Mithali Raj: థాంక్యూ క్వీన్‌ ఆఫ్‌ క్రికెట్‌... మిథాలీ

థాంక్యూ మిథాలీ.. నువ్వు భారత క్రికెట్‌లో ఆడినందుకు కాదు.. భారత మహిళల క్రికెట్‌కే వన్నె తెచ్చినందుకు.. థాంక్యూ మిథాలీ.. నువ్వు గొప్పగా ఆడినందుకు కాదు..

Updated : 09 Jun 2022 12:48 IST

థాంక్యూ మిథాలీ.. నువ్వు భారత క్రికెట్‌ను నడిపించినందుకు.. థాంక్యూ మిథాలీ.. మహిళల క్రికెట్‌కే వన్నె తెచ్చినందుకు.. థాంక్యూ మిథాలీ.. నువ్వు యువతరానికి స్ఫూర్తిగా నిలిచినందుకు.. థాంక్యూ మిథాలీ.. క్రికెట్‌ కేవలం పురుషుల ఆటే కాదు.. మహిళలూ సత్తాచాటగలరని నిరూపించినందుకు..!

స్ఫూర్తి శిఖరం..

కెరీర్‌లో ఎవరైనా ముందుకు సాగాలంటే ఆ ప్రయాణంలో ఉన్న అవకాశాలను విశ్లేషించుకొంటారు. అంతేకానీ, గమ్యమే లేని దారిలో.. ఎదురుదెబ్బలే తప్ప అవకాశాలే కనిపించని మార్గంలో ఎవరైనా ముందుకు వెళ్తారా? కానీ, ఆమె వెళ్లింది. అంతర్జాతీయ స్థాయిలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొని భారత క్రికెట్‌ను ఏలింది. కష్టాలు, అవమానాలు ఎదురైనా ధైర్యం కూడగట్టుకొని లక్ష్యం దిశగా ప్రయాణించింది. దీంతో ఆమె మహిళలకు ఐకాన్‌గా నిలిచింది. అసలు మన దేశంలో మహిళల క్రికెట్‌ అనేది ఒకటి ఉందని తెలియని రోజుల నుంచి.. లక్షలాది మంది అమ్మాయిలు క్రికెట్‌నే కెరీర్‌గా ఎంచుకునే స్థాయికి ఆటను తీసుకెళ్లింది. అందుకే థాంక్యూ.

సచిన్ కన్నా ఎక్కువే..

క్రికెట్‌లో అత్యధికకాలం కెరీర్‌ సాగించింది ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు సచిన్‌ తెందూల్కర్‌. ఆ దిగ్గజం 24 ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు అత్యున్నత సేవలు అందించాడు. అలాంటి మేటి ఆటగాడి కన్నా మిథాలీనే వన్డే క్రికెట్‌లో అత్యధిక కాలం కొనసాగింది. సహజంగా పురుషులతో పోలిస్తే మహిళల ఫిట్‌నెస్‌ కాస్త తక్కువ. అయినా, ఆమె సుదీర్ఘకాలం వన్డేల్లో ఆడింది. తెందూల్కర్‌ 22 సంవత్సరాల 91 రోజులు ఈ ఫార్మాట్‌లో ఆడితే.. సనత్‌ జయసూర్య 21 సంవత్సరాల 184 రోజులు, జావెద్‌ మియాందాద్‌ 20 సంవత్సరాల 272 రోజులు ఆడారు. ఈ ముగ్గురి కన్నా ఎక్కువగా మిథాలీ 22 ఏళ్ల, 274 రోజులు ఆడింది. మహిళల మ్యాచ్‌లు తక్కువే అయినా.. బరిలోకి దిగాలంటే ఫిట్‌నెస్‌తో ఉండాల్సిందే. అలా రెండు దశాబ్దాలకుపైగా ఫిట్‌నెస్‌ కాపాడుకొని.. పురుష దిగ్గజాలతో సమానంగా క్రికెట్‌ ఆడటం మామూలు విషయం కాదు. అలా ఆడి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించింది. అందుకే ఆమెకు థాంక్యూ.

ఛేజింగ్‌ క్వీన్‌..

భారత క్రికెట్‌ లేదా ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఛేజింగ్‌ క్రికెటర్లు ఎవరంటే.. వెంటనే గుర్తొచ్చే పేర్లు టీమ్‌ఇండియా మాజీ సారథులు మహేంద్రసింగ్‌ ధోనీ, విరాట్‌ కోహ్లీ. అలాంటి దిగ్గజాలకు కూడా సాధ్యంకాని ఓ ఘనతను మిథాలీ సొంతం చేసుకొంది. వన్డే లక్ష్య ఛేదనల్లో 1000కి పైగా పరుగులు సాధించిన వారిలో అత్యుత్తమ సగటు కలిగిన క్రికెటర్‌గా ఆమె రికార్డు నెలకొల్పింది. మిథాలీ సగటు 109.05గా నమోదవ్వగా.. ధోనీ 102.71, న్యూజిలాండ్‌ క్రికెటర్‌ అమీ సాటర్త్‌వైట్‌ 98.21, విరాట్‌ కోహ్లీ 94.56, షై హోప్‌ 89.38 సగటును సాధించారు. అందులో మిథాలీ 35 సందర్భాల్లో నాటౌట్‌గా నిలిచింది. ఫలితంగా ఛేజింగ్‌ క్వీన్‌ అని పేరుతెచ్చుకొంది. అందుకే మిథాలీకి థాంక్యూ.

అత్యుత్తమ సారథి..

భారత క్రికెట్‌లో ఎంతమంది గొప్ప సారథులున్నా.. మేటి సారథిగా మహేంద్రసింగ్‌ ధోనీ అగ్ర స్థానంలో ఎప్పటికీ నిలిచిపోతాడు. అలాగే మహిళల క్రికెట్‌లో మిథాలీ నాయకత్వానికి తిరుగులేదు. ఆమె ఖాతాలో ప్రపంచకప్‌లు లేవనే లోటే కానీ, మరే భారత సారథికీ సాధ్యంకాని ఓ ఘనత ఆమె పేరిట ఉంది. అదే వన్డే ప్రపంచకప్‌ టోర్నీల్లో రెండుసార్లు టీమ్‌ఇండియాను ఫైనల్స్‌కు తీసుకెళ్లడం. సౌరభ్‌ గంగూలీ జట్టు 2003లో రన్నరప్‌గా నిలిస్తే.. ధోనీసేన 2011లో విజేతగా నిలిచింది. అయితే, మిథాలీ 2005, 2017 టోర్నీల్లో రెండుసార్లు ఫైనల్‌కు తీసుకెళ్లడం విశేషం. దీంతో ఈ ఘనత సాధించిన ఏకైక భారత కెప్టెన్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే మిథాలీ మొత్తం 195 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 109 విజయాలు సాధించింది. దీంతో మహిళల క్రికెట్‌లో అత్యధిక విజయాలు సాధించిన మూడో సారథిగా నిలిచింది. చార్లెట్‌ ఎడ్వర్డ్స్‌ 220 మ్యాచ్‌ల్లో 142 విజయాలు, మెగ్‌ లానింగ్‌ 162 మ్యాచ్‌ల్లో 128 విజయాలు సాధించి మిథాలీ కన్నా ముందున్నారు. ఇలా మేటి మహిళా సారథిగా నిలిచినందుకూ థాంక్యూ.

సుదీర్ఘ కెరీర్‌లోనూ..

మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక కాలం ఆడిన క్రికెటర్‌గా మిథాలీరాజ్‌ మూడో స్థానంలో నిలిచింది. కారోలిన్‌ డి ఫౌ అనే నెదర్లాండ్స్‌ క్రికెటర్‌ అత్యధికంగా 26 ఏళ్ల 361 రోజుల పాటు కెరీర్‌ సాగించింది. కానీ, ఆమె 2008 నుంచి 2018 వరకు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడకపోవడం గమనార్హం. 1991 జులైలో అరంగేట్రం చేసిన కారోలిన్‌ 2018 జులైలో చివరి మ్యాచ్‌ ఆడింది. మరోవైపు శ్రీలంక మాజీ క్రికెటర్‌, ప్రస్తుత యూఏఈ ప్లేయర్‌ చమని సెనెవిరత్న 1997 నవంబర్‌లో అరంగేట్రం చేసి ఇప్పటికీ కొనసాగుతోంది. ఆమె 24 సంవత్సరాల నుంచి ఆడుతూనే ఉంది. ఈ క్రమంలోనే మిథాలీ 1999 జూన్‌ నుంచి 2022 మార్చి వరకు మొత్తం 22 సంవత్సరాల 274 రోజులు క్రికెటర్‌గా ఆడింది. ఆ ప్రయాణంలో భారత మహిళల క్రికెట్‌కే ఆదరణ తీసుకొచ్చింది. అందుకే మిథాలీ థాంక్యూ.

- ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని