Team India: రికార్డులైనా.. ఆటైనా... టీమ్‌ఇండియా తగ్గేదేలే

Published : 06 Nov 2023 20:11 IST

అంతర్జాతీయ క్రికెట్లో ఆటైనా.. రికార్డులైనా భారత్‌ దిగనంతవరకే.. ఒక్కసారి టీమ్‌ఇండియా అడుగుపెట్టిందంటే చరిత్ర మన సొంతం కావాల్సిందే. ఇప్పుడు భారత జట్టు నిలకడగా రాణిస్తూ.. అద్భుత విజయాలు సాధిస్తూ.. ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తోంది. ప్రపంచకప్‌లో రోహిత్‌ సేన జోరే అందుకు నిదర్శనం. ఒకప్పుడు వెస్టిండీస్‌లా, ఆ తర్వాత ఆస్ట్రేలియాలా ఇప్పుడు భారత్‌ సాగుతోంది. ఆ రికార్డుల లెక్కేంటో చూద్దామా!

అప్పుడు సచిన్‌.. ఇప్పుడు కోహ్లి 

వన్డేలు, టెస్టులు.. ఇలా రెండు ఫార్మాట్లలోనూ భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌కు తిరుగులేకుండా ఉండేది. అసాధారణ ప్రదర్శనతో, అసామాన్య ప్రతిభతో ప్రపంచ క్రికెట్‌ను అతను ఏలాడు. కానీ సచిన్‌ ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో మన ఆధిపత్యం కొనసాగుతుందా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ పరుగుల రారాజు కోహ్లి వచ్చాడు. సచిన్‌ వారసత్వాన్ని నిలబెడుతూ.. అద్వితీయమైన బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్నాడు. తాజాగా వన్డే క్రికెట్లో అత్యధిక శతకాలతో నంబర్‌వన్‌గా ఉన్న సచిన్‌ (49)ను కోహ్లి సమం చేశాడు. శతాబ్దాల క్రికెట్‌ చరిత్రలో వన్డేల్లో ఇన్ని సెంచరీలు చేసిన ఇద్దరు బ్యాటర్లు భారత్‌కు చెందినవాళ్లే అంటేనే మన ఆధిపత్యం ఏమిటో తెలుస్తోంది. మూడో సాౖనంలోనూ మన ఆటగాడే రోహిత్‌ శర్మ (31) ఉన్నాడు. 

ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో వార్నర్‌ (22), డికాక్‌ (21) మాత్రమే 20 కంటే ఎక్కువ శతకాలు చేశారు. దీన్ని బట్టి భారత ఆటగాళ్లకు మిగతా దేశాల క్రికెటర్లు ఎంత దూరంలో ఉన్నారో అరౖమవుతోంది. వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు మన దిగ్గజం సచినే. 463 మ్యాచ్‌ల్లో అతను 18,426 పరుగులు చేశాడు. కోహ్లి (13626), సౌరభ్‌ గంగూలీ (11221), రాహుల్‌ ద్రవిడ్‌ (10768), ధోని (10599), రోహిత్‌ శర్మ (10554).. ఇలా ఆరుగురు భారత ఆటగాళ్లు 10 వేలకు పైగా పరుగులు చేశారు. మరే దేశ ఆటగాళ్లు కూడా ఇంత మంది 10వేల కంటే ఎక్కువ పరుగులు చేయలేదు. ఇప్పుడు ఆటలో కొనసాగుతున్న వాళ్లలో కోహ్లి, రోహిత్‌ మాత్రమే 10 వేల కంటే ఎక్కువ పరుగులు చేసిన క్రికెటర్లు. మూడో స్థానంలో ముష్ఫికర్‌ రహీమ్‌ (7577) ఎంతో దూరంలో ఉన్నాడు. 

వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు మన రోహిత్‌ (264)దే. అత్యధిక డబుల్‌ సెంచరీ (3)లూ అతనివే. రోహిత్‌ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్, ఇషాన్‌ కిషన్, శుభ్‌మన్‌ గిల్, సచిన్‌ తెందుల్కర్‌.. ఇలా వన్డేల్లో ద్విశతక వీరుల్లోనూ మనదే ఆధిపత్యం. వన్డేల్లో 200కు పైగా పరుగులు చేసిన మిగతా విదేశీ ఆటగాళ్లు గప్తిల్‌ (న్యూజిలాండ్‌), గేల్‌ (వెస్టిండీస్‌), ఫకర్‌ జమాన్‌ (పాకిస్తాన్‌) మాత్రమే. ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో వన్డేల్లో అత్యధిక సిక్సర్ల రికార్డూ రోహిత్‌ (314) పేరు మీదే ఉంది. ఓ క్యాలెండర్‌ ఏడాదిలో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసింది సచిన్‌ (1,894). ఇందులో తొలి నాలుగు సాౖనాలూ మనవే. అత్యధిక సార్లు ఓ క్యాలెండర్‌ ఏడాదిలో వెయ్యి పరుగులు పూర్తిచేసిన ఆటగాడు కోహ్లి (8). ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేని రికార్డులు మన ఆధిపత్యానికి నిదర్శనం.  

మూడోసారి గెలిచేస్తే..

1975 ప్రుడెన్షియల్‌ ట్రోఫీ (ఇంగ్లాండ్‌లో భారత పర్యటన)తో మొదలైన భారత వన్డే ప్రయాణం ఇప్పుడు ఘనంగా సాగుతోంది. సుమారు 5 దశాబ్దాల ప్రయాణంలో ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించింది. రెండు సార్లు ప్రపంచకప్‌ (1983, 2011)ను ముద్దాడింది. ఇప్పుడు మూడోసారి వన్డే విశ్వవిజేతగా నిలిచే దిశగా దూసుకెళ్తోంది. ‘‘ఛాంపియన్‌ కావాలంటే పెద్ద విజయాలు సాధించాలి. మనది అత్యుత్తమ జట్టు అని, మిగతా జట్లు అందుకోలేనంత దూరంలో ఉందని చాటాలి. ఇప్పుడు టీమ్‌ఇండియా అదే చేస్తోంది’’ అని తాజాగా దిగ్గజ క్రికెటర్‌ గావస్కర్‌ పేర్కొన్నారు. 

ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో భారత ఆధిపత్యం చూస్తే అది నిజమనక తప్పదు. ఆడిన 8 మ్యాచ్‌ల్లోనూ రోహిత్‌ సేన గెలిచింది. ప్రపంచకప్‌ విషయానికి వస్తే అయిదు టైటిళ్లతో ఆస్ట్రేలియా నంబర్‌వన్‌ జట్టుగా ఉంది. వెస్టిండీస్, భారత్‌ చెరో రెండు టైటిళ్లతో ఉమ్మడిగా రెండో సాౖనంలో ఉన్నాయి. ఇప్పుడు మూడో ప్రపంచకప్‌తో ఆసీస్‌ తర్వాత అత్యధిక టైటిళ్లు గెలిచిన ఏకైక జట్టుగా భారత్‌ నిలవాలి. ఇదే దూకుడు కొనసాగించి ఆస్ట్రేలియాను దాటాలన్నదే అభిమానుల కోరిక. 

- ఈనాడు క్రీడా విభాగం  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని