Cricket Records : RRR.. సరసన చేరేదెవరు?

వీరోచిత ఇన్నింగ్స్‌లకు మారు పేరైన వీరేంద్ర సెహ్వాగ్‌...ధనాదన్‌ బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ముగించే ఎంఎస్‌ ధోనీ...దూకుడైన ఆటతో ప్రత్యర్థులపై

Updated : 29 Jun 2022 13:02 IST

ఐర్లాండ్‌పై దీపక్‌ హుడా శతకం.. అయినా ఆ జాబితాలో లేడు

వీరోచిత ఇన్నింగ్స్‌లకు మారు పేరైన వీరేంద్ర సెహ్వాగ్‌... ధనాదన్‌ బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ముగించే ఎంఎస్‌ ధోనీ... దూకుడైన ఆటతో ప్రత్యర్థులపై విరుచుకుపడే విరాట్‌ కోహ్లీ.. వీరెవ్వరికి సాధ్యం కాని ఘనతను ‘RRR’ ఆటగాళ్లు సాధించారు. భారత్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన త్రయమే.. రైనా, రోహిత్‌, రాహుల్‌.

ఎనిమిదేళ్లు అయినా..

ఎప్పుడో 2016లో వెస్టిండీస్‌పై టీ20 మ్యాచ్‌లో సెంచరీ చేసి రాహుల్... టీమ్‌ఇండియా తరఫున మూడు ఫార్మాట్లలో శతకం నమోదు చేసిన మూడో భారత ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. అయితే ఆ తరవాత నుంచి ఇప్పటివరకూ మరే భారత ఆటగాడు వీరి సరసన చేరలేకపోయాడు. తాజాగా ఐర్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో దీపక్‌ హుడా శతక్కొట్టి ఈ ఫార్మాట్‌లో సెంచరీ చేసిన నాలుగో భారత ఆటగాడిగా నిలిచాడు. అయితే  మూడు ఫార్మాట్లో శతకం బాదిన ప్లేయర్ల జాబితాలో ఇంకా ఆ ముగ్గురి పేర్లే కనిపిస్తున్నాయి.


నాలుగో ప్లేయర్‌గా నిలిచేదెవరూ..?

భారత్ తరఫున ఈ ఘనతను అందుకొన్న తొలి క్రికెటర్‌ సురేశ్‌ రైనా. తర్వాత రోహిత్‌, కేఎల్ రాహుల్ సాధించారు. అయితే ఇప్పుడు మూడు ఫార్మాట్లలో సెంచరీ ఎవరు చేస్తారన్నది ఆసక్తికరం. వన్డే, టెస్టుల్లో 70కు పైగా శతకాలు బాదిన విరాట్... భారత టీ20 లీగ్‌లో 5 సెంచరీలు కొట్టాడు. అయితే టీమ్‌ఇండియా తరఫున పొట్టి ఫార్మాట్‌లో ఇప్పటివరకూ శతకం కొట్టలేదు. రెండున్నరేళ్లుగా ఏ ఫార్మాట్‌లోనూ సెంచరీ చేయలేదు. అతడు మళ్లీ ఫామ్‌లోకి వస్తే ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సరసన చేరడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక శిఖర్‌ ధావన్‌ సైతం అంతే..  వన్డే, టెస్టులతో పాటు భారత టీ20 లీగ్‌లో శతకం కొట్టినా టీమ్‌ఇండియా తరఫున పొట్టి ఫార్మాట్‌లో సాధించలేదు. అతడు జట్టులో చోటు కూడా కోల్పోయాడు. ఇక పంత్‌, శ్రేయస్‌ కూడా పొట్టి ఫార్మాట్‌లో శతకం కొట్టగల ప్రతిభావంతులే. అయితే రోహిత్‌, రాహుల్‌ ఇప్పుడు మూడు ఫార్మాట్‌లో ఆడగల ఓపెనర్లు.. ఇలాంటి ప్లేయర్లు టీమ్‌ఇండియాలో ప్రస్తుతం ఎవరూ లేరు. కాబట్టి ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సరసన చేరడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

సెంచరీలు ఇలా..

* పురుషుల అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో సెంచరీ కొట్టిన మొదటి బ్యాటర్‌ - క్రిస్‌ గేల్‌ (వెస్టిండీస్‌) (2007లో)

* మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్‌ - హీథర్ నైట్ (ఇంగ్లాండ్‌) (2020లో)

* ఇప్పటివరకు పురుషుల అంతర్జాతీయ క్రికెట్‌లో 19 మంది మాత్రమే మూడు ఫార్మాట్లో శతకం కొట్టారు. వీరిలో చివరి ఆటగాడు డేవిడ్‌ మలన్‌ (ఇంగ్లాండ్‌). ఈ ఏడాది నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో శతకం చేయడం ద్వారా అతడు ఈ జాబితాలో చేరాడు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని