IND vs SA: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లు.. అప్పుడు హీరోలు వీరే!

డిసెంబర్ 10 నుంచి భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య (IND vs SA) మూడు టీ20ల సిరీస్‌ ప్రారంభం కానుంది. యువకులతో కూడిన భారత్ జట్టు ఇప్పటికే సఫారీ గడ్డపై అడుగుపెట్టింది.

Published : 08 Dec 2023 18:40 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రతి మ్యాచ్‌ లేదా ప్రతి సిరీస్‌ నుంచి కొత్త స్టార్లు పుట్టుకు రావడం క్రికెట్‌లో సహజమే. ఇప్పుడు కూడా దక్షిణాఫ్రికాతో మూడు ఫార్మాట్లలో సిరీస్‌లు ఆడేందుకు టీమ్‌ఇండియా సిద్ధమైంది. తొలుత టీ20 సిరీస్‌ జరగనుంది. మరి ఈసారి ఎవరు స్టార్‌ అవుతారనే సంగతి పక్కనపెడితే.. గతంలో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరులో హీరోలుగా మారింది మాత్రం వీరే.. 

సీనియర్‌ ఆటగాడికే తొలి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌..

భారత్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య 26 టీ20లు జరిగాయి. ఇందులో టీమ్‌ఇండియా 13 మ్యాచుల్లో విజయం సాధించగా, దక్షిణాఫ్రికా ఎనిమిదితో సరిపెట్టుకుంది. మూడు మ్యాచ్‌లు రద్దయ్యాయి. సిరీస్‌ల పరంగా చూస్తే.. నాలుగు సిరీస్‌లను భారత్‌ కైవసం చేసుకుంది. ఒక్కసారి మాత్రమే దక్షిణాఫ్రికా దక్కించుకుంది. మరో రెండు సిరీస్‌లు డ్రాగా ముగిశాయి. 2006లో భారత్-దక్షిణాఫ్రికా తొలిసారి టీ20లో తలపడ్డాయి. ఈ పొట్టి ఫార్మాట్‌ అంతర్జాతీయ స్థాయిలో నెమ్మదిగా అడుగులు వేస్తున్న సమయమదే. ఇప్పటిలా 200+ స్కోర్లేమీ నమోదు కాలేదు. దక్షిణాఫ్రికాను 126 పరుగులకే భారత్ కట్టడి చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో టీమ్ఇండియా టీమ్ఇండియా కూడా తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. స్వల్ప లక్ష్యమే అయినా దానిని 19.5 ఓవర్లలో భారత్ పూర్తి చేసింది. ఈ మ్యాచ్‌లో వెటరన్‌ ప్లేయర్‌ దినేశ్ కార్తిక్‌ను ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డు వరించింది. ఈ పర్యటనలో కేవలం ఒక్క టీ20ను మాత్రమే ఇరు జట్లూ ఆడాయి. 

ప్రపంచకప్‌ల్లో మనదే హవా..

తొలి టీ20 ప్రపంచకప్‌ నుంచి మొన్నటి ఎడిషన్‌ వరకు భారత్-దక్షిణాఫ్రికా టీమ్‌లు ఆరుసార్లు తలపడ్డాయి. అందులో టీమ్‌ఇండియానే నాలుగు మ్యాచుల్లో విజయం సాధించడం విశేషం. మరో రెండు మ్యాచుల్లో సఫారీ జట్టు గెలిచింది. తొలి పొట్టి కప్‌ను (2007) భారత్ గెలిచిన విషయం తెలిసిందే. లీగ్‌ స్టేజ్‌లో దక్షిణాఫ్రికాపై రోహిత్ శర్మ (50) హాఫ్ సెంచరీతోపాటు ఎంఎస్ ధోనీ (45) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. దీంతో భారత్ నిర్దేశించి 154 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 116 పరుగులకే పరిమితమైంది. ఆర్‌పీ సింగ్‌ నాలుగు వికెట్లతో సఫారీల నడ్డి విరిచాడు. 2010 వరల్డ్‌ కప్‌లో సురేశ్‌ రైనా (101) శతకంతో దక్షిణాఫ్రికాపై విరుచుకుపడ్డాడు. కేవలం 60 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. 2012 వరల్డ్‌ కప్‌లో కేవలం ఒక్క పరుగుతోనే భారత్ గట్టెక్కింది. అయితే, దక్షిణాఫ్రికా ఎదుట కేవలం 153 పరుగులనే లక్ష్యంగా నిర్దేశించినా భారత బౌలర్లు సమష్ఠిగా రాణించి సఫారీ జట్టును 151 రన్స్‌కే కట్టడి చేశారు. జహీర్‌ ఖాన్‌, లక్ష్మీపతి బాలాజీ చెరో మూడు వికెట్లు తీశారు. ‘ప్లేయర్‌ ఆఫ్ ది మ్యా్చ్’ యువరాజ్‌ సింగ్ కీలకమైన రెండు వికెట్ల పడగొట్టాడు. అంతకుముందు బ్యాటింగ్‌లోనూ 21 పరుగులు చేశాడు. 

బ్యాటింగ్‌లో శిఖర్.. బౌలింగ్‌లో భువీ

దక్షిణాఫ్రికాపై వారి సొంతమైదానాల్లో చెలరేగడమంటే సాధారణ విషయం కాదు. కానీ, 2017-18 సీజన్‌లో సఫారీ పర్యటనకు వెళ్లిన భారత్‌కు పొట్టి సిరీస్‌లో అద్భుత ఫలితం దక్కింది. బ్యాటింగ్‌లో శిఖర్ ధావన్ మూడు మ్యాచుల్లోనే 143 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో భువనేశ్వర్‌ ఏడు వికెట్లతో టాప్‌ వికెట్‌ టేకర్. మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మరీ ముఖ్యంగా సిరీస్‌ విజేతను తేల్చే మూడో మ్యాచ్‌లో మన బౌలర్ల పోరాటం అద్వితీయం. దక్షిణాఫ్రికాకు నిర్దేశించిన 173 పరుగుల టార్గెట్‌ను టీమ్‌ఇండియా కాపాడుకోవడంలో వారిదే కీలక పాత్ర. భువనేశ్వర్‌ (2/24) ముందుండి నడిపించాడు. బుమ్రా, హార్దిక్‌, శార్దూల్, సురేశ్‌ రైనా తలో వికెట్‌ తీశారు. దీంతో సఫారీ జట్టును 165 పరుగులకే కట్టడి చేసి భారత్ విజయం సాధించగలిగింది. 

ఒకే ఏడాదిలో రెండు సిరీస్‌లు.. 

టీ20 ప్రపంచ కప్‌ నేపథ్యంలో 2022లో భారత్ ఎక్కువగా టీ20 సిరీస్‌లను ఆడింది. ఆ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్‌ జరిగింది. చెరో రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను సమం చేశాయి. అయితే, కీలకమైన చివరి మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. దీంతో 2-2తో ఇరు జట్లూ సంయుక్త విజేతలుగా నిలిచాయి. ఈ సిరీస్‌లో ఇషాన్‌ కిషన్‌ (206) టాప్‌ స్కోరర్‌గా అవతరించాడు. ఇక బౌలింగ్‌లోనూ హర్షల్‌ నాలుగు మ్యాచుల్లో ఏడు వికెట్లు, భువనేశ్వర్‌ ఆరు, చాహల్ ఆరు వికెట్లు తీశాడు. ఇదే సంవత్సరం అక్టోబర్‌లో.. అంటే టీ20 ప్రపంచ కప్‌నకు ముందు మూడు టీ20ల సిరీస్‌లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడింది. ఈసారి 2-1 తేడాతో భారత్ సిరీస్‌ను సొంతం చేసుకుంది. మరీ ముఖ్యంగా రెండో మ్యాచ్‌లో భారత బ్యాటర్లు విజృంభించారు. 20 ఓవర్లలో ఏకంగా 237 పరుగుల స్కోరు సాధించారు. కేఎల్ రాహుల్ (57), రోహిత్ శర్మ (43), విరాట్ కోహ్లీ (49*)తోపాటు ప్రస్తుతం తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సూర్యకుమార్‌ యాదవ్‌ (61: 22 బంతుల్లోనే 5 సిక్స్‌లు, 5 ఫోర్లు) రికార్డు హాఫ్ సెంచరీ సాధించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని