఇవి పరుగులుగా మారిపోతాయి. ప్రసిద్ధ్‌ కృష్ణ, శార్దూల్‌ ఠాకూర్‌కు ఈ అనుభవం ఎదురైంది. బంతిని బలంగా వదలడమే కాదు బ్యాటర్ల కదలికలను బట్టి కూడా డెలివరీ లెంగ్త్‌ ఉండాలి అన్న డొనాల్డ్‌ మాటలను యువ పేసర్లు విస్మరించారు. కేప్‌టౌన్‌ పిచ్‌పై స్పిన్నర్లకు కాస్త పట్టు చిక్కే అవకాశం ఉంటుంది. కానీ పూర్తిగా వారిపై ఆధారపడడం అవివేకం. ఎందుకంటే వాళ్లు ఎప్పుడైనా బ్రేక్‌ త్రూ ఇవ్వగలరు తప్ప ప్రధాన పాత్ర పోషించలేరు.

బ్యాటర్లూ కష్టపడాల్సిందే

సెంచూరియన్‌ పిచ్‌పై ఓపిగ్గా నిలిచిన దక్షిణాఫ్రికా బ్యాటర్లు భారత పేసర్లను దీటుగా ఎదుర్కొని పరుగులు రాబట్టారు. వచ్చిందే తడువుగా భారీ షాట్లకు పోలేదు. టీ20 ఫార్మాట్‌లో మాదిరిగా ప్రతి బంతిని కొట్టాలనుకోలేదు. ఈ ఆటిట్యూడ్‌ వల్లే దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో మెరుగైన స్కోరు చేయగలిగింది సఫారీ గడ్డపై స్కోరు చేయాలంటే బంతులను వదిలేయడం రావాలి అనేది మాజీల మాట. ఈ విషయంలో సచిన్‌ తెందుల్కర్‌ని ఉదాహరణగా చూసుకోవచ్చు. బ్యాక్‌ఫుట్‌పై ఆడుతూ క్లిష్టమైన బంతులను వదిలేసి కట్, డ్రైవ్‌లతోనే పరుగులు చేసేవాడు. పుల్‌ షాట్లు ఎక్కువ ఆడేవాడు కాదు. లెగ్‌గ్లాన్స్‌తో పరుగులు రాబట్టేవాడు. ప్రస్తుత భారత బ్యాటర్లు కూడా సచిన్‌ను అనుసరించాలి. వీలైనంతగా బంతులను వదిలేస్తూ చెత్త బంతులను మాత్రమే కొట్టాలి. సీనియర్లను పక్కనపెడితే శుభ్‌మన్‌ గిల్, శ్రేయస్‌అయ్యర్, యశస్వి జైస్వాల్‌ కచ్చితంగా ఈవిషయంలో జాగ్రత్తగా ఉండాలి.

  - ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని