T20 World cup: బెంగంతా బంతితోనే..

2022 టీ20 ప్రపంచకప్‌లో సునాయాసంగానే సెమీస్‌ చేరిన భారత్‌.. ఇంగ్లాండ్‌తో పోరుకు సిద్ధమైంది. మొదట బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా కష్టపడి 169 పరుగుల లక్ష్యాన్ని నిలిపితే.. ఇంగ్లాండ్‌ ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించేసి మన బౌలింగ్‌ డొల్లతనాన్ని బయటపెట్టింది.

Updated : 30 May 2024 04:01 IST

2022 టీ20 ప్రపంచకప్‌లో సునాయాసంగానే సెమీస్‌ చేరిన భారత్‌.. ఇంగ్లాండ్‌తో పోరుకు సిద్ధమైంది. మొదట బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా కష్టపడి 169 పరుగుల లక్ష్యాన్ని నిలిపితే.. ఇంగ్లాండ్‌ ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించేసి మన బౌలింగ్‌ డొల్లతనాన్ని బయటపెట్టింది. ప్రపంచకప్‌ లాంటి పెద్ద టోర్నీల్లో చాలాసార్లు భారత్‌కు బౌలింగ్‌ ఓ బలహీనతే. ఈసారి కూడా అందుకు భిన్నమేమీ కాదు. బుమ్రాను మినహాయిస్తే జట్టుకు భరోసానిచ్చే బౌలర్‌ కనిపించడం లేదు.

ఈనాడు క్రీడావిభాగం

భారత్‌ సంప్రదాయంగా బ్యాటింగే బలంగా ఉన్న జట్టు. ఈసారి కూడా కాగితం మీద చూస్తే బ్యాటింగ్‌ బలంగానే కనిపిస్తోంది. కానీ బౌలింగ్‌ మాత్రం ఆందోళన రేకెత్తిస్తోంది. ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో బౌలింగ్‌ మెరుగైన మాట వాస్తవం. కానీ చివరగా 2022లో జరిగిన పొట్టి కప్పులో భారత బౌలింగ్‌ బాగా బలహీనంగా కనిపించింది. అందుకు ప్రధాన కారణం జస్‌ప్రీత్‌ బుమ్రా లేకపోవడం. అయితే ఈసారి అతను అందుబాటులో ఉన్నాడు. పైగా ఐపీఎల్‌లో చక్కటి ప్రదర్శన కూడా చేశాడు. ఈ ఐపీఎల్‌లో ముంబయి పేలవంగా ఆడినప్పటికీ.. బుమ్రా మాత్రం 13 మ్యాచ్‌ల్లో 16.80 సగటుతో 20 వికెట్లు తీశాడు. బ్యాటర్ల దూకుడు వల్ల బౌలర్ల గణాంకాలు బాగా దెబ్బ తిన్న ఈ సీజన్లో అతను కేవలం 6.48 ఎకానమీ నమోదు చేశాడు. బుమ్రా సూపర్‌ ఫామ్‌ జట్టుతో పాటు అభిమానులకూ ఎంతో భరోసానిచ్చేదే. కానీ బుమ్రా తోడుగా బౌలింగ్‌ దాడిని ముందుకు తీసుకెళ్లే బౌలర్లెవరన్నదే ప్రశ్న. 

ఇద్దరూ అంతంతమాత్రమే..

భారత్‌కు ప్రధానంగా ఆందోళన రేకెత్తిస్తున్నది బుమ్రాతో బంతిని పంచుకునే పేసర్ల ఫామే. టీమ్‌ఇండియాకు చాన్నాళ్లుగా ఆడుతున్నప్పటికీ.. పరిమిత ఓవర్ల క్రికెట్లో, ముఖ్యంగా టీ20ల్లో సిరాజ్‌ ప్రదర్శన ఏమంత గొప్పగా లేదు. 10 అంతర్జాతీయ టీ20ల్లో అతను 12 వికెట్లే పడగొట్టాడు. ధారాళంగా పరుగులిచ్చేయడం అతడి బలహీనత. బౌలింగ్‌లో వైవిధ్యం కూడా ఉండదు. ఈ ఐపీఎల్‌లో బెంగళూరు తరఫున సిరాజ్‌ తేలిపోయాడు. 14 మ్యాచ్‌ల్లో 15 వికెట్లే తీశాడు. ఎకానమీ 9 పైనే. తొలి అర్ధభాగంలో అయితే ప్రదర్శన మరీ తీసికట్టుగా తయారైంది. తర్వాత కొంత పుంజుకున్నాడు. కానీ మొత్తంగా ఇటీవల సిరాజ్‌ ప్రదర్శన ఆశాజనకంగా లేదు. మరో పేసర్‌ అర్ష్‌దీప్‌ మీద కూడా ఎక్కువ ఆశలు పెట్టుకోలేం. అంతర్జాతీయ క్రికెట్లో వచ్చిన అవకాశాలను అతను సద్వినియోగం చేసుకోలేదు. ఒక దశలో రెగ్యులర్‌ సభ్యుడిగా ఉన్న అతను.. తర్వాత నిలకడ తప్పి జట్టులో చోటు కోల్పోయాడు. ఇప్పుడు మళ్లీ ప్రపంచకప్‌లో అవకాశం దక్కించుకున్నాడు. ఐపీఎల్‌-17లో అర్ష్‌దీప్‌ 14 మ్యాచ్‌ల్లో 19 వికెట్లతో ఆకట్టుకున్నాడు. కానీ తన ఎకానమీ 10కి పైనే. వికెట్లు తీసినా పరుగులు నియంత్రించడంలో విఫలమయ్యాడు. ఈ బలహీనత ఎప్పట్నుంచో అతణ్ని వెంటాడుతోంది. మరి ప్రపంచకప్‌లో అతను ఏమేర అంచనాలను అందుకుంటాడో చూడాలి. పేస్‌ ఆల్‌రౌండర్లు హార్దిక్‌ పాండ్య, శివమ్‌ దూబెల నుంచి ఎక్కువ ఆశించలేం. హార్దిక్‌ ఐపీఎల్‌లో తేలిపోయాడు. కొన్నిసార్లు వికెట్లు తీసినా.. ప్రతి మ్యాచ్‌లో బాగా పరుగులిచ్చేశాడు. ప్రపంచకప్‌లో భిన్నమైన హార్దిక్‌ కనిపిస్తాడేమో చూడాలి. దూబె ఒక్క మ్యాచ్‌లోనే బౌలింగ్‌ చేశాడు. దూబె తుది జట్టులో ఉన్నా బౌలింగ్‌లో అతణ్ని ఉపయోగించుకోవడం సందేహమే.

స్పిన్‌ పర్వాలేదు..

భారత స్పిన్‌ విభాగం పర్వాలేదనిపిస్తోంది. ముఖ్యంగా కుల్‌దీప్‌ ఆశలు రేకెత్తిస్తున్నాడు. గత కొన్ని నెలల్లో అంతర్జాతీయ క్రికెట్లోనే కాక ఐపీఎల్‌లోనూ రాణించాడు. దిల్లీ తరఫున ఈ సీజన్లో 11 మ్యాచ్‌లాడి 16 వికెట్లు పడగొట్టాడు. బంతిని చక్కగా టర్న్‌ చేస్తూ, వైవిధ్యం చూపిస్తున్న కుల్‌దీప్‌ ప్రత్యర్థులకు సవాలు విసిరేలాగే కనిపిస్తున్నాడు. మిగతా స్పిన్నర్లు అతనంత ఫామ్‌లో లేరు. తొలిసారి టీ20 ప్రపంచకప్‌లో అవకాశం దక్కించుకున్న చాహల్‌.. ఈ ఐపీఎల్‌లో ఒక దశ వరకు బాగానే రాణించాడు. కానీ చివరి దశలో విఫలమయ్యాడు. మొత్తంగా ఈ సీజన్లో చాహల్‌ 15 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు తీశాడు. అతడి ఎకానమీ దాదాపు 10 కావడం గమనార్హం. స్పిన్‌ ఆల్‌రౌండర్లు జడేజా, అక్షర్‌ పటేల్‌ ఫామ్‌ కూడా ఏమంత గొప్పగా లేదు. ఐపీఎల్‌లో ఎప్పుడూ బాగానే వికెట్లు తీసే జడ్డూ.. ఈసారి 8 వికెట్లకు పరిమితమయ్యాడు. బంతిని ఎక్కువగా స్పిన్‌ చేయలేకపోతున్న జడ్డూను బ్యాటర్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌లాడి 11 వికెట్లే తీసిన అక్షర్‌ పటేల్‌ మీద కూడా పెద్దగా అంచనాలు లేవు. అతడికి తుది జట్టులో చోటు దక్కడం సందేహమే. ఉన్నా అంతగా ప్రభావం చూపగలడా అన్నది ప్రశ్న.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని