IND vs SA: ముందుంది సఫారీ సవాల్‌.. ఈసారి జెండా పాతుతారా?

దక్షిణాఫ్రికాతో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు టీమ్‌ఇండియా (IND vs SA) సిద్ధమవుతోంది. అయితే, టెస్టు సిరీస్‌ను ఎలాగైనా నెగ్గాలనే లక్ష్యంతో ఈసారి బరిలోకి దిగబోతోంది. 

Updated : 07 Dec 2023 12:13 IST

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌ ఇలా ఒక్కో విదేశీ గడ్డపై భారత క్రికెట్‌ జట్టు (Team India) జెండాలు ఎగరేస్తూ వచ్చింది. కానీ దక్షిణాఫ్రికాకి వచ్చేసరికే ఎందుకో ఒకింత తడబాటు. చేతికి అందినట్టే ఉంటది కానీ అందదు. మనోళ్లు గెలిచేస్తారా? అనిపిస్తారు చివరికి గెలవరు! 90ల్లో అయితే బలహీనమైన భారత జట్టు కదా అనుకోవచ్చు.. కానీ ఎంతో మెరుగుపడిన ప్రస్తుత టీమ్‌ఇండియా కూడా దక్షిణాఫ్రికాలో జెండా పాతలేకపోతోంది. మళ్లీ వచ్చింది సఫారీ సిరీస్‌! టెస్టుల్లో పోలిస్తే పరిమిత ఓవర్ల క్రికెట్లో కాస్త మెరుగైనా.. నంబర్‌వన్‌ జట్టుగా సుదీర్ఘ ఫార్మాట్లోనూ సత్తా చాటాల్సిన సమయం వచ్చింది. అంతేకాదు టీ20లు, వన్డేల్లోనూ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఆస్ట్రేలియాతో సిరీస్‌ గెలిచి సంబరపడుతున్న యువ జట్టుకు సఫారీలతో (IND vs SA) టీ20లు, వన్డేల్లో కూడా పెనుసవాల్‌ ఎదురు కావడం ఖాయం.

ఎన్నో దండయాత్రలు

1992 నుంచి దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌ విజయం కోసం భారత్‌ చకోర పక్షిలా ఎదురు చూస్తూనే ఉంది. ప్రతిసారి ఎన్నో ఆశలు, అంచనాలతో సఫారీ గడ్డపై అడుగుపెట్టడం ఆ తర్వాత చేదు అనుభవాలతో వెనుదిరగడం భారత్‌కు మామూలే. ఎందుకంటే ఇక్కడి పిచ్‌లు ఒకదానికి ఒకటి పొంతన ఉండవు. కఠినమైన డర్బన్‌ పిచ్‌లో ఆడడం అన్నిటికి మించి పెద్ద సవాల్‌. బౌన్స్, స్వింగ్‌ అవుతూ భారత బ్యాటర్ల సత్తాకు పరీక్ష పెడతాయి ఇక్కడి ట్రాక్‌లు. ముఖ్యంగా టెస్టుల్లో సఫారీ పేసర్ల విజృంభణ ముందు నిలవడం చాలా కష్టం. పరిమిత ఓవర్ల క్రికెట్లో కొన్ని మెరుపులు మెరిపించినా.. టెస్టుల్లో మాత్రం భారత్‌ది ఎప్పుడూ వెనుకడుగే. 2006, 2010 పర్యటనల్లో ఒక్కో మ్యాచ్‌ గెలిచి సంబరపడిన భారత్‌.. 2018లో మెరుగైన ప్రదర్శన చేసింది. ఒక దశలో సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి సత్తా చాటింది. కానీ సిరీస్‌ కలను నెరవేర్చుకోలేకపోయింది. 2022 సిరీస్‌లో పూర్తిగా తేలిపోయి రెండు టెస్టుల్లోనూ ఓడింది. మరోసారి టెస్టు సిరీస్‌ వేటకు వెళ్లోంది భారత్‌. అది కూడా గత రెండు సిరీస్‌లలో ఆడిన చెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె లాంటి వాళ్లు లేకుండా మరి ఈసారి ఎలాంటి ప్రదర్శన చేస్తుందన్నది ఆసక్తికరం. 

దిగ్గజాలు చేయలేనిది

దక్షిణాఫ్రికాలో సిరీస్‌ విజయం సచిన్‌ కల. అతడికి నెరవేరలేదు. గంగూలీ, ద్రవిడ్‌ లాంటివాళ్లకు కూడా సాధ్యం కాలేదు. విజయవంతమైన కెప్టెన్‌ ధోని వల్ల కూడా కాలేదు. కోహ్లికి కూడా సాధ్యపడలేదు. మళ్లీ అవకాశం వచ్చింది. ఈసారి రోహిత్‌ సేనకు చరిత్రను తిరగరాసే ఛాన్స్‌ వచ్చింది. కెరీర్‌ ఆఖర్లో ఉన్న రోహిత్, కోహ్లి లాంటి దిగ్గజాలకు సఫారీ గడ్డను జయిస్తే అంతకుమించిన సంతృప్తి మరొకటి ఉండదు. ప్రపంచకప్‌ ఓటమితో కుంగిన భారత్‌కు దక్షిణాఫ్రికాలో విజయం కచ్చితంగా పెద్ద బూస్టింగ్‌ అవుతుంది. కానీ ప్రణాళిక ప్రకారం ఆడకపోతే మునుపటి ఫలితాలు పునరావృతం కావడం ఖాయం. దక్షిణాఫ్రికాలో చాలా సిరీస్‌లు ఆడిన అనుభవం ఉన్న ద్రవిడ్‌ కోచింగ్‌ కూడా భారత్‌కు మేలు చేసేదే. ఇక్కడి పిచ్‌లపై బౌలింగ్‌లో టీమ్‌ఇండియా మరీ నిరాశపరచలేదు కానీ బ్యాటింగ్‌లో మాత్రం దాదాపు ప్రతిసారీ ఉసూరుమనించింది. ఈ విభాగంలో భారత్‌ సత్తా చాటకపోతే కష్టమే. దక్షిణాఫ్రికాలో పరిస్థితులను అంచనా వేసేందుకు ముందుగానే భారత-ఏ జట్టు తరఫున కొందరు సీనియర్‌ ఆటగాళ్లు అక్కడికి వెళ్లడం కచ్చితంగా కలిసొచ్చే అంశమే.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని