Icc World Cup 2023: కలల పరుగుకు కన్నీటి ముగింపు

ఎంత బాధ.. ఎంత వేదన! శిఖరం నుంచి లోయకు పడ్డ భావన ఓ కల లాంటి పరుగుకు ... పీడకల లాంటి ముగింపు! ఓ అద్భుత అవకాశం చేజారింది.. ఓ స్వప్నం చెదిరింది.

Updated : 20 Nov 2023 06:49 IST

భారత్‌కు భంగపాటు
ఫైనల్లో పరాజయం
కంగారూలకు ఆరో ప్రపంచకప్‌
సెంచరీతో మెరిసిన హెడ్‌
అహ్మదాబాద్‌

ఎంత బాధ.. ఎంత వేదన! శిఖరం నుంచి లోయకు పడ్డ భావన ఓ కల లాంటి పరుగుకు ... పీడకల లాంటి ముగింపు! ఓ అద్భుత అవకాశం చేజారింది.. ఓ స్వప్నం చెదిరింది.

ప్రారంభం నుంచి పరుగుల వరద పారించి.. వికెట్ల వేటలో దూసుకుపోయి.. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టి.. పదికి పది మ్యాచ్‌లూ గెలిచి ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచిన అజేయ శక్తి ఆఖరి మెట్టుపై బోల్తా కొట్టింది. ఆశల పల్లకిలో ఊరేగుతూ అద్భుత ముగింపు కోసం ఎదురుచూసిన అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తూ టీమ్‌ఇండియా (Team India) వన్డే ప్రపంచకప్‌ (Icc World Cup) ఫైనల్లో పరాజయం పాలైంది.

రెండు దశాబ్దాల తర్వాతా అదే దృశ్యం. 2003 పునరావృతం. అప్పటిలాగే టైటిల్‌ పోరులో భారత్‌ (India)ను ఓడించిన ఆస్ట్రేలియా (Australia) ఆరోసారి జగజ్జేతగా నిలిచింది. సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన కంగారూ జట్టు ఆఖరి పోరాటంలో 6 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. హెడ్‌ సూపర్‌ సెంచరీతో ఆసీస్‌ హీరోగా నిలిచాడు. మొదట 240 పరుగులతో సరిపెట్టుకున్న టీమ్‌ఇండియా.. బంతితో ఆరంభంలో కాస్త ఆశలు రేపినా క్రమంగా తేలిపోయింది.

తిరుగులేని ఆటతో ఫైనల్‌కు దూసుకొచ్చిన జట్టేనా ఇది అన్న భావన కలగని అభిమాని లేడు. బ్యాటింగ్‌లో ఆ నిర్భీతి ఏమైందో.. బౌలింగ్‌లో ఆ పదును ఎక్కడికెళ్లిందో! కొన్ని ఓవర్లు తప్ప అభిమానులతో కిక్కిరిసిన స్టేడియంలో ఆద్యంతం నిశ్శబ్దమే.

.. ప్చ్‌! కప్పును భారత్‌ మళ్లీ ముద్దాడేదెప్పుడో!

ప్చ్‌.. టీమ్‌ఇండియా (Team India)! టోర్నీ ఆరంభం నుంచి ఎంతో అద్భుతంగా ఆడినా ఆఖరికి మిగిలింది నిరాశే. అంతిమ సమరంలో రోహిత్‌సేన (Rohit Sharma) బోల్తా కొట్టింది. ఆదివారం వన్డే ప్రపంచకప్‌ (Icc World Cup) ఫైనల్లో 6 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. మొదట బ్యాటుతో తడబడ్డ భారత్‌.. 50 ఓవర్లలో 240 పరుగులకే ఆలౌటైంది. రోహిత్‌ (47; 31 బంతుల్లో 4×4, 3×6) ఎప్పట్లాగే మెరుపు ఇన్నింగ్స్‌ ఆడినా.. ఏ ఒక్కరి నుంచి భారీ ఇన్నింగ్స్‌ లేకపోవడం భారత్‌ను దెబ్బతీసింది. రాహుల్‌ (66; 107 బంతుల్లో 1×4) పోరాడినా అతడి ఇన్నింగ్స్‌లో దూకుడు లేదు. కోహ్లి (54; 63 బంతుల్లో 4×4) రాణించాడు. బౌలింగ్‌కు సహకరించిన పిచ్‌పై స్టార్క్‌ (3/55), కమిన్స్‌ (2/34), హేజిల్‌వుడ్‌ (2/60) అద్భుత బౌలింగ్‌తో భారత్‌ను కట్టడి చేశారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హెడ్‌ (137; 120 బంతుల్లో 15×4, 4×6) సూపర్‌ సెంచరీతో లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లబుషేన్‌ (58 నాటౌట్‌; 110 బంతుల్లో 4×4) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. కోహ్లి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు అందుకున్నాడు.

ఆశలు రేపినా..: చేసింది తక్కువ స్కోరే అయినా.. బ్యాటింగ్‌కు అంతగా అనుకూలంగా లేని పిచ్‌పై ఆశలతోనే బౌలింగ్‌ దాడిని ఆరంభించింది టీమ్‌ఇండియా. అందుకు తగ్గట్లే 47కే మూడు వికెట్లు పడగొట్టి ఉత్తేజాన్ని పొందింది. అభిమానులను సంతోషంలో ముంచెత్తింది. రెండో ఓవర్లోనే వార్నర్‌ (7)ను షమి ఔట్‌ చేయగా.. ప్రమాదకర మార్ష్‌ (15)ను అయిదో ఓవర్లో బుమ్రా పెవిలియన్‌ చేర్చాడు. ఏడో ఓవర్లో స్మిత్‌ (4)ను బుమ్రా వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో ఛేదన ఆసీస్‌కు అంత తేలిక కాదనపించింది. మ్యాచ్‌లో భారత్‌కు మంచి అవకాశాలే ఉన్నట్లు అనిపించింది. కానీ అద్భుతంగా ఆడిన హెడ్‌.. లబుషేన్‌తో కలిసి భారత్‌కు మ్యాచ్‌ను దూరం చేశాడు. మూడు వికెట్లు పడ్డా.. సాధికారికంగా బ్యాటింగ్‌ చేశాడు హెడ్‌. స్ట్రైక్‌రొటేట్‌ చేస్తూ లబుషేన్‌ అతడికి సహకారాన్నిచ్చాడు. క్రమంగా పిచ్‌పై బ్యాటింగ్‌ తేలికైంది. ఫాస్ట్‌బౌలర్ల ప్రభావం తగ్గుతూ పోయింది. స్పిన్నర్లు కుల్‌దీప్‌, జడేజా ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. చక్కని షాట్లు ఆడుతూ 58 బంతుల్లో అర్ధశతకం సాధించిన హెడ్‌.. మరో 37 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. 37వ ఓవర్లో హెడ్‌ కొట్టిన సిక్స్‌తో ఆసీస్‌ స్కోరు 200 దాటింది. 43వ ఓవర్లో స్కోరు 239 వద్ద హెడ్‌ ఔట్‌ కాగా.. తర్వాతి బంతికే మ్యాక్స్‌వెల్‌ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

భారత్‌ కష్టంగా..: టోర్నీ మొదలైనప్పటి నుంచి పరుగుల వరద పారించిన టీమ్‌ఇండియాకు ఈ మ్యాచ్‌లో ఆరంభం ఎంత మాత్రం ఊహించనిదే. టాస్‌ గెలిచిన కమిన్స్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా.. మందకొడి పిచ్‌పై భారత్‌కు పరుగులు చేయడం కష్టమే అయింది. ఆసీస్‌ బౌలర్లు గుడ్‌ లెంగ్త్‌, షార్ట్‌ లెంగ్త్‌, స్లో బంతులతో బ్యాటర్లకు కళ్లెం వేశారు. ఏమాత్రం స్వేచ్ఛగా ఆడే అవకాశం లేకపోయింది. ఇన్నింగ్స్‌ సాగుతున్నకొద్దీ స్ట్రోక్‌ప్లేకు కష్టమే అయింది తప్ప.. తేలిక కాలేదు. ఇన్నింగ్స్‌ మొత్తంలో కేవలం 13 ఫోర్లు, మూడు సిక్స్‌లు నమోదయ్యాయంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. భారత్‌ ఇన్నింగ్స్‌లో ఏవైనా మెరుపులు ఉన్నాయంటే.. అది రోహిత్‌ ఉన్నంత వరకే. తొలి 10 ఓవర్లలో 80 పరుగులు చేసిన భారత్‌.. తర్వాతి 40 ఓవర్లలో కేవలం 160 పరుగులే చేయగలిగింది.

బౌండరీలు కరవు: ఇన్నింగ్స్‌ ఆరంభంలో కొన్ని బంతులపాటు సంయమనం పాటించినా.. క్రమంగా తనదైన శైలిలో బ్యాట్‌ ఝుళిపించాడు రోహిత్‌. హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో వరుసగా 6, 4 దంచేశాడు. కానీ టాప్‌ గేర్‌లో ఆడే రోహిత్‌కు టోర్నీలో మరోవైపు నుంచి చక్కని సహకారాన్నిస్తూ వస్తున్న మరో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (4) అయిదో ఓవర్లోనే నిష్క్రమించడం భారత్‌కు పెద్ద షాక్‌. అయినా తగ్గని రోహిత్‌... స్టార్క్‌, మ్యాక్స్‌వెల్‌ బౌలింగ్‌లో సిక్స్‌లు దంచేశాడు. కానీ అదే జోరులో మ్యాక్స్‌వెల్‌ బౌలింగ్‌లో ఓ భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో హెడ్‌ అందుకున్న గొప్ప క్యాచ్‌కు అతడు వెనుదిరిగాడు. అంతలోనే ఇంకో షాక్‌. సూపర్‌ఫామ్‌లో ఉన్న శ్రేయస్‌ (4) తర్వాతి ఓవర్లోనే నిష్క్రమించాడు. ఆ దశలో కోహ్లి, రాహుల్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఆరంభంలో బౌండరీలతో జోరు మీద కనిపించించిన కోహ్లీకి జాగ్రత్తగా ఆడక తప్పలేదు. రాహుల్‌ మరీ డిఫెన్సివ్‌గా ఆడాడు. కానీ చివరికి భారత్‌ ఆమాత్రం స్కోరు చేయడంలో అతడి ఇన్నింగ్సే కీలకం. రాహుల్‌, కోహ్లి జంట 18.1 ఓవర్లలో 67 పరుగులు మాత్రమే జోడించింది. 97 బంతులపాటు వీళ్లు ఫోర్‌ లేకుండా ఆడారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయినా 28.2 ఓవర్లలో 148/3తో భారత్‌ కుదురుకున్నట్లే కనిపించింది. కానీ నిలదొక్కుకున్న కోహ్లీని కమిన్స్‌ బౌల్డ్‌ చేయడంతో భారత్‌కు మళ్లీ ఇబ్బందులు మొదలయ్యాయి. రాహుల్‌ బౌండరీలు బాదలేకపోయినా.. ఒక్కో పరుగే జోడిస్తూ జట్టుకు పోటీ ఇవ్వగలిగే స్కోరు అందించేందుకు కష్టపడ్డాడు. అయిదో వికెట్‌కు అతడితో 30 పరుగులు జోడించాక జడేజా (9) ఔటయ్యాడు. సూర్య (18; 28 బంతుల్లో 1×4)తో కలిసి జట్టు స్కోరును 200 దాటించిన రాహుల్‌.. గేర్‌ మార్చాల్సిన దశలో 42వ ఓవర్లో ఔట్‌ కావడం భారత్‌కు పెద్ద దెబ్బ. ఆ తర్వాత ఆసీస్‌ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌ను కొనసాగించారు .ఉన్నంతసేపూ ఇబ్బందిపడ్డ సూర్య.. చివరికి 48వ ఓవర్లో వెనుదిరిగాడు. కుల్‌దీప్‌ (10), సిరాజ్‌ (9 నాటౌట్‌) ఆఖరి వికెట్‌కు 14 పరుగులు జోడించడంతో భారత్‌ 240కి చేరుకోగలిగింది. భారత్‌ చివరి 9 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది. ఆఖరి 40 ఓవర్లలో భారత్‌కు నాలుగు బౌండరీలే రావడం గమనార్హం.

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) హెడ్‌ (బి) మ్యాక్స్‌వెల్‌ 47; శుభ్‌మన్‌ గిల్‌ (సి) జంపా (బి) స్టార్క్‌ 4; కోహ్లి (బి) కమిన్స్‌ 54; శ్రేయస్‌ అయ్యర్‌ (సి) ఇంగ్లిస్‌ (బి) కమిన్స్‌ 4; రాహుల్‌ (సి) ఇంగ్లిస్‌ (బి) స్టార్క్‌ 66; జడేజా (సి) ఇంగ్లిస్‌ (బి) హేజిల్‌వుడ్‌ 9; సూర్యకుమార్‌ (సి) ఇంగ్లిస్‌ (బి) హేజిల్‌వుడ్‌ 18; షమి (సి) ఇంగ్లిస్‌ (బి) స్టార్క్‌ 6; బుమ్రా ఎల్బీ (బి) జంపా 1; కుల్‌దీప్‌ యాదవ్‌ రనౌట్‌ 10; సిరాజ్‌ నాటౌట్‌ 9; ఎక్స్‌ట్రాలు 12 మొత్తం: (50 ఓవర్లలో ఆలౌట్‌) 240; వికెట్ల పతనం: 1-30, 2-76, 3-81, 4-148, 5-178, 6-203, 7-211, 8-214, 9-226; బౌలింగ్‌: స్టార్క్‌ 10-0-55-3; హేజిల్‌వుడ్‌ 10-0-60-2; మ్యాక్స్‌వెల్‌ 6-0-35-1; కమిన్స్‌ 10-0-34-2; జంపా 10-0-44-1; మార్ష్‌ 2-0-5-0; హెడ్‌ 2-0-4-0

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) కోహ్లి (బి) షమి 7; హెడ్‌ (సి) గిల్‌ (బి) సిరాజ్‌ 137; మార్ష్‌ (సి) రాహుల్‌ (బి) బుమ్రా 15; స్మిత్‌ ఎల్బీ (బి) బుమ్రా 4; లబుషేన్‌ నాటౌట్‌ 58; మ్యాక్స్‌వెల్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 18 మొత్తం: (43 ఓవర్లలో 4 వికెట్లకు) 241; వికెట్ల పతనం: 1-16, 2-41, 3-47, 4-239; బౌలింగ్‌: బుమ్రా 9-2-43-2; షమి 7-1-47-1; జడేజా 10-0-43-0; కుల్‌దీప్‌ యాదవ్‌ 10-0-56-0; సిరాజ్‌ 7-0-45-1


765

‘ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ’గా నిలిచిన విరాట్‌ కోహ్లి చేసిన పరుగులు. ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్‌ (2003లో 673) రికార్డును బద్దలుకొట్టాడు.


55

ప్రపంచకప్‌ చరిత్రలో షమి తీసిన వికెట్లు. అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా జహీర్‌ ఖాన్‌, జవగళ్‌ శ్రీనాథ్‌ (44) రికార్డును బద్దలుకొట్టాడు. అలాగే అత్యంత వేగంగా ప్రపంచకప్‌లో 50 వికెట్లు సాధించిన బౌలర్‌గానూ నిలిచాడు.  


24

ఈ ప్రపంచకప్‌లో మహమ్మద్‌ షమి పడగొట్టిన వికెట్లు. అత్యధిక వికెట్ల వీరుడు అతనే. భారత్‌ తరపున ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా జహీర్‌ఖాన్‌ (2011లో 21)ను షమి దాటాడు.


23

ఆస్ట్రేలియా స్పిన్నర్‌ జంపా సాధించిన వికెట్లు. ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా ముత్తయ్య మురళీధరన్‌ (2007లో 23) సరసన అతను చేరాడు.


ప్రైజ్‌ మనీ: విజేతకు రూ.33కోట్లు,  రన్నరప్‌కు రూ.16 కోట్లు


కెప్టెన్‌గా రోహిత్‌...

ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు(594) సాధించిన కెప్టెన్‌గా రోహిత్‌ రికార్డు నెలకొల్పాడు. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (2019లో 578 పరుగులు) రికార్డును తిరగరాశాడు.

లితం మాకు అనుకూలంగా రాలేదు. మ్యాచ్‌లో స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయాం. అయితే ప్రపంచకప్‌లో జట్టు ప్రదర్శన పట్ల గర్వంగా ఉంది. ఫైనల్లో ఫలితం ఇలా ఉండాల్సింది కాదు. మరో 20-30 పరుగులు చేసుంటే బాగుండేది. కోహ్లి, రాహుల్‌ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు 270-280 స్కోరు సాధ్యమేనని అనుకున్నాం. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయాం. మూడు వికెట్లు పడిన తర్వాత ఆసీస్‌ పెద్ద భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఆరంభంలో వికెట్లు పడగొట్టాలనుకున్నాం. కానీ హెడ్‌, లబుషేన్‌లకు పూర్తి ఘనత దక్కుతుంది. మా నుంచి మ్యాచ్‌ను దూరం చేశారు. ఫ్లడ్‌లైట్ల కింద పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని తెలుసు. కానీ దీన్ని సాకుగా చూపించలేను. ఫైనల్లో మేం స్థాయికి తగ్గట్లు బ్యాటింగ్‌ చేయలేదు.

రోహిత్‌


‘‘నమ్మశక్యంగా లేదు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినందుకు చాలా సంతోషంగా ఉంది. టాస్‌ గెలిచాక బౌలింగ్‌ ఎంచుకోవడం గొప్ప నిర్ణయం. మ్యాచ్‌ సాగేకొద్దీ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. సెంచరీ చేయడం, రోహిత్‌ క్యాచ్‌ పట్టడం.. ఇవేవీ అస్సలు ఊహించలేదు. బహుశా ఇప్పుడు ప్రపంచంలోకెల్లా అత్యంత దురదృష్టవంతుడు రోహితేనేమో!

ట్రావిస్‌ హెడ్‌


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని