IND vs NZ: అద్భుతం.. అజేయం.. ప్రపంచకప్‌ ఫైనల్‌కు భారత్‌

ఈ ప్రపంచకప్‌లో భారత్‌ మరో అద్భుత విజయం సాధించింది. సెమీస్‌లో న్యూజిలాండ్‌ను 70 పరుగుల తేడాతో ఓడించి భారత్‌ సగర్వంగా ఫైనల్‌ చేరింది.

Updated : 16 Nov 2023 03:42 IST

ప్రత్యర్థి ఎదుట భారీ లక్ష్యం.. మనవైపు మెరికల్లాంటి బౌలర్లు.. 39 పరుగులకే కివీస్‌ రెండు కీలక వికెట్లు డౌన్‌.. ఇక అంతే భారత్‌ శిబిరంలో సంతోషానికి అవధుల్లేవు. సీన్‌ కట్‌ చేస్తే న్యూజిలాండ్‌ 200 పరుగులు దాటింది. అయినా మరో వికెట్‌ పడదే.. 

ఓవైపు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. క్రీజులో ఉన్న విలియమ్సన్‌, మిచెల్‌ రెచ్చిపోతున్నారు. భారీ లక్ష్యాన్ని ఛేదిస్తారా? అన్న అనుమానం ఓవైపు.. కీలక సమయంలో బౌలర్లు విజృంభిస్తారని ఆశ మరోవైపు..

అప్పుడొచ్చాడు షమి బౌలింగ్‌కి. 33వ ఓవర్‌ రెండో బంతికి విలియమ్సన్‌, నాలుగో బంతికి లాథమ్‌ ఔట్‌. దీంతో భారత్‌ శిబిరంలో ఇక గెలిచాం అన్నంత సంబురాలు. 

వీరి ఔట్‌తో అప్పుడే వచ్చిన ఫిలిప్స్‌.. క్రీజులో భారీ ఇన్నింగ్స్‌ దిశగా సాగుతున్న మిచెల్‌ మెల్లిగా కుదురుకున్నారు. తొలుత నెమ్మదిగా ఆడిన వీరు.. తర్వాత కివీస్‌ను రేసులోకి తెచ్చేలా కనిపించారు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. 42 ఓవర్లు పూర్తయ్యాయి. సమీకరణం 48 బంతుల్లో 110 పరుగులు. వికెట్లు కాపాడుకుని టీ20 లాగా దూకుడు మొదలుపెడితే విజయతీరాలకు చేరచ్చు.. ఇలాంటి ఊహాగానాలతో భారత్‌ శిబిరంలో మళ్లీ ఆందోళన.

ధాటిగా ఆడుతున్న ఫిలిప్స్‌ను 43 ఓవర్లో బుమ్రా దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాతి ఓవర్లో శతకవీరుడు మిచెల్‌ను షమి ఔట్‌ చేశాడు. అంతే ఇక భారత్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దీనికి తోడు కుల్దీప్‌, సిరాజ్‌ మరో వికెట్‌ తీయడంతో భారత్‌ విజయం ఖరారు అయిందన్న భావనలో ప్రేక్షకులు ఉండిపోయారు. దీనికి మరింత ఆనందాన్ని ఇచ్చేలా 49 ఓవర్‌లో షమి చివరి రెండు వికెట్లు తీసి మొత్తంగా 7 వికెట్లతో కోట్లాది అభిమానులను ఆనంద పరవశంలో మునిగితేలాలా చేశాడు. 

ముంబయి: భారత్‌ అదరహో.. ఈ ప్రపంచకప్‌ (ICC ODI World Cup 2023)లో లీగ్‌ దశలో ఆడిన 9 మ్యాచ్‌ల్లోనూ జయకేతనం ఎగరేసిన టీమ్‌ఇండియా (Team India).. మరో మెట్టుపెక్కి ప్రపంచకప్‌ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. కీలక సెమీస్‌ పోరులో న్యూజిలాండ్‌ (NZ)ను 70 పరుగుల తేడాతో మట్టికరిపించింది. దీంతో గత వరల్డ్‌ కప్‌ సెమీస్‌ పరాజయానికి భారత్‌ ఇప్పుడు బదులు తీర్చుకున్నట్లైంది. ఇక వరుసగా మూడోసారి ఫైనల్‌ చేరుదామనుకున్న కివీస్‌ ఆశలు ఫలించలేదు. 398 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఈ పరాజయంతో న్యూజిలాండ్‌ తన ప్రపంచకప్‌ ప్రయాణాన్ని ముగించింది. మహ్మద్‌ షమీ (7/57) వికెట్లు తీసి ఆ జట్టు పతనాన్ని శాసించాడు. షమీ దెబ్బకు కివీస్‌ విలవిలలాడింది. బుమ్రా, సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌ తలో వికెట్‌ తీసి భారత్‌ విజయంలో తమవంతు పాత్ర పోషించారు.  

కివీస్‌ బ్యాటర్లలో డారిల్ మిచెల్ (134; 119 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్‌లు) శతకం బాదగా.. కేన్‌ విలియమ్సన్ (69; 73 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌), గ్లెన్ ఫిలిప్స్ (41; 33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. 39 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన కివీస్‌ను విలియమ్సన్, డారిల్ మిచెల్ ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 181 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మిగతా  బ్యాటర్లు పెద్దగా స్కోర్లు చేయలేదు. 

కోహ్లీ, అయ్యర్‌ శతకాల మోత..

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. కింగ్‌ కోహ్లీ 117 (113 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), శ్రేయస్‌ అయ్యర్‌ 105 (70 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లు) శతకాల మోత మోగించారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, రోహిత్‌ శర్మ చక్కని ఆరంభాన్ని ఇచ్చారు. శతక భాగస్వామ్యం దిశగా సాగుతున్న ఈ జోడీని సౌథీ విడదీశాడు. రోహిత్‌ (47; 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) విలియమ్సన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. మరోవైపు అదే జోరుతో అర్ధశతకం పూర్తి చేసుకుని సెంచరీ వైపు అడుగులు వేస్తున్న శుభ్‌మన్‌ గిల్‌ (65 బంతుల్లో 79 పరుగులు 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు.

ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి విరాట్‌ కోహ్లీ చూడచక్కని షాట్లతో ఆడుతూ పరుగులు రాబట్టాడు. ఫెర్గూసన్‌ వేసిన 41.4 ఓవర్‌లో రెండు పరుగులు చేసిన కోహ్లీ.. వన్డేల్లో 50 సెంచరీలు పూర్తి చేసిన క్రికెటర్‌గా సరికొత్త చరిత్రను సృష్టించాడు. అంతేకాదు, ఇప్పటివరకూ సచిన్‌ పేరిట ఉన్న (49) సెంచరీల రికార్డును బద్దలు కొట్టాడు. సెంచరీ తర్వాత దూకుడు పెంచిన కోహ్లీ.. సౌథీ బౌలింగ్‌లో కాన్వేకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. దీంతో 163 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. మరోవైపు శ్రేయస్‌ తన దూకుడు పెంచి శతకాన్ని అందుకున్నాడు. జోరుమీదున్న శ్రేయస్‌ కూడా బౌల్ట్‌ బౌలింగ్‌లో మిచెల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. సూర్యకుమార్‌ 1(2), తక్కువ పరుగులకే ఔట్‌ కాగా, రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగిన శుభ్‌మన్‌ గిల్‌ (80; 66 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) తిరిగి వచ్చి, కెఎల్‌ రాహుల్‌ 39 (20 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) కలిసి ఇన్నింగ్స్‌ పూర్తి చేశాడు. ఇద్దరూ నాటౌట్‌గా నిలిచారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో టిమ్‌ సౌథీ మూడు వికెట్లు పడగొట్టినా 100 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. ట్రెంట్‌ బౌల్ట్‌కు ఒక వికెట్‌ దక్కింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని