IPL 2023: వారికి పీడకలలు.. తారుమారైన టీమ్‌ల ఫలితాలు!

ఐపీఎల్ మ్యాచ్‌లు (IPL 2023) రసవత్తరంగా సాగుతున్నాయి. ప్లేఆఫ్స్‌ స్థానాల కోసం టాప్‌ జట్లు రేసులో ముందువరుసలో ఉన్నాయి. అయితే, కొంతమంది ఆటగాళ్లకు మాత్రం మింగుడుపడని అనుభవాలు ఎదురయ్యాయి.  

Updated : 27 Apr 2023 14:03 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ (IPL 2023) సీజన్‌ సగానికిపైగా ముగిసింది. ఎనిమిది జట్లు ఏడేసి మ్యాచ్‌ల చొప్పున ఆడేశాయి. ఆర్‌సీబీ, కోల్‌కతా మాత్రమే ఎనిమిది మ్యాచ్‌లను పూర్తి చేసుకున్నాయి. ఎక్కువ భాగం మ్యాచ్‌లు చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగాయి. భారీ స్కోర్లు నమోదైనప్పటికీ విజయం సాధించేందుకు చివరి వరకూ పోరాటం చేసిన జట్లు కొన్ని ఉండగా.. కేవలం ఒక్క ఓవర్‌లోనే ఫలితం తారుమారై ఓటమి పాలైన మ్యాచ్‌లూ అభిమానులను అలరించాయి. అయితే కొందరు ఆటగాళ్లకు, జట్లకు మాత్రం కొన్ని చేదుగుళికలు అనిపించిన సందర్భాలూ ఉన్నాయి. మరి ఆ విశేషాలు ఏంటో చూద్దాం.. 

వర్షంతో ఆరంభం..

నితీశ్ రాణా నాయకత్వంలోని కోల్‌కతాకు తొలి మ్యాచ్‌లోనే వరుణుడు అడ్డంకిగా మారాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా డక్‌వర్త్‌లూయిస్ పద్ధతిన ఏడు పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత పంజాబ్ 191/5 స్కోరు చేయగా.. కోల్‌కతా 146/7 (16 ఓవర్లు) స్కోరు వద్ద ఉన్నప్పుడు వర్షం పడటంతో మ్యాచ్‌ను ఆపేశారు. అప్పటికి కోల్‌కతా ఏడు పరుగులు వెనుకబడి ఉంది. ఒకవేళ వర్షం పడకపోతే.. మంచి ఫామ్‌లో ఉన్న శార్దూల్‌ ఠాకూర్, సునీల్ నరైన్ లక్ష్య ఛేదన పూర్తి చేసే అవకాశం ఉంది. వర్షం రావడంతో కోల్‌కతా విజయావకాశాలు ముగిశాయి. 

217 పరుగుల భారీ ఛేదనలో..

చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్‌లో 217/7 భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో లఖ్‌నవూ కూడా ధాటిగా ప్రారంభించింది. పవర్‌ప్లేలో 80 పరుగులు చేసి టార్గెన్‌ను కాస్త తేలిక చేసుకుంది. దీపక్ చాహర్‌ (0/55), తుషార్ దేశ్‌పాండే (2/45) భారీగా పరుగులు సమర్పించారు. అయితే, మొయిన్ అలీతోపాటు (4/26) మిచెల్‌ సాంట్నర్ (1/21) కట్టుదిట్టంగా బంతులను సంధించడంతో లఖ్‌నవూ 205/7 స్కోరుకే పరిమితమైంది. దీంతో 12 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. చివరి వరకూ హడలెత్తించిన లఖ్‌నవూ కీలక సమయంలో పరుగులు సాధించలేక ఓడింది. 

రాజస్థాన్‌ను ఓడించిన పడిక్కల్

గతేడాది ఫైనలిస్ట్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ స్వల్ప తేడాతో  పంజాబ్‌ కింగ్స్‌ చేతిలో ఓటమిపాలైంది. తొలుత పంజాబ్‌ 197/4 స్కోరు చేస్తే రాజస్థాన్‌ 192/7 స్కోరు మాత్రమే చేయగలిగింది. పంజాబ్‌ ఓడించిందని కాకుండా.. రాజస్థాన్‌ బ్యాటర్ దేవదుత్‌ పడిక్కల్ (26 బంతుల్లో 21 పరుగులు) ఓడించాడంటే బాగుంటుందేమో. మిగతా బ్యాటర్లంతా దూకుడుగా ఆడుతుంటే పడిక్కల్‌ మాత్రం విలువైన బంతులను వృథా చేసి లక్ష్య ఛేదన రన్‌రేట్‌ పెరిగేలా చేశాడు. ఆఖర్లో జురెల్ (32 పరుగులు: 15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), హెట్మెయర్ (36 పరుగులు: 18 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) రాణించినా ప్రయోజనం లేకుండా పోయింది. 

యశ్ దయాల్ మరిచిపోలేని మ్యాచ్‌.. 

తన ఐపీఎల్‌ కెరీర్‌లో యశ్‌ దయాల్‌కు మరిచిపోలేని మ్యాచ్‌. ఒకే ఓవర్‌లో ఐదు సిక్స్‌లు సహా 31 పరుగులు సమర్పించి గుజరాత్‌ టైటాన్స్‌ ఓటమికి కారణమయ్యాడు. హార్దిక్‌ పాండ్య గైర్హాజరీలో రషీద్‌ ఖాన్‌ నడిపించిన గుజరాత్ జట్టు తొలుత 204/4 స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో 18 ఓవర్లకు కోల్‌కతా 162/7 వద్ద ఉంది. చివరి 12 బంతుల్లో కోల్‌కతా విజయానికి 52 పరుగులు కావాలి. 19వ ఓవర్‌ వేసిన గుజరాత్‌ బౌలర్‌ జాషువా లిటిల్‌ సిక్స్, ఫోర్ సహా 14 పరుగులు ఇచ్చాడు. దీంతో చివరి ఓవర్‌లో 29 పరుగులు చేయాల్సిన పరిస్థితి. తొలి బంతికి యశ్‌ దయాల్‌ కేవలం ఒక్క పరుగే ఇచ్చాడు. దీంతో చివరి 5 బంతుల్లో నాలుగు సిక్స్‌లు, ఒక ఫోర్ పడితేనే కోల్‌కతాకు విజయం సొంతమవుతుంది. ఆ సమయంలో రింకు సింగ్‌ (48*) అనూహ్యంగా వరుసగా ఐదు బంతుల్లోనూ సిక్స్‌లు కొట్టి కోల్‌కతాను గెలిపించాడు. తన  నాలుగు ఓవర్ల కోటాలో వికెట్ లేకుండా 69 పరుగులు సమర్పించడం గమనార్హం. ఇదే మ్యాచ్‌లో రషీద్‌ ఖాన్‌ హ్యాట్రిక్‌ సాధించినా.. యశ్ దెబ్బకు గుజరాత్‌ ఓడిపోవాల్సి వచ్చింది.

డీకే రనౌట్ మిస్‌..

ప్రస్తుత సీజన్‌లో అత్యంత ఆసక్తికరమైన మ్యాచ్‌గా లఖ్‌నవూ - బెంగళూరు జట్ల మధ్య జరిగిన పోరు నిలుస్తుందనడంలో సందేహం లేదు. కోహ్లీ, డుప్లెసిస్, మాక్స్‌వెల్ హాఫ్ సెంచరీలతో బెంగళూరు 212/2 స్కోరు చేసింది. అనంతరం లఖ్‌నవూ టాప్‌ఆర్డర్ విఫలమైనప్పటికీ.. మార్నస్ స్టొయినిస్ (65), నికోలస్ పూరన్ (62), ఆయుష్ బదోని (30) వీరబాదుడు బాదేయడంతో లఖ్‌నవూ రేసులోకి వచ్చింది. 19 ఓవర్లకు 208/7 స్కోరుతో లఖ్‌నవూ నిలవడంతో ఉత్కంఠ రేగింది. అనుకున్నట్లుగానే హర్షల్‌ పటేల్ బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసి బెంగళూరుకు ఊపిరి పోశాడు. ఐదు బంతుల్లో కేవలం నాలుగు పరుగులే ఇచ్చాడు. దీంతో చివరి బంతికి ఒక్క పరుగు అవసరమైంది. ఆ ఒక్కటి కొట్టకపోతే తొలి సూపర్‌ ఓవర్‌ను చూసే అవకాశం వచ్చేది. అయితే, హర్షల్‌ అద్భుతమైన బంతిని సంధించినా.. వికెట్ కీపర్‌ బంతిని పట్టుకొని రనౌట్‌ చేయడంలో విఫలం కావడం.. అవేశ్ ఖాన్‌ పరుగు పూర్తి చేయడం చకచకా జరిగిపోయాయి. దీంతో సరిగ్గా 20 ఓవర్లలో 213/9 స్కోరు చేసి లఖ్‌నవూ సంచలన విజయం నమోదు చేసింది.

దిల్లీకి  గెలుపు చేజారిందిలా..

వరుసగా ఓటములతో కొనసాగుతున్న దిల్లీ, ముంబయి జట్ల మధ్య ఉత్కంఠ పోరుకు 16 మ్యాచ్‌ వేదికైంది. ఇరు జట్లూ చివరి వరకూ పోరాడినా విజయం మాత్రం ముంబయికే సొంతమైంది. తొలుత దిల్లీ 172 పరుగులకు ఆలౌట్ కాగా.. అనంతరం ముంబయి ఇండియన్స్‌ దూకుడుగా లక్ష్య ఛేదనను ప్రారంభించింది. తొలి వికెట్‌కు ఇషాన్‌ తో కలిసి రోహిత్ 71 పరుగులు రాబట్టాడు. తర్వాత ఇషాన్‌ ఔటైనప్పటికీ.. తిలక్ వర్మతో కలిసి మరో 68 పరుగులను జోడించారు. స్వల్ప వ్యవధిలో తిలక్‌తోపాటు సూర్య (0) పెవిలియన్‌ చేరారు. దీంతో 16 ఓవర్లు ముగిసేసరికి ముంబయి 139/3కి చేరింది. చివరి నాలుగు ఓవర్లలో 34 పరుగులు చేస్తే చాలు.. టీ20ల్లో పెద్ద సమస్యే కాదు. కానీ, దిల్లీ బౌలర్లు ఒక్కసారిగా విజృంభించడంతో మ్యాచ్‌ రసవత్తరంగా మారింది. చివరి బంతికి ముంబయి రెండు పరుగులు చేయాల్సిన తరుణంలో దిల్లీ కెప్టెన్‌ విసిరిన త్రో సరైన దిశగా లేకపోవడంతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. సరిగ్గా ముంబయి 20 ఓవర్లలో 174/4తో విజయం సాధించింది. 

226 పరుగులైనా సరే..

ఐపీఎల్‌లో అత్యధిక అభిమానులను కలిగిన రెండు జట్ల మధ్య పోటీ ఎలా ఉంటుందో చెప్పడానికి చెన్నై సూపర్ కింగ్స్, రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల పోరు చాలు. సీఎస్‌కే 226/6 భారీ స్కోరు చేసినా.. ఏమాత్రం భయపడకుండా దీటుగా బదులిస్తూ ఆర్‌సీబీ బ్యాటింగ్‌ కొనసాగించింది. చివరి ఆరు బంతుల్లో 19 పరుగులు అవసరం. ఆల్‌రౌండర్లు హసరంగ, సుయాశ్‌ ప్రభుదేశాయ్‌ ఉండటంతో మరోసారి కేకేఆర్‌-జీటీ మ్యాచ్ ఫలితం పునరావృతం అవుతుందా అనే అనుమానం అభిమానుల్లో కలిగింది. అయితే, సీఎస్‌కే యువ బౌలర్ పతిరాణ మాత్రం అద్భుతమైన బంతులను సంధించి వికెట్‌ తీసి కేవలం 10 పరుగులను మాత్రమే ఇచ్చాడు. దీంతో ఉత్కంఠపోరులో సీఎస్‌కే 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

అర్జున్‌ ఖాతాలో చెత్త రికార్డు..

కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన సచిన్‌ కుమారుడు అర్జున్ తెందూల్కర్‌.. కాస్త ఫర్వాలేదనిపించాడు. అయితే, తన రెండో మ్యాచ్‌లో మాత్రం తేలిపోవడం సోషల్ మీడియాలో విమర్శలకు దారితీసింది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం మూడు ఓవర్ల స్పెల్‌లో ఏకంగా 48 పరుగులు సమర్పించాడు. ఒకే ఓవర్‌లో 31 పరుగులు ఇచ్చి అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, తర్వాత హైదరాబాద్‌, గుజరాత్‌ మీద జరిగిన మ్యాచ్‌ల్లో తన బౌలింగ్‌ సత్తాను చాటాడు. 

టార్గెట్‌కు చేరువగా వచ్చి మరీ..

ఈ సీజన్‌లో హైదరాబాద్‌కు పెద్దగా కలిసిరాలేదు. సొంతమైదానంలో ముంబయి, దిల్లీ జట్లతో జరిగిన మ్యాచుల్లోనూ చివరి వరకు వచ్చి ఓటమిపాలైన తీరు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దిల్లీ క్యాపిటల్స్‌ను తక్కువ పరుగులకే కట్టడి చేశామన్న ఆనందం హైదరాబాద్‌కు మిగల్లేదు. సన్‌రైజర్స్‌ బ్యాటర్లు ఆడారు. 145 పరుగుల స్వల్ప టార్గెట్‌ను కూడా ఛేదించడంలో విఫలమైంది. ఏడు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అంతకు ముందు ముంబయితో జరిగిన మ్యాచ్‌లోనూ హైదరాబాద్‌ కీలక సమయంలో చేతులెత్తేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని