Bhuvneswar Kumar : బక్కోడే కానీ.. గట్టోడు.. ఈ భువనేశ్వరుడు

 బక్కపాటి శరీరం.. పొడగరి కూడా కాదు.. కేవలం మీడియం పేసర్‌.. బంతి మహా అయితే 130 కి.మీ నుంచి 135 కి.మీ వేగంతో మాత్రమే దూసుకొస్తుంది. అయితేనేం బ్యాటర్‌ను...

Published : 11 Jul 2022 01:23 IST

అరుదైన రికార్డు సాధించిన స్వింగ్‌ కింగ్‌.. 

ఇంటర్నెట్ డెస్క్: బక్కపల్చని శరీర ఆకారం.. పెద్ద పొడగరి కూడా కాదు.. కేవలం మీడియం పేసర్‌.. బంతి మహా అయితే 130 కి.మీ నుంచి 135 కి.మీ వేగంతో మాత్రమే దూసుకొస్తుంది. అయితేనేం బ్యాటర్‌ను తికమక పెట్టించగలిగే నేర్పరి.. ఆరంభ ఓవర్లలో పరుగులు ఇవ్వకుండా వికెట్లు తీయగల సమర్థుడు. అంతర్జాతీయ టీ20ల్లో పవర్‌ప్లే ఓవర్లలో 502 డాట్‌బాల్స్‌ వేసిన తొలి బౌలర్‌. ఇంత ఉపోద్ఘాతం ఎవరి గురించి అనేగా మీ డౌటు.. అదేనండి టీమ్‌ఇండియా సీనియర్‌ బౌలర్‌, స్వింగ్‌ స్పెషలిస్ట్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ప్రత్యేకతలు ఇవి.. తొలి ఓవర్లలోనే టీమ్‌ఇండియా తరఫున అత్యధిక వికెట్లు (14) తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించిన భువీ గురించి ప్రత్యేక కథనం.. 

డేంజరస్‌ బ్యాటర్లకే చుక్కలు

డేంజరస్‌ బ్యాటర్‌ క్రీజ్‌లో ఉంటే ఎంతటి బౌలరైనా కాసింత ఆందోళనగానే ఉంటాడు. అయితే అవేవీ తన మొహంలో కనిపించనీయకుండా తనదైన శైలిలో వికెట్లే లక్ష్యంగా బంతులను సంధించే భువనేశ్వర్‌ కుమార్‌ ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేశాడు. భారీ హిట్టర్లు కలిగిన ఇంగ్లాండ్‌ను కట్టడి చేయడమంటే ఆషామాషీ కాదు. మరోవైపు భారత టీ20 లీగ్‌లో అత్యధిక పరుగుల వీరుడు, ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోస్ బట్లర్‌ భీకర ఫామ్‌లో ఉన్నాడు. అలాంటి బట్లర్‌ను రెండు మ్యాచుల్లోనూ భువీనే పెవిలియన్‌కు చేర్చడం విశేషం. తన తొలి ఓవర్‌లోనే ఓపెనర్లలో ఎవరో ఒకరిని ఔట్ చేయడం భువీ స్టైల్‌. తొలి టీ20 మ్యాచ్‌లో జోస్‌ బట్లర్‌ (0), రెండో మ్యాచ్‌లో జాసన్‌ రాయ్‌ (0)ను పెవిలియన్‌కు చేర్చాడు. వీరిద్దరూ భువనేశ్వర్‌ బౌలింగ్‌లో తమ తొలి బంతికే ఔట్ కావడం గమనార్హం. ఇలా మొదటి ఓవర్‌లోనే భువనేశ్వర్‌ 14 సార్లు వికెట్‌ తీశాడు. ఇప్పటికే టెస్టు దేశాల ఆటగాళ్లలో భువీనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌. ఇంకో మూడు వికెట్లు పడగొడితే.. ఐసీసీ అనుబంధ దేశమైన ఒమన్‌ బౌలర్‌ బిలాల్‌ ఖాన్‌ (16)ను దాటేస్తాడు. భువీ తర్వాత డేవిడ్ విల్లే (13), మ్యాథ్యూస్‌ (11), టిమ్‌ సౌథీ (9), డేల్ స్టెయిన్‌ (9) ఉన్నారు. 

వారి నుంచి తీవ్ర పోటీ..?

టీమ్‌ఇండియాలో బౌలర్లకు కొదవేం లేదు. ఒకప్పుడు స్పిన్నర్లకు అనుకూలంగా పిచ్‌లను రూపొందించేలా చేసిన బీసీసీఐ.. ఇప్పుడు ఫాస్ట్‌ బౌలర్లకు అనుకూలంగా ఉండేందుకు చర్యలు చేపట్టింది. స్వదేశంలో ఎక్కువగా స్పిన్‌ పిచ్‌ల మీద ఆడి సత్ఫలితాలను రాబడుతున్నప్పటికీ.. విదేశాల్లో తేలిపోతుండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జహీర్‌ ఖాన్‌, నెహ్రా, ఇర్ఫాన్‌ పఠాన్‌, అజిత్ అగార్కర్, ఆర్పీ సింగ్, శ్రీశాంత్ తదితరులు భారత ఫాస్ట్‌ బౌలింగ్‌ దళాన్ని నడిపించారు. వీరి తర్వాత మహమ్మద్ షమీ, ఉమేశ్‌ యాదవ్, ఇషాంత్‌ శర్మ, భువనేశ్వర్‌ కుమార్‌, బుమ్రా.. ఇదే విధంగా కుర్రాళ్లు హర్షల్‌ పటేల్, ఉమ్రాన్‌ మాలిక్, అర్ష్‌దీప్‌ సింగ్, నవ్‌దీప్‌ సైని, ప్రసిధ్‌ కృష్ణ, అవేశ్‌ ఖాన్‌ తదితరులు సుస్థిర స్థానం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే వీరందరిలోకి భువీ ప్రత్యేకత ఏంటంటే.. ఎలాంటి పిచ్‌మీదైనా స్వింగ్‌ రాబట్టగలడు. ఇక అదే స్వింగ్‌కు అనుకూలిస్తే మాత్రం రెచ్చిపోతాడు. 2014లో టీమ్‌ఇండియా జట్టులోకి వచ్చిన భువీకి ఇప్పుడు ప్రపంచకప్‌ జట్టులో స్థానం కోసం సీనియర్లతోపాటు జూనియర్ల నుంచి తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌పై అతడి ప్రదర్శన చూస్తుంటే ప్రపంచకప్‌లో చోటు సంపాదించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసే అవకాశం..!

ప్రస్తుత సంవత్సరంలో అదరగొట్టేస్తున్న భువనేశ్వర్‌ గతేడాది మాత్రం పెద్దగా రాణించలేదు. 12 మ్యాచులకు గాను కేవలం 12 వికెట్లను మాత్రమే పడగొట్టాడు. ఇక టీ20 ప్రపంచకప్‌లో అయితే కేవలం ఒకే మ్యాచ్‌ ఆడిన భువీ వికెట్‌ కూడా తీయలేకపోయాడు. మూడు ఓవర్లు వేసి 25 పరుగులను సమర్పించాడు. స్వదేశంలో విండీస్‌, శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లపై జరిగిన సిరీసుల్లో మరోసారి తన స్వింగ్‌ను రాబట్టి వికెట్లను కుప్పకూల్చాడు. ఈ మూడు టీమ్‌లపై ఎనిమిది మ్యాచ్‌లకుగాను 11 వికెట్లు తీశాడు. ఇక ఐర్లాండ్‌పైనా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న వారి పిచ్‌లపై రెండు మ్యాచుల్లో 2 వికెట్లు తీసి ఫర్వాలేదనిపించాడు. అక్కడ నుంచి నేరుగా ఇంగ్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌కు ఎంపికయ్యాడు. తొలి టీ20లో కేవలం పది పరుగులే ఇచ్చి బట్లర్‌ వికెట్‌ తీశాడు. ఇక రెండో మ్యాచ్‌లో జేసన్‌ రాయ్‌, బట్లర్‌ తోపాటు రిచర్డ్‌ గ్లీసన్‌ వికెట్ తీసి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ఇప్పటివరకు 12 మ్యాచులు ఆడిన భువనేశ్వర్‌ 17 వికెట్లు తీసి భళా అనిపించాడు. ఇదే ఫామ్‌ కొనసాగితే ఒకే ఏడాదిలో టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించే అవకాశం ఉంది. ఎందుకంటే వచ్చే టీ20 ప్రపంచకప్‌ పోటీలకు ముందు భారత్‌ కనీసం ఇంకో 15కిపైగా టీ20లను ఆడే అవకాశం ఉంది. కాబట్టి ఘనతను సాధించడం భువీకి కష్టం కాకపోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని