Team India: కొత్త ఏడాదిలో ఈ సవాళ్లను టీమ్‌ఇండియా దాటేనా?

కొత్త సంవత్సరంలో అత్యుత్తమ ప్రదర్శనతో మరిపించేందుకు టీమ్‌ఇండియా ఉత్సాహంతో సాగనుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రేసులో నిలవాలన్నా.. ఐసీసీ ట్రోఫీల నిరీక్షణకు తెరదించాలన్నా ఈ ఏడాది భారత జట్టుకు ఎంతో కీలకం కానుంది. 

Published : 02 Jan 2024 16:14 IST

కొంగొత్త ఆశలను మోసుకుంటూ కొత్త ఏడాది వచ్చేసింది. భారత క్రికెటర్లు కూడా నూతన సంవత్సరంలో సత్తాచాటేందుకు సిద్ధమయ్యారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఓటమి.. వన్డే ప్రపంచకప్‌ తుదిపోరులో పరాజయం.. ఇవీ 2023 మిగిల్చిన చేదు జ్ఞాపకాలు. ఇప్పుడు వీటిని దాటి 2024లో అత్యుత్తమ ప్రదర్శనతో మరిపించేందుకు టీమ్‌ఇండియా కొత్త ఉత్సాహంతో సాగనుంది. కానీ ఈ ఏడాది మన క్రికెట్‌ జట్టుకు కొన్ని కఠినమైన సవాళ్లు ఎదురు కాబోతున్నాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రేసులో నిలవాలన్నా.. ఐసీసీ ట్రోఫీల నిరీక్షణకు తెరదించాలన్నా ఈ ఏడాది భారత జట్టుకు ఎంతో కీలకం. 

అదే మొదటిది..

2024లో టీమ్‌ఇండియాకు తొలి సవాలు దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు రూపంలో ఎదురు కానుంది. సఫారీ గడ్డపై తొలి టెస్టు సిరీస్‌ విజయంతో చరిత్ర సృష్టించాలని నిరుడు డిసెంబర్‌లో అక్కడ అడుగుపెట్టిన భారత్‌కు తొలి మ్యాచ్‌లోనే దిమ్మదిరిగే షాక్‌ తగిలింది. అన్ని విభాగాల్లోనూ ముఖ్యంగా బౌలింగ్‌లో విఫలమైన టీమ్‌ఇండియా ఏకంగా ఇన్నింగ్స్, 32 పరుగుల తేడాతో చిత్తయింది. సఫారీ పేస్‌ బౌలింగ్‌కు దాసోహమన్న భారత్‌ వరుసగా తొలి రెండు ఇన్నింగ్స్‌ల్లో 245, 131 పరుగులకే ఆలౌటైంది. ఈ నేపథ్యంలో సిరీస్‌ 0-2తో క్లీన్‌స్వీప్‌ పరాభవం తప్పించుకోవాలంటే భారత్‌ బుధవారం ఆరంభమయ్యే రెండో టెస్టులో గెలవాల్సిందే. విజయం దక్కాలంటే ముందు ప్రత్యర్థి పేసర్లను సమర్థంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనిపై దృష్టి పెట్టిన భారత బ్యాటర్లు నెట్స్‌లో ప్రత్యేకంగా సాధన కొనసాగిస్తున్నారు. 

ఇంగ్లిష్‌ టెస్టు..

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్స్‌ (డబ్ల్యూటీసీ)లో వరుసగా రెండు సార్లు ఫైనల్‌కి చేరినా టీమ్‌ఇండియా విజేతగా నిలవలేకపోయింది. ఇప్పుడు 2023-25 చక్రంలో విజేతగా నిలవాలంటే భారత్‌ శక్తికి మించి కష్టపడాల్సిందే. ఈ డబ్ల్యూటీసీ సైకిల్‌లో ఇప్పటివరకూ మూడు టెస్టులాడిన భారత్‌.. ఒక్కో మ్యాచ్‌లో విజయం, ఓటమి, డ్రా నమోదు చేసింది. ప్రస్తుతం 38.89 పాయింట్ల శాతంతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెలలో స్వదేశంలో ఇంగ్లాండ్‌తో ఆరంభమయ్యే అయిదు టెస్టుల సిరీస్‌ టీమ్‌ఇండియాకు అత్యంత కీలకమైంది. ఈ సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసినా, భారీ తేడాతో సొంతం చేసుకున్నా డబ్ల్యూటీసీలో భారత్‌కు కలిసొస్తుంది. కానీ అదంత సులువు కాదు. ఎందుకంటే టెస్టుల్లో బజ్‌బాల్‌ ఆటతీరుతో ఇంగ్లాండ్‌ దూకుడు ప్రదర్శిస్తోంది. కొన్ని సార్లు ఓటములు ఎదురైనా తగ్గేదే లేదంటూ ఆ జట్టు సాగుతోంది. భారత్‌తో టెస్టు సిరీస్‌లోనూ ఇదే ఆటతీరు ప్రదర్శిస్తామని కూడా ఆ జట్టు ఆటగాళ్లు చెబుతున్నారు. స్వదేశంలో టీమ్‌ఇండియాకు తిరుగులేకపోయినా.. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో మరీ అతివిశ్వాసానికి పోకుండా జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. 

నిరీక్షణ ముగిస్తారా..

ఐసీసీ ట్రోఫీ కోసం టీమ్‌ఇండియా నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. 2023 వన్డే ప్రపంచకప్‌లో గెలిచేలా కనిపించిన భారత్‌.. ఫైనల్లో ఆసీస్‌ చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. 2013లో ఛాంపియన్స్‌ ట్రోఫీ నెగ్గిన తర్వాత టీమ్‌ఇండియా మరో ఐసీసీ ట్రోఫీని ముద్దాడలేకపోయింది. అదే వన్డే ప్రపంచకప్‌ అయితే 2011లో గెలిచింది. ఇక టీ20 ప్రపంచకప్‌ చూసుకుంటే 2007 ఆరంభ సీజన్‌ తర్వాత మరోసారి విజేతగా నిలవలేకపోయింది. ఈ నేపథ్యంలో మరోసారి ప్రపంచకప్‌ అందుకునేందుకు ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ రూపంలో టీమ్‌ఇండియాకు అవకాశం వచ్చింది. జూన్‌లో అమెరికా- వెస్టిండీస్‌లో ఈ పొట్టి కప్పు జరుగుతుంది. అయితే తీవ్రమైన పోటీని తట్టుకుని, అగ్రశ్రేణి జట్లను ఓడిస్తేనే భారత్‌కు గెలిచే అవకాశాలుంటాయి.

ఈ సారి టోర్నీలో 20 జట్లు పోటీపడబోతున్నాయి. మరి ఈ కప్పు దిశగా ఇప్పటికే యువ జట్టును నిర్మించే ప్రయత్నాల్లో బీసీసీఐ నిమగ్నమైంది. జట్టులోకి యువ రక్తాన్ని ఎక్కిస్తోంది. అయితే ఈ ప్రపంచకప్‌లో జట్టు కెప్టెన్‌ ఎవరనేది కూడా సస్పెన్స్‌గా మారింది. హార్దిక్‌ కెప్టెన్‌గా కొనసాగే అవకాశముందని అనుకుంటే, తాజాగా రోహిత్‌ ఈ కప్పులో జట్టును నడిపించాలని బీసీసీఐ కోరిందనే వార్తలు వస్తున్నాయి. మరి ఎవరు కెప్టెన్‌గా ఉంటారో చూడాలి. ఇక అక్టోబర్‌లో స్వదేశంలో కివీస్‌తో మూడు టెస్టుల సిరీస్‌ కూడా భారత్‌కు సవాలు విసిరేదే. ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటన కూడా భారత్‌కు కఠినమైన పరీక్షగా నిలిచే అవకాశముంది. ఈ సవాళ్లను దాటి భారత్‌ జైత్రయాత్ర సాగించాలన్నదే అభిమానుల కోరిక. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని