INDw vs ENGw: భారత అమ్మాయిలకు సవాల్‌

భారత మహిళల క్రికెట్‌ జట్టుకు సవాల్‌.. బలమైన ఇంగ్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ జరిగేది బుధవారమే. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని భారత్‌.. ఈ ఏడాది టీ20ల్లో మెరుగైన ప్రదర్శనే చేసింది.  ఈ ఫార్మాట్లో ఆసియా క్రీడల్లో పసిడి పతకం గెలవడమే కాదు..

Updated : 06 Dec 2023 09:37 IST

నేడే ఇంగ్లాండ్‌తో తొలి టీ20
రాత్రి 7 నుంచి

ముంబయి : భారత మహిళల క్రికెట్‌ జట్టుకు సవాల్‌.. బలమైన ఇంగ్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ జరిగేది బుధవారమే. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని భారత్‌.. ఈ ఏడాది టీ20ల్లో మెరుగైన ప్రదర్శనే చేసింది.  ఈ ఫార్మాట్లో ఆసియా క్రీడల్లో పసిడి పతకం గెలవడమే కాదు.. బంగ్లాదేశ్‌పై 2-1తో సిరీస్‌ సాధించింది. దక్షిణాఫ్రికాలో జరిగిన ముక్కోణపు టోర్నీలోనూ ఫైనల్‌ చేరింది. అయితే స్వదేశంలో ఇంగ్లాండ్‌పై భారత్‌కు గొప్ప రికార్డేం లేదు. తొమ్మిది మ్యాచ్‌ల్లో రెండే గెలిచింది. చివరిగా 2018లో ఆ జట్టుపై విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈ గణాంకాలను మెరుగుపరుచుకోవాలని హర్మన్‌ప్రీత్‌ బృందం భావిస్తోంది. బ్యాటింగ్‌లో స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌తో పాటు హర్మన్‌ప్రీత్‌ తప్పక రాణించాల్సి ఉంది. ఇటీవల మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌లో హర్మన్‌ప్రీత్‌ 14 మ్యాచ్‌ల్లో 321 పరుగులు చేసింది. మరోవైపు సొంతగడ్డపై శ్రీలంక చేతిలో 1-2తో ఓడిన ఇంగ్లాండ్‌.. భారత్‌పై సత్తా చాటాలనే పట్టుదలతో ఉంది. కెప్టెన్‌ హెథర్‌ నైట్‌, నాట్‌ సీవర్‌, ఎకిల్‌స్టోన్‌ రాణించడంపైనే ఆ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

భారత్‌లో ఆడడం పెద్ద పరీక్షే... నైట్‌: భారత పిచ్‌లపై ఆడడం పెద్ద పరీక్ష అని ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ హెథర్‌ నైట్‌ చెప్పింది. ‘‘భారత పరిస్థితుల్లో ఆడి ఆటను చాలా మెరుగుపరుచుకున్నా. ఏ క్రికెటర్‌కైనా ఇక్కడ పిచ్‌లపై ఆడడం పెద్ద సవాల్‌. భారత్‌లో వేడి, ఉక్కపోత వాతావరణాన్ని ఎదుర్కొంటూ మన నైపుణ్యాలను ప్రదర్శించాల్సి ఉంటుంది’’ అని నైట్‌ తెలిపింది. వచ్చే ఏడాది బంగ్లాదేశ్‌లో టీ20 ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో అలాంటి పిచ్‌లే పోలి ఉన్న భారత్‌లో ఆడడం మేలు చేస్తుందని నైట్‌ చెప్పింది. ‘‘ఆటను మెరుగుపరుచుకోవడానికి భారత్‌ సరైన వేదిక. ముఖ్యంగా 2024 టీ20 ప్రపంచకప్‌ వేదిక బంగ్లాదేశ్‌లో పిచ్‌ల మాదిరే ఇక్కడి పిచ్‌లు కూడా ఉంటాయి’’ అని నైట్‌ తెలిపింది. సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం అంత తేలికేం కాదని తెలిపింది.

భారత్‌ నిర్భయంగా ఆడాలి: మజుందార్‌: ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో భారత మహిళల జట్టు నిర్భయంగా ఆడాలని చీఫ్‌ కోచ్‌ అమోల్‌ మజుందార్‌ అన్నాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి పోరు బుధవారం వాంఖడే స్టేడియంలో జరుగనుంది. ‘‘ఎప్పట్లాగే భారత్‌ తనదైన శైలిలో ఆడాలి. భయం లేకుండా ఆడటాన్నే సమర్థిస్తా. అలాంటి క్రికెటే ఆడతాం. ఈ విషయంలో షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌ చాలా కీలకం. వాళ్ల దూకుడు ఆట కొనసాగించాలనే కోరుకుంటున్నా’’ అని మజుందార్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు