Team india : 10 వికెట్ల విజయం.. భారత్‌కు ఏడోసారి.. ఇంతకుముందు ఎప్పుడంటే..?

క్రికెట్‌లో పది వికెట్ల తేడాతో ఒక జట్టు నెగ్గిదంటే..అది ఏ ఫార్మాట్‌లోనైనా గొప్ప విషయమే. అయితే, సుదీర్ఘంగా సాగే టెస్టు మ్యాచ్‌ల్లో..మూడు గంటల్లోనే ..

Updated : 27 Dec 2022 17:27 IST

ఇంగ్లాండ్‌పై అలవోకగా గెలిచిన టీమ్‌ఇండియా

క్రికెట్‌లో పది వికెట్ల తేడాతో ఒక జట్టు నెగ్గిందంటే..అది ఏ ఫార్మాట్‌లోనైనా గొప్ప విషయమే. అయితే, సుదీర్ఘంగా సాగే టెస్టు మ్యాచ్‌ల్లో..మూడు గంటల్లోనే ఫలితం తేలే టీ20లతో పోలిస్తే వన్డేల్లో 10 వికెట్ల విజయం ఏ జట్టుకైనా ప్రత్యేకమే. అలాంటింది ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా టీమ్‌ఇండియానే రికార్డు సృష్టించింది. తాజాగా ఇంగ్లాండ్‌పై విజయంతో ఏడోసారి ఈ జాబితాలో చేరింది. ఇంతకుముందు ఎప్పుడు.. ఎలా.. ఎవరిపై ఎలా గెలిచిందో ఓ లుక్కేద్దాం.


ఫస్ట్‌ విన్‌ ఫర్‌ ఇండియా.. ఇట్‌ ఈజ్‌ ద బెస్ట్‌

అప్పటివరకూ టెస్టు క్రికెట్‌ రుచే తెలిసిన టీమ్‌ఇండియా తొలిసారి పరిమిత ఓవర్ల క్రికెట్‌కు సిద్ధమైంది. 1975 ప్రపంచకప్‌లో ఈస్ట్‌ ఆఫ్రికాతో మ్యాచ్‌. వేదిక ఇంగ్లాండ్‌లోని హెడింగ్లీ. అయితే, టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఈస్ట్‌ ఆఫ్రికా బ్యాటర్లను భారత బౌలర్లు బెంబేలెత్తించారు. మన బౌలర్ల ధాటికి 60 ఓవర్ల మ్యాచ్‌లో 55.3ఓవర్లు బ్యాటింగ్‌ చేసి 120 పరుగులకు ఆలౌట్‌ అయ్యారు. మన బౌలర్‌ బిషన్‌ సింగ్‌ బేడి 12 ఓవర్లు వేసి కేవలం ఆరు పరుగులే ఇచ్చి ఒక వికెట్‌ పడగొట్టాడు. ఈ స్పెల్‌లో 8 మెయిడిన్లు ఉండటం విశేషం. మిగిలిన బౌలర్లు మదన్‌లాల్‌(3),సయ్యద్‌ అలీ(2),మొహిందర్‌ అమర్‌నాథ్‌(2)వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. ఛేదనలో టీమ్‌ఇండియా ఓపెనర్లు సునీల్ గవాస్కర్‌ (65),ఫరూక్‌ ఇంజినీర్‌(54)రాణించడంతో 29.5 ఓవర్లలో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌తో పాటు వికెట్‌ కీపింగ్‌లో అదరగొట్టిన ఫరూక్‌ ఇంజినీర్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. టీమ్‌ఇండియాకు వన్డే క్రికెట్‌లో ఇదే తొలి విజయం కాగా, వన్డే చరిత్రలోనే తొలి పది వికెట్ల విజయంను కూడా భారత జట్టు తన పేరిట నమోదు చేసింది.


శ్రీలంకను కూల్చేసి..

1984 ఆసియా కప్‌లో షార్జా వేదికగా టీమ్‌ఇండియా శ్రీలంకతో తలపడింది. టాస్‌ గెలిచిన భారత కెప్టెన్‌ గావస్కర్‌ ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అయితే, బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకను భారత బౌలర్లు చుట్టేశారు. దీంతో శ్రీలంక 41 ఓవర్లలో 96పరుగులకే కుప్పకూలింది. చేతన్‌ శర్మ3, మదన్‌లాల్ 3, మనోజ్‌ ప్రభాకర్‌ 2 వికెట్లు తీసి కట్టడి చేశారు. స్వల్ప లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు సురీందర్‌ ఖన్నా 69 బంతుల్లో 6 ఫోర్ల సహాయంతో 51 , గులాం పార్కర్‌ 68 బంతుల్లో32 పరుగులు చేయడంతో భారత్‌ మరో 170 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. సురీందర్‌ ఖన్నాకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. దీంతో భారత రెండోసారి పది వికెట్ల విజయాన్ని అందుకొంది.


వెస్టిండీస్‌ పర్యటనలో రికార్డు


 

టీమ్‌ఇండియా నాలుగు వన్డేల సిరీస్‌లో భాగంగా 1997 విండీస్‌ పర్యటించింది. అయితే సిరీస్‌లో తొలి వన్డే గెలిచి ఊపు మీద ఉన్న వెస్టిండీస్‌కు టీమ్‌ఇండియా షాక్‌ ఇచ్చింది. ఫోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత టాస్‌ గెలిచిన సచిన్‌ బౌలింగ్‌ తీసుకున్నాడు. దీంతో విండీస్‌ బ్యాటింగ్‌కు దిగింది. అయితే, భారత బౌలర్లు వెంకటేశ్‌ ప్రసాద్‌(2), అబేయ్‌ కురువిల్లా(3)వికెట్లతో విండీస్‌ టాపార్డర్‌ను పెవిలియన్‌కు పంపారు. దీంతో విండీస్‌ 32 పరుగులకే ఐదు కీలక వికెట్లు నష్టపోయింది. ఆ తరవాత అనిల్‌ కుంబ్లే(2), నోయిల్‌ డేవిడ్‌(3) వికెట్లు తీయడంతో విండీస్‌ 43.5 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. విండీస్‌ బ్యాటర్‌ జిమ్మి ఆడమ్స్‌ 35 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వర్షం కారణంగా టీమ్‌ఇండియా లక్ష్యాన్ని 48 ఓవర్లలో 116 పరుగులగా నిర్దేశించారు. ఓపెనర్లు సచిన్‌ (70 బంతుల్లో 65;7ఫోర్లు), గంగూలీ(77 బంతుల్లో 39;2 ఫోర్లు) రాణించడతో భారత్ టార్గెట్‌ను 23.1 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో టీమ్‌ఇండియా మూడోసారి పది వికెట్ల విజయాన్నిఖాతాలో వేసుకుంది.


ఫైనల్‌లో జింబాబ్వే చిత్తు

యూఏఈ వేదికగా 1998లో భారత్, శ్రీలంక, జింబాబ్వే జట్లు ముక్కోణపు సిరీస్‌లో పోటీపడ్డాయి. అయితే, లీగ్‌ దశలో భారత్, జింబాబ్వే జట్లు శ్రీలంకపై రెండేసి మ్యాచ్‌లు నెగ్గాయి. భారత్‌, జింబాబ్వే రెండుసార్లు తలపడగా చెరో మ్యాచ్‌ గెలిచాయి. దీంతో ఫైనల్‌ మ్యాచ్‌లో మరోసారి జింబాబ్వేతో పోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ నెగ్గిన టీమ్‌ఇండియా కెప్టెన్‌ అజారుద్దీన్‌ జింబాబ్వేకు బ్యాటింగ్‌ అప్పగించాడు. భారత బౌలర్ల విజృంభణతో 81 పరుగులకే జింబాబ్వే టాపార్డర్‌తో 6 వికెట్లు కోల్పోయింది. అయితే, ఆఖర్లో టెయిలెండర్లు పోరాటంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టానికి 196 పరుగులు చేసింది. జవగాళ్‌ శ్రీనాథ్‌ 3 వికెట్లతో రాణించగా, అగార్కర్‌, కుంబ్లే, సచిన్‌, నిఖిల్ చోప్రా, సునీల్ జోషి తలో వికెట్‌ పడగొట్టారు. దీంతో టీమ్‌ఇండియా ముందు 197 పరుగుల లక్ష్యం. అయితే, భారత ఓపెనర్లు సచిన్‌ (92బంతుల్లో 124;12ఫోర్లు, 6సిక్సర్లు) సూపర్‌ సెంచరీ, గంగూలీ (90బంతుల్లో63; 4 ఫోర్లు, 3సిక్సర్లు)అర్ధశతకంతో 30 ఓవర్లలోనే లక్ష్యాన్ని సాధించింది. దీంతో భారత్‌ సిరీస్‌ దక్కించుకొంది. సచిన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, సిరీస్‌ అవార్డులు లభించాయి. ఈ విజయంతో నాలుగోసారి టీమ్‌ఇండియా పది వికెట్ల విక్టరీ నమోదు చేసింది. 


కెన్యాపై 11.3 ఓవర్లలోనే.. విజయం

దక్షిణాఫ్రికా, కెన్యా, టీమ్‌ఇండియా 2001..ముక్కోణపు సిరీస్‌లో తలపడ్డాయి. ఇండియా, కెన్యాల మధ్య సిరీస్‌లో నాలుగో మ్యాచ్‌ అది. వేదిక మాంగ్‌హంగ్‌ ఓవల్‌(దక్షిణాఫ్రికా). తొలుత బ్యాటింగ్‌కు దిగిన కెన్యా..అజిత్ అగార్కర్ పేస్‌తో(4 వికెట్లు), కుంబ్లే స్పిన్‌(3 వికెట్లు) ధాటికి 50 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. జవగళ్‌ శ్రీనాథ్‌ (2), హర్భజన్‌ (1) మిగిలిన బ్యాటర్లును పెవిలియన్‌ పంపారు. దీంతో కెన్యా 37.1 ఓవర్లలో 90 పరుగులకే చాప చుట్టేసింది. ఛేదనలో వీరేంద్ర సెహ్వాగ్‌(43 బంతుల్లో55;11 ఫోర్లు) తనదైన శైలిలో విరుచుకుపడటంతో భారత్‌ లక్ష్యాన్ని మరో 231 బంతులు మిగిలి ఉండగానే అందుకొంది. మరో ఓపెనర్‌ దీప్‌ దాస్‌గుప్తా 24పరుగులతో రాణించాడు. దీంతో టీమ్‌ఇండియా వన్డేల్లో ఐదోసారి పది వికెట్ల విజయాన్ని సాధించింది.


జింబాబ్వేపై మళ్లీ..

2016లో ఎంఎస్‌ ధోనీ నాయకత్వంలో టీమ్‌ఇండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి భారత్ జోరు మీదుంది. హరారేలోని  జరిగిన మూడో మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వేకు టీమ్‌ఇండియా బౌలర్లు అవకాశమే ఇవ్వలేదు. ముఖ్యంగా బుమ్రా పదునైన పేస్‌తో (4) వికెట్లు తీసి కట్టడి చేశాడు. చాహల్‌(2), అక్షర్‌(1), కులకర్ణి(1) వికెట్లు తీయడంతో జింబాబ్వే 42.2 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఆ జట్టు తరపున వుసి సిబాండ 38 టాప్‌స్కోరర్‌. ఛేదనలో ఓపెనర్లు కేఎల్ రాహుల్ (70 బంతుల్లో 63; 4 ఫోర్లు, 2సిక్సర్లు), ఫయీజ్‌ ఫజల్(61 బంతుల్లో 55;7ఫోర్లు, 1సిక్సర్‌) పరుగులు చేయడంతో భారత్‌ 21.5 ఓవర్లలోనే ఛేజింగ్‌ పూర్తిచేసింది. దీంతో టీమ్ఇండియా సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. బుమ్రాకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు, రాహుల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డులు దక్కాయి.


రోహిత్‌ నాయకత్వంలో నెం 7

ఇంగ్లాండ్‌ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్‌ నెగ్గి.. వన్డే సిరీస్‌కు టీమ్‌ఇండియా సిద్ధమైంది. తొలి వన్డేకు వేదిక ఓవల్. టాస్‌ గెలిచిన రోహిత్‌  ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అయితే, జట్టు నిండా హిట్టర్లతో ఫామ్‌లో ఉన్న ఇంగ్లాండ్‌ 300 పైగా పరుగులు చేస్తుందని అనుకున్నారంతా. కానీ, భారత బౌలింగ్‌ ఓపెనింగ్‌ ద్వయం బుమ్రా, షమి నిప్పులు చెరగడంతో  26 పరుగులకే ఇంగ్లాండ్‌ సగం వికెట్లు కోల్పోయింది. కెప్టెన్‌ బట్లర్‌, అలీ కాసేపు క్రీజ్‌లో నిలబడి స్కోరు బోర్డును 50 పరుగులు దాటించారు. అయితే ఆ తరవాత ప్రసిద్ధ్‌ కృష్ణ వీరి భాగస్వామ్యానికి బ్రేక్‌ వేశాడు. ఆ తరవాత షమి, బుమ్రా విజృంభణతో ఇంగ్లీష్‌ జట్టు 25.2 ఓవర్లలో 110 పరుగులకే కుప్సకూలింది. బుమ్రా(6), షమి(3) వికెట్లతో ఇంగ్లాండ్‌ను దెబ్బ తీశారు. ఛేదనలో రోహిత్ శర్మ( 58 బంతుల్లో 76; 6 ఫోర్లు, 5 సిక్సర్లు)తో చెలరేగాడు. మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (51 బంతుల్లో 31;4ఫోర్లు) రాణించడంతో టీమ్‌ఇండియా 18.4 ఓవర్లలోనే విజయం సాధించింది. బుమ్రాకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కింది. దీంతో టీమ్‌ఇండియా వన్డేల్లో ఏడోసారి పది వికెట్ల తేడాతో గెలుపొందింది.


- ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని