IND vs PAK: ఆ మజాను మళ్లీ చూడలేమా?.. కిక్ ఇవ్వలేకపోతున్న భారత్ - పాక్ మ్యాచ్‌లు

భారత్ - పాకిస్థాన్ (IND vs PAK) జట్లు ఏ ఆటలో తలపడ్డా ఇరు దేశాల అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఇక క్రికెట్లో రెండు జట్లూ తలపడితే.. ఇరు దేశాల అభిమానులూ టీవీలకు అతుక్కుపోతారు. ఆ మాటకొస్తే దేశాలతో సంబంధం లేకుండా క్రికెట్ అభిమానులందరూ కూడా ఈ మ్యాచ్ పట్ల ఆసక్తి చూపిస్తారు. ఐతే ఈ ఆసక్తికి తగ్గట్లు చిరకాల ప్రత్యర్థుల పోరాటాలు జరగకపోవడం నిరాశ కలిగిస్తోంది.

Updated : 16 Oct 2023 14:38 IST

భారత్ - పాకిస్థాన్ (IND vs PAK) జట్లు ఏ ఆటలో తలపడ్డా ఇరు దేశాల అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఇక క్రికెట్లో రెండు జట్లూ తలపడితే.. ఇరు దేశాల అభిమానులూ టీవీలకు అతుక్కుపోతారు. ఆ మాటకొస్తే దేశాలతో సంబంధం లేకుండా క్రికెట్ అభిమానులందరూ కూడా ఈ మ్యాచ్ పట్ల ఆసక్తి చూపిస్తారు. ఐతే ఈ ఆసక్తికి తగ్గట్లు చిరకాల ప్రత్యర్థుల పోరాటాలు జరగకపోవడం నిరాశ కలిగిస్తోంది. ఈ మధ్య ఈ రెండు జట్ల మ్యాచ్‌లు చాలా వరకు ఏకపక్షం అవుతున్నాయి. ఎక్కువగా భారతే విజయం సాధిస్తుండగా.. ఆ మ్యాచ్‌లన్నీ ఏకపక్షమే. అప్పుడప్పుడూ పాక్ గెలిచినా అదే పరిస్థితి. రెండు జట్లూ విజయం కోసం నువ్వా నేనా అన్నట్లు తలపడటం, ఫలితంపై చివరి వరకు ఉత్కంఠ నెలకొనడం లాంటి దృశ్యాలు అరుదైపోతున్నాయి.

భారత్ ఆతిథ్యమిస్తున్న వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023)లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ మీద ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో తెలిసిందే. వేరే టోర్నీల్లో రెండు జట్లు తలపడటం వేరు, ప్రపంచకప్‌లో ఢీకొనడం వేరు. అందుకే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులంతా ఒక హోరాహోరీ సమరాన్ని ఆశించి ఈ మ్యాచ్ చూడటం మొదలుపెట్టారు. పాకిస్థాన్ ఇన్నింగ్స్‌ ఒక దశ వరకు పోటాపోటీగానే సాగింది. 29 ఓవర్లకు 150/2తో నిలిచిన పాక్.. భారత్‌కు గట్టి సవాలు విసిరేలా కనిపించింది.

ఆ దశ నుంచి ఉన్నట్లుండి కుప్పకూలి చివరికి 191 పరుగులకే పరిమితం అయింది. తర్వాత లక్ష్యాన్ని భారత్ కేవలం 30.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. మ్యాచ్ మధ్యలోనే ఏకపక్షం అయిపోయి.. ప్రేక్షకులు ఆసక్తి కోల్పోయారు. మన వాళ్లు ఆటలో పైచేయి సాధించడం, అంతిమంగా మన జట్టే గెలవడం ఆనందాన్నిచ్చే విషయాలే కానీ.. మ్యాచ్‌లో అసలు పోటీయే లేకపోవడం, ఉత్కంఠభరితంగా సాగకపోవడం సగటు క్రికెట్ అభిమానులను నిరాశపరిచింది. ఈ మ్యాచ్ అనే కాదు.. గత కొన్నేళ్లలో భారత్-పాక్ మ్యాచ్‌లు చాలా వరకు ఇలాగే ఏకపక్షం అవుతున్నాయి.

చరిత్ర వేరు..

వన్డే ప్రపంచకప్‌లో పాక్ చేతిలో భారత్‌కు ఓటమి అన్నదే లేదు. మొత్తంగా ఇప్పటిదాకా ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ టీమ్‌ఇండియానే విజయం సాధించింది. అయితే ఒకప్పుడు ఒకప్పుడు పాక్‌పై విజయాలు అంత తేలిగ్గా ఏమీ రాలేదు. 90వ దశకంలో దాయాది జట్టు ఎంత బలంగా ఉండేదో తెలిసిందే. 1992లో ఆ జట్టు తొలి ప్రపంచకప్‌ గెలిచిన సమయంలోనే ఆ టోర్నీలో భారత్‌ చేతిలో తొలి పరాజయం చవిచూసింది. ఆ మ్యాచ్‌లో భారత్‌ నిర్దేశించిన 217 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక పాక్‌ ఓడిపోయింది.

1996లో భారత్‌ 288 పరుగుల లక్ష్యాన్ని నిలపగా.. పాక్‌ ధాటిగా ఛేదనను ఆరంభించి ఆ తర్వాత గాడి తప్పింది. 1999లో భారత్‌ చేసింది 6 వికెట్లకు 227 పరుగులే. అయినా పాక్‌ను 180కే కట్టడి చేసింది. ఈ మ్యాచ్‌లన్నీ చాలా వరకు పోటాపోటీగానే సాగాయి. ఇక 2003లో చిరకాల ప్రత్యర్థుల పోరు ఎంత రసవత్తరంగా సాగిందో తెలిసిందే. అప్పట్లో 274 పరుగులంటే పెద్ద లక్ష్యం. అయితే సచిన్‌ అసాధారణ ఇన్నింగ్స్‌తో ఛేదనలో భారత్‌ దీటుగా బదులిచ్చింది. అద్భుత విజయాన్నందుకుంది. 2011 ప్రపంచకప్‌ సెమీస్‌లో సైతం పాక్‌ గట్టి పోటీనే ఇచ్చింది. 

కానీ 2015 నుంచి మ్యాచ్‌లు ఏకపక్షం అవుతున్నాయి. ఆ టోర్నీలో భారత్‌ 301 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే పాక్‌ 224 పరుగులకే కుప్పకూలింది.2019లో భారత్‌ 5 వికెట్లకు 336 పరుగుల భారీ స్కోరు చేస్తే.. వర్షం వల్ల లక్ష్యాన్ని 40 ఓవర్లకు 302గా కుదించగా, పాక్‌ 212/6కు పరిమితం అయింది. ఇక ప్రస్తుత టోర్నీ సంగతి తెలిసిందే. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీలో, 2021 టీ20 ప్రపంచకప్‌లో పాక్‌ గెలిచిన సమయాల్లో కూడా మ్యాచ్‌లు ఏకపక్షమే అయ్యాయి. ఈ రెండు సందర్భాల్లో భారత్‌ పోటీ ఇవ్వలేకపోయింది. వరుసగా 180 పరుగులు, 10 వికెట్ల తేడాతో ఓడింది.

గత దశాబ్ద కాలంలో ఇరు జట్ల మధ్య అత్యంత హోరాహోరీగా సాగిన మ్యాచ్‌ అంటే.. గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో పోరే. ఆ మ్యాచ్‌ చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. 160 పరుగుల ఛేదనలో భారత్‌ తీవ్ర ఇబ్బందుల్లో పడగా.. కోహ్లి 82 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌ అభిమానులకు మామూలు మజానివ్వలేదు. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ అంటే ఇలా సాగాలని.. అప్పుడే మజా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వన్డే ప్రపంచకప్‌లో కూడా ఇలాంటి ఉత్కంఠభరిత పోరాటాన్ని ఆశిస్తే మ్యాచ్‌ ఏకపక్షమైంది. తర్వాత ఈ రెండు జట్లూ తలపడ్డపుడైనా మ్యాచ్‌ అంచనాలకు తగ్గట్లు సాగుతుందేమో చూడాలి.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని