IND w Vs AUS w: పోరాడి ఓడిన భారత్‌.. ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆసీస్‌

మహిళల టీ20 ప్రపంచకప్‌లో (Womens World Cup 2023) భారత్‌ మరోసారి చుక్కెదురైంది. ఉత్కంఠభరితంగా సాగిన సెమీస్‌లో 5 పరుగుల తేడాతో భారత్‌పై ఆసీస్‌ (IND w Vs AUS w)  విజయం సాధించింది.

Updated : 23 Feb 2023 22:17 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మహిళల టీ20 ప్రపంచకప్‌లో (Womens World Cup 2023) భారత్‌ కథ ముగిసింది. మరోసారి ఆసీస్‌ చేతిలో భారత్‌కు (IND w Vs AUS w) పరాభవం తప్పలేదు. ఉత్కంఠభరితంగా సాగిన సెమీస్‌లో 5 పరుగుల తేడాతో భారత్‌పై ఆసీస్‌ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా 167 పరుగులకే పరిమితమైంది. దీంతో మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌కు ఆసీస్‌ చేరుకుంది.

వారిద్దరూ ఉండుంటే..

ఆసీస్‌ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. అద్భుత ఫామ్‌లో ఉన్న స్మృతీ మంధాన (2), షఫాలీ వర్మ (9)తోపాటు యస్తికా భాటియా (2) త్వరగా పెవిలియన్‌కు చేరారు. అయితే జెమీమా రోడ్రిగ్స్ (43), హర్మన్‌ ప్రీత్ కౌర్ (52) మాత్ర వచ్చీరావడంతోనూ హిట్టింగ్‌ మొదలుపెట్టారు. దీంతో ఛేదించాల్సిన రన్‌రేట్‌ అదుపులోకి వచ్చింది. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 69 పరుగులు జోడించారు. అయితే కీలక సమయంలో జెమీమాతోపాటు హర్మన్‌ కూడా పెవిలియన్‌కు చేరడంతో స్కోరు బోర్డు నెమ్మదించింది. మరోవైపు దీప్తి శర్మ (20*) కాసేపు పోరాడినా ఓటమి నుంచి మాత్రం తప్పించలేకపోయింది. ఆసీస్‌ బౌలర్లు బ్రౌన్ 2, గార్డెనర్‌ 2.. జొనాసెన్, స్కట్ చెరో వికెట్‌ తీశారు.

క్యాచ్‌లు మిస్‌ చేసి.. 

మ్యాచ్‌ ప్రారంభం నుంచే భారత ఫీల్డింగ్‌ గొప్పగా ఏమీ లేదు. కానీ, చేతిలో పడిన క్యాచ్‌లను మిస్‌ చేసి భారీ మూల్యం చెల్లించుకొంది. కీలకమైన మూనీ (54), హీలీ (25) క్యాచ్‌లను చేజార్చడంతో ఆసీస్‌ మంచి లక్ష్యాన్నే భారత్‌ ముందుంచగలిగింది. ఆసీస్‌ విజయం సాధించడానికి వారి ఫీల్డింగ్‌ కూడా ఓ కారణం.. బౌండరీలను ఆపి మరీ భారత బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు. నాకౌట్‌ దశలో ఇలాంటి పొరపాట్లు ఎంత పని చేస్తాయనేది ఈ మ్యాచ్‌తోనైనా టీమ్‌ఇండియా ఫీల్డర్లు తెలుసుకోవాలి. భారత బౌలర్లూ డెత్‌ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించారు. లేకపోతే ఆసీస్‌ను 160 పరుగుల్లోపే కట్టడి చేసే అవకాశం ఉండేది. శిఖా పాండే 2.. దీప్తి శర్మ, రాధా యాదవ్‌ చెరో వికెట్‌ తీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని