Team India: ఏడు పొట్టి ప్రపంచకప్ టోర్నీల్లో టీమ్ఇండియా రికార్డులివిగో..!

టీ20 ప్రపంచకప్‌లో అక్టోబర్ 23న భారత్‌కు తొలి పోరు. దాయాది దేశం పాకిస్థాన్‌తో తలపడనుంది. ఇప్పటి వరకు జరిగిన ఏడు ప్రపంచకప్‌ టోర్నీల్లో భారత్‌ తరఫున అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసిన ఆటగాళ్ల గురించి తెలుసుకోండి.  

Updated : 22 Oct 2022 10:35 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌ మహా సంగ్రామం మొదలైంది. ఇప్పటికే క్వాలిఫయిర్‌ రౌండ్‌ మ్యాచ్‌లు ముగిశాయి. శనివారం నుంచి సూపర్‌-12 పోరు ప్రారంభం కానుంది. టీమ్‌ఇండియా తొలి మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌తో ఆదివారం (అక్టోబర్ 23) తలపడనుంది. ఇప్పటి వరకు జరిగిన టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో భారత్ 38 మ్యాచులు ఆడింది. అందులో 24 విజయాలు.. 13 ఓటములు ఉండగా.. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. మరి ఇన్ని మ్యాచుల్లో టీమ్‌ఇండియా రికార్డులేంటో తెలుసుకొందాం.. 

  1. అత్యధిక పరుగుల వీరులు: టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో భారత్‌ తరఫున అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌ ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ. అతడు 2007 నుంచి 2021 వరకు ఆడిన 33 మ్యాచుల్లో (30 ఇన్నింగ్స్‌లు) 847 పరుగులు చేశాడు. అతడి తర్వాతి స్థానంలో స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (845 పరుగులు) ఉన్నాడు. అయితే రోహిత్ కన్నా విరాట్ కేవలం 21 మ్యాచుల్లో (19 ఇన్నింగ్స్‌ల్లో)నే (2012-21 మధ్య) బాదేశాడు. అంతర్జాతీయంగా మాత్రం జయవర్థెనె (1,016) టాప్‌ స్కోరర్‌. ఈసారి ప్రపంచకప్‌లో విరాట్, రోహిత్ జయవర్థెనెను అధిగమించే అవకాశం లేకపోలేదు. 
  2. భారీ విజయం.. తక్కువ వ్యత్యాసం: భారత్‌ గెలిచిన 24 మ్యాచుల్లో భారీ గెలుపు మాత్రం 2012 ప్రపంచకప్‌లో నమోదైంది. శ్రీలంకను 90 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 170 పరుగులు చేయగా.. లంక కేవలం 80 పరుగులకే కుప్పకూలింది. ఇక కేవలం ఒక్క పరుగు తేడాతో తక్కువ మార్జిన్‌తో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ జట్ల మీద భారత్‌ విజయం సాధించింది. 2012 టీ20 వరల్డ్‌ కప్‌లో దక్షిణాఫ్రికాను. 2016 సీజన్‌లో న్యూజిలాండ్‌ను ఒక్క పరుగు తేడాతో ఓడించింది.
  3. ఒక ఇన్నింగ్స్‌లో..: దూకుడుకు మారుపేరైన టీ20ల్లో బాదేయడమే లక్ష్యంగా జట్లు బరిలోకి దిగుతాయి. తొలిసారి నిర్వహించిన పొట్టి కప్‌ (2007) పోటీల్లోనే భారత్‌ అద్భుతంగా ఆడి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌పై 218/4 స్కోరు సాధించింది. ఇదే ఇప్పటి వరకు ప్రపంచకప్‌ టోర్నీల్లో ఒక ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా సాధించిన అత్యధిక స్కోరు. ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై భారత్‌ 18 పరుగులు తేడాతో విజయం సాధించింది. 
  4. శతకం చేసిందొకరే.. అర్ధశతకాల జోరు: కేవలం 120 బంతులుండే టీ20ల్లో సెంచరీ సాధించడం ఆషామాషీ వ్యవహారం కాదు. అయితే ఇప్పటి వరకు మొత్తం టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో తొమ్మిది శతకాలు మాత్రమే నమోదు కాగా.. టీమ్‌ఇండియా నుంచి ఒకే ఒక్క వీరుడు సెంచరీ బాదాడు. 2010 ప్రపంచకప్‌లో సురేశ్ రైనా దక్షిణాఫ్రికాపై 60 బంతుల్లో 101 పరుగులు చేశాడు.
  5. అర్ధశతకాలు అతడే: ఇక అర్ధశతకాలను చాలా మంది సాధించినా.. అత్యధికం మాత్రం విరాట్ కోహ్లీ చేశాడు. పది హాఫ్‌ సెంచరీలు బాదాడు. ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ మాత్రం యువరాజ్‌ సింగ్‌ (12 బంతుల్లో) పేరిట ఉంది. తొలిసారి పొట్టి ప్రపంచకప్‌ గెలవడంలో యువీ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
  6. విరాట్ స్పెషల్‌: విరాట్ కోహ్లీ ఫామ్‌లో ఉంటే రికార్డులు అన్నీ అతడివే. ఒకే ఎడిషన్‌లో భారీగా పరుగులు చేసిన ఆటగాడిగా మరో ఘనత సాధించాడు. 2014 పొట్టి ప్రపంచకప్‌లో కేవలం ఆరు ఇన్నింగ్స్‌ల్లో 319 పరుగులు సాధించాడు. ఇప్పటికీ ఇది టీమ్‌ఇండియా తరఫునే కాకుండా.. అంతర్జాతీయ రికార్డుగానూ కొనసాగుతోంది. అలాగే ఒకే ప్రపంచకప్‌ టోర్నీలో నాలుగు హాఫ్‌ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు కోహ్లీ కావడం విశేషం.
  7. వికెట్ల వీరుడు: సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌ 18 మ్యాచుల్లో 26 వికెట్లు తీశాడు. ఇదే టీమ్‌ఇండియా తరఫున ఓ బౌలర్‌ సాధించిన అత్యధిక వికెట్ల రికార్డు. 2012-21 మధ్య జరిగిన పొట్టి కప్‌ టోర్నీల్లో ఈ ఘనత సాధించాడు. అశ్విన్‌ తర్వాత ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా 22 మ్యాచుల్లో 21 వికెట్లు పడగొట్టాడు.
  8. అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన: ఒకే ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కూడా అశ్విన్‌ పేరిటే ఉంది. 2014లో ఆసీస్‌ మీద కేవలం 11 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఉత్తమ బౌలింగ్‌ యావరేజ్‌ విభాగంలోనూ అశ్విన్‌ టాప్. ఇప్పటి వరకు 66 ఓవర్లలో 15.26 సగటుతో 26 వికెట్లు తీశాడు. అశ్విన్‌ అత్యుత్తమ ఎకానమీ 6.01. 
  9. ఏకైక కీపర్‌: భారత్‌ తరఫున అత్యధిక ఔట్లలో భాగస్వామి అయిన వికెట్ కీపర్ మహేంద్ర సింగ్‌ ధోనీ. కేవలం టీమ్ఇండియా తరఫునే కాకుండా ప్రపంచ రికార్డు కూడా ధోనీ పేరుపైనే ఉండటం విశేషం. మొత్తం 32 ఔట్లు చేయగా.. అందులో 21 క్యాచ్‌లు.. 11 స్టంపింగ్‌లు ఉన్నాయి. అలాగే ఒకే ఇన్నింగ్స్‌లో నలుగురిని ఔట్‌ చేసిన ధోనీ.. ఇతర వికెట్‌ కీపర్లతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
  10. కెప్టెన్‌గానూ అతడే: కెప్టెన్‌ కూల్‌ ఎంఎస్ ధోనీనే టీమ్‌ఇండియా తరఫున అత్యధిక మ్యాచ్‌లకు సారథిగా వ్యవహరించాడు. తొలిసారి టైటిల్‌ దక్కించుకొంది కూడా ధోనీ నాయకత్వంలోనే కావడం విశేషం. ధోనీ మొత్తం 33 మ్యాచుల్లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో 21 విజయాలు, 11 అపజయాలు ఉండగా.. ఒక మ్యాచ్‌ ఫలితం తేలలేదు. ధోనీ తర్వాత విండీస్‌ మాజీ కెప్టెన్ డారెన్ సామీ 18 మ్యాచుల్లో 11 విజయాలతో రెండో స్థానంలో ఉన్నాడు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని