ODI WC 2023: 300 దాటేసి.. 400పై కన్నేసి.. ప్రపంచకప్‌లో దంచేస్తున్న జట్లు

ఇప్పటి పరిస్థితుల్లో 300 కొడితే ఓ మోస్తరు స్కోరుగానే భావిస్తున్నారు. ఇక 350 నుంచి 400 కొట్టినా విజయంపై దీమా లేకపోవడం కూడా ఈ వరల్డ్‌ కప్‌లో (ODI World Cup 2023) చూస్తున్నాం.

Published : 14 Nov 2023 14:40 IST

మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టు 300 స్కోరు చేస్తే ప్రత్యర్థి పని అయిపోయినట్లే.. ఛేదనకు దిగకముందే ఆ జట్టు ఓటమి ఖరారైందనే చెప్పాలి. ఇదీ వన్డేల్లో గతంలో పరిస్థితి. 250 చేసినా మంచి స్కోరుగానే భావిస్తూ.. జట్టు విజయానికి అవకాశాలున్నాయని చెప్పేవాళ్లు. కానీ ఇప్పుడు 300 పరుగులు చేసినా కచ్చితంగా విజయం దక్కుతుందని చెప్పలేని పరిస్థితి. ఇక 250 చేస్తే అంతే సంగతి! ఇప్పుడు ప్రపంచకప్‌లో అయితే 300 స్కోరు చేయడం సాధారణంగా మారిపోయింది. ఒకప్పుడు 300 స్కోరు చేసేందుకు జట్లు ఆపసోపాలు పడేవి. కానీ ఇప్పుడు మంచినీళ్లు తాగినంత సులువుగా 300 పరుగులను చేరుకుంటున్నాయి. అయితే ఇప్పుడా స్కోరు కూడా చాలడం లేదు. 300 కూడా తక్కువే అని భావిస్తున్న జట్లు.. 400 పరుగులపై కన్నేశాయి. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే మూడు సార్లు 400కు పైగా పరుగులు నమోదవడమే అందుకు నిదర్శనం. ఈ మెగా టోర్నీలో జట్లు చెలరేగిపోతున్న తీరుకు ఇదే రుజువు. 

దంచుడే దంచుడే

మొదట బ్యాటింగ్‌కు దిగితే చాలు పరుగుల వరద పారించడమే లక్ష్యంగా జట్లు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఆరంభం నుంచే ధనాధన్‌ బ్యాటింగ్‌తో అభిమానులను అలరిస్తున్నాయి. 50 ఓవర్ల వరకూ అదే తీవ్రత, దూకుడు కొనసాగించి సులువుగా 300కు పైగా పరుగులు చేస్తున్నాయి. 300 చేసినా విజయంపై ధీమాతో ఉండలేని పరిస్థితి నెలకొంది. ఛేదనలోనూ జట్లు భారీ లక్ష్యాలను అందుకుంటున్నాయి. అందుకే జట్లు 400కు పైగా పరుగులు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రపంచకప్‌లో శ్రీలంకపై దక్షిణాఫ్రికా 428, నెదర్లాండ్స్‌పై భారత్‌ 410, పాకిస్థాన్‌పై న్యూజిలాండ్‌ 401 పరుగులు చేశాయి. ముఖ్యంగా ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా దూకుడు మామూలుగా లేదు. మొదట బ్యాటింగ్‌ చేస్తే ఆ జట్టు కచ్చితంగా 350కి పైగా పరుగులు చేసేలా కనిపిస్తోంది. ఈ టోర్నీలో మొదట బ్యాటింగ్‌ చేసిన ప్రతిసారి సఫారీ జట్టు కనీసం 310కి పైగా పరుగులు చేసింది. మూడు మ్యాచ్‌ల్లో 350కి పైగా పరుగులు సాధించాడు. ఇంగ్లాండ్‌పై 399 స్కోరు నమోదు చేసింది. అద్భుత ఫామ్‌లో ఉన్న డికాక్‌ మెరుపు ఆరంభాన్నిస్తే.. వాండర్‌డసెన్, మార్‌క్రమ్, క్లాసెన్, మిల్లర్‌ కలిసి జట్టు భారీస్కోరు సాధించేలా చూస్తున్నారు. ప్రపంచకప్‌ చరిత్రలోనే అత్యధిక స్కోరు చేసిన జట్టుగా దక్షిణాఫ్రికా (428) ఇప్పటికే రికార్డు సృష్టించింది. నెదర్లాండ్స్‌ను ఉతికేస్తూ 410 పరుగులు చేసిన టీమ్‌ఇండియా.. శ్రీలంకపై 357, దక్షిణాఫ్రికాపై 326 స్కోరు అందుకుంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా కూడా దూకుడు కొనసాగిస్తున్నాయి. నెదర్లాండ్స్‌పై 399 పరుగులు చేసిన ఆస్ట్రేలియా.. మరో మూడు మ్యాచ్‌ల్లోనూ 300కు పైగా పరుగులు చేసింది. ఈ టోర్నీలో లీగ్‌ దశలో 45 మ్యాచ్‌లు పూర్తికాగా.. ఇందులో 23 మ్యాచ్‌ల్లో 300కు పైగా స్కోర్లు నమోదు కావడం విశేషం. 

ఎన్నో కారణాలు..

ప్రస్తుతం వన్డేల్లో జట్లు అలవోకగా భారీ స్కోర్లు సాధించడం వెనుక ఎన్నో కారణాలున్నాయి. పెరిగిన ఆట ప్రమాణాలు, ఆటగాళ్ల దూకుడైన బ్యాటింగ్, బ్యాటింగ్‌ అనుకూల పిచ్‌లు, ఫీల్డింగ్‌ నిబంధనలు ఇలా ఎన్నో అంశాలున్నాయి. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఆటలో ప్రమాణాలు పెరిగాయి. గతంలో చిన్నజట్లపై పెద్ద జట్లు పరుగుల వరద పారించేవి. కానీ ఇప్పుడు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని జట్ల ఆట ప్రమాణాలు పెరిగాయి. అన్ని జట్లు నాణ్యమైన క్రికెట్‌ ఆడుతున్నాయి. విజయాల కోసం పోటీపడుతూ పరుగులు సాధిస్తున్నాయి. టీ20లు రావడంతో ఆటగాళ్ల బ్యాటింగ్‌లో దూకుడు పెరిగింది. వన్డేల్లోనూ కొన్ని ఓవర్ల చొప్పున ఇన్నింగ్స్‌ను విభజించి చూస్తూ ఆటగాళ్లు వేగంగా ఆడుతున్నారు. క్రీజులో కొన్ని ఓవర్లున్నా ఎక్కువ పరుగులు చేసేందుకే ప్రయత్నిస్తున్నారు. ఇక బ్యాటింగ్‌ అనుకూల పిచ్‌లతో బ్యాటర్లు పరుగుల పండగ చేసుకుంటూ.. అభిమానులకు విందు అందిస్తున్నారు. మరోవైపు ఫీల్డింగ్‌ నిబంధనల్లో మార్పులూ కలిసొస్తున్నాయి. ప్రస్తుతం వన్డేల్లో మూడు పవర్‌ప్లేలున్నాయి. మొదటి పవర్‌ ప్లే (1 నుంచి 10 ఓవర్లు)లో గరిష్ఠంగా ఇద్దరు ఫీల్డర్లు మాత్రమే 30 గజాల వలయం బయట ఉండాలి. రెండో పవర్‌ప్లే (11 నుంచి 40 ఓవర్లు) గరిష్ఠంగా నలుగురు మాత్రమే వలయం బయట ఫీల్డింగ్‌ చేయాలి. చివరి పవర్‌ప్లే (41 నుంచి 50)లో గరిష్ఠంగా అయిదుగురు ఫీల్డర్లు బయట ఉండొచ్చు. ఇలా వివిధ కారణాలతో వన్డేల్లో భారీ స్కోర్లు సాధ్యమవుతున్నాయి. ఇదే దూకుడు కొనసాగితే వన్డేలో 500 స్కోరునూ త్వరలోనే చూసే అవకాశముంది.  

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని