Team India: టీమ్‌ఇండియా.. సీనియర్ల లోటు పూడ్చే కుర్రాళ్లు ఎవరు?

ప్రతి ఆటలోనూ.. సీనియర్‌ ఆటగాళ్ల స్థానాన్ని జూనియర్లు భర్తీ చేస్తుంటారు. ప్రస్తుతం టీమ్‌ఇండియా కూడా సీనియర్ల స్థానాన్ని భర్తీ చేసే వారి కోసం ఎదురుచూస్తోంది. మరి, సీనియర్ల స్థానాన్ని పూడ్చే కుర్రాళ్లు ఎవరో..?

Published : 05 Jan 2024 17:33 IST

రోజులు గడుస్తున్న కొద్దీ.. ఏళ్లు కరుగుతున్న కొద్దీ.. కాలానుసారం మార్పులు జరుగుతూనే ఉంటాయి. భారత క్రికెట్‌ జట్టు కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఎంత దిగ్గజ ఆటగాడైనా ఏదో ఒక రోజు ఆటకు వీడ్కోలు పలకాల్సిందే. పాత నీరు వెళ్తేనే.. కొత్త నీరు వచ్చేది. ప్రతి జట్టులోనూ సంధి దశ ఉంటుంది. సీనియర్‌ ఆటగాళ్ల ప్లేసులను భర్తీ చేసేందుకు జూనియర్లు వస్తారు. ఇప్పుడు టీమ్‌ఇండియా కూడా అలాంటి సంధి దశలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా టెస్టుల్లో ఆటగాళ్ల మార్పు అనివార్యమైంది. మరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, సీనియర్ల లోటును తీర్చేదెవరు? భారత జట్టు భవిష్యత్‌ తారలుగా నిలిచెదేవరు? 

ఆ దిగ్గజాలు వెళ్లినా..

గంగూలీ, సెహ్వాగ్, సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, ధోని, యువరాజ్‌ సింగ్, జహీర్‌ఖాన్, ఆశిష్‌ నెహ్రా, ఇర్ఫాన్‌ పఠాన్, అనిల్‌ కుంబ్లే, హర్భజన్‌ లాంటి దిగ్గజాలతో ఒకప్పుడు టీమ్‌ఇండియా కళకళలాడుతుండేది. వీళ్లతో కూడిన జట్టు ఎంతో పటిష్ఠంగా కనిపించేది. దీంతో వీళ్లు ఆటకు వీడ్కోలు పలికితే జట్టు పరిస్థితి ఏమిటీ? వీళ్లను భర్తీ చేసే అసలైన వారసులు వస్తారా? అనే ప్రశ్నలు రేకెత్తాయి. కానీ రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్, కోహ్లి, పుజారా, రహానె, జడేజా, బుమ్రా, షమి, సిరాజ్, అశ్విన్‌ లాంటి ఆటగాళ్లు వచ్చారు. ఉత్తమ ప్రదర్శనతో జట్టును విజయాల దిశగా నడిపిస్తున్నారు. జట్టుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశారు. కానీ ఇప్పుడు మరోసారి జట్టులోని సీనియర్‌ ఆటగాళ్లు బయటకు వెళ్లక తప్పడం లేదు. ఇప్పుడు అవకాశాన్ని అందిపుచ్చుకోవడం కోసం యువ ఆటగాళ్లు ఉత్సాహంతో ఉన్నారు. ఘన వారసత్వాన్ని నిలబెట్టే బాధ్యతలను తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. 

ఇప్పుడు ఎవరు? 

ఇప్పటికే పుజారా, రహానె టెస్టు జట్టుకు దూరమయ్యారు. కెప్టెన్‌ రోహిత్‌ కెరీర్‌ చరమాంకంలో ఉన్నాడు. స్టార్‌ బ్యాటర్‌ కోహ్లి కెరీర్‌ కూడా ముగింపు దిశగా సాగుతోంది. గాయాలతో ఇబ్బంది పడుతున్న షమి కూడా ఎక్కువ కాలం ఆడేలా కనిపించడం లేదు. సీనియర్‌ స్పిన్నర్లు అశ్విన్, చాహల్‌కు అవకాశాలు రావడం లేదు. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా సంధి దశను ఎదుర్కొంటుందనే చెప్పాలి. మరి ఈ దశ సాఫీగా సాగేలా, ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురు కాకుండా ఉండేలా జట్టులోకి వచ్చే యువ ఆటగాళ్లు సత్తా చాటాల్సిన అవసరం ఉంది. 37 ఏళ్లకు చేరువలో ఉన్న రోహిత్‌ ఇంకెంతో కాలం జట్టులో కొనసాగే పరిస్థితి లేదనే చెప్పాలి. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ తర్వాత అతడి ప్రయాణం ముగింపు దిశగా సాగే అవకాశముంది. రోహిత్‌ ప్లేసును భర్తీ చేసేందుకు రుతురాజ్‌ గైక్వాడ్, పృథ్వీ షా లాంటి యువ ఆటగాళ్లు రేసులో ఉన్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో శుభ్‌మన్, టెస్టుల్లో యశస్వి జైస్వాల్‌ మరో ఓపెనర్‌గా ఆడుతున్నారు. ఇక కోహ్లిని రీప్లేస్‌ చేసే నైపుణ్యాలు హైదరాబాదీ యువ బ్యాటర్‌ తిలక్‌ వర్మలో కనిపిస్తున్నాయి.

టెస్టుల విషయానికి వస్తే పుజారా, రహానె ప్లేసుల్లో ఇప్పుడు శుభ్‌మన్, శ్రేయస్‌ ఆడుతున్నారు. బౌలింగ్‌లో చూస్తే ముకేశ్‌ కుమార్, అవేశ్‌ ఖాన్, ప్రసిద్ధ్‌ కృష్ణ, అర్ష్‌దీప్‌ సింగ్, రవి బిష్ణోయ్, వాషింగ్టన్‌ సుందర్‌ ఛాన్స్‌లు అందుకునేలా కనిపిస్తున్నారు. కానీ రోహిత్, కోహ్లి, పుజారా, రహానె, అశ్విన్, షమి, చాహల్‌ ఖాళీ చేసే ప్లేసులను భర్తీ చేయడం అంత సులువు కాదు. అత్యుత్తమ ప్రదర్శనతో వీళ్లు లేని లోటును మరిపించాల్సిన బాధ్యత ఈ యువ ఆటగాళ్లపై ఉంది. కానీ దక్షిణాఫ్రికాతో టెస్టుల్లో యశస్వి, శుభ్‌మన్, శ్రేయస్, ప్రసిద్ధ్‌ అంచనాలను అందుకోలేకపోయారు. తీవ్రంగా నిరాశపరిచారు. ఇప్పటికే జట్టులో చోటు కోసం ఆటగాళ్ల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. ఈ నేపథ్యంలో నిలకడగా రాణించకపోతే అది వ్యక్తిగతంగానే కాదు జట్టుకూ నష్టం చేసే ప్రమాదముంది. అందుకే జట్టు ఆశలు నిలబడేలా, అంచనాలు అందుకునేలా యువ ఆటగాళ్లు సత్తాచాటాల్సి ఉంది. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని