
IND vs NZ: వీరూ.. నా బౌలింగ్‌లో దంచికొట్టడం ఇంకా గుర్తుంది: అజాజ్
ఇంటర్నెట్‌డెస్క్: టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్ వీరేందర్ సెహ్వాగ్.. ఒకానొక సమయంలో న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ బౌలింగ్‌లో దంచి కొట్టాడట. దాంతో బంతి మైదానం దాటి వెళ్లిందట. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. తాజాగా ఇరు జట్ల మధ్య జరిగిన రెండో టెస్టులో టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో అజాజ్ పది వికెట్లు తీసి కొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రతి ఒక్కరూ అతడి ఘనతను కీర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్ వీరేందర్ సెహ్వాగ్ సైతం కివీస్ స్పిన్నర్‌ను మెచ్చుకున్నాడు. దానికి స్పందించిన అజాజ్.. వీరూతో తనకున్న ఓ పాత జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నాడు.
‘ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టడం క్రికెట్‌లో అత్యంత కష్టమైన రికార్డు. అజాజ్ ఈరోజు.. నువ్వు జీవితాంతం గుర్తుంచుకుంటావు. ముంబయిలో పుట్టి.. ముంబయిలోనే చరిత్ర సృష్టించావు. ఈ చారిత్రక ప్రదర్శనకు అభినందనలు’ అని మెచ్చుకుంటూ సెహ్వాగ్ తొలుత ఓ ట్వీట్ చేశాడు. దీనికి బదులిచ్చిన అజాజ్.. వీరూకు ధన్యవాదాలు తెలుపుతూ.. ‘ఒకసారి ఓవల్‌లోని ఈడెన్ పార్క్ మైదానంలో నేను నెట్ బౌలర్‌గా ఉండగా మీరు నా బౌలింగ్‌లో బంతిని దంచికొట్టడం.. అది మైదానం దాటి వెళ్లడం నాకింకా గుర్తుంది’ అని అభిమానులతో పంచుకున్నాడు. అనంతరం సెహ్వాగ్ ప్రతి స్పందించాడు. ‘ముంబయిలో నువ్వు సాధించింది అత్యంత విశేషమైనది. అందువల్లే టీమ్‌ఇండియా సిరీస్ విజయం సాధించడం కన్నా.. నీ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. నువ్వు మరింత విజయవంతం అవ్వాలని మనసారా కోరుకుంటున్నా’ అని పేర్కొన్నాడు. కాగా, భారత్ రెండో టెస్టులో 372 పరుగుల తేడాతో గెలుపొంది 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.