పసికూన... అది పాత కథ... క్రికెట్‌లో తగ్గిపోతున్న పెద్ద, చిన్న జట్ల అంతరం

ప్రపంచకప్‌ అనగానే ఒకట్రెండు చిన్నజట్లు వస్తాయి... ఆ మ్యాచ్‌ల్లో పెద్ద టీమ్‌లు సునాయాసంగా విజయం సాధిస్తాయి అనుకునేవారు. కానీ 2023 ప్రపంచకప్‌లో అలా జరగడం లేదు. 

Published : 31 Oct 2023 13:57 IST

ఒకప్పుడు ప్రపంచకప్ లాంటి టోర్నీలు జరుగుతుంటే.. కొన్ని జట్లను పసికూనలు అనేవాళ్లు. ఆ జట్లతో మ్యాచ్‌లు అంటే ఏకపక్షమే అన్న అభిప్రాయం ఉండేది. ఆ అంచనాకు తగ్గట్లే మ్యాచ్‌లు జరిగేవి. ఈ జట్లలో ఏదైనా ఓ పెద్ద జట్టును ఓడిస్తే టోర్నీలో ప్రకంపనలు రేగేవి. అదో పెద్ద సంచలనం అన్నట్లుగా మాట్లాడుకునేవాళ్లు. చాలా ఏళ్ల పాటు ఆ మ్యాచ్‌లు గుర్తుండిపోయేవి. కానీ ఇప్పుడు కథ మారింది. ఏ జట్టునూ పసికూన అని అనలేని పరిస్థితి. అలా అనుకున్న జట్లు పెద్ద జట్లను ఓడించడం సాధారణ విషయంగా మారిపోయింది. చిన్న, పెద్ద జట్ల మధ్య అంతరం తగ్గిపోయి.. ఏ జట్టునూ తక్కువగా అంచనా వేయలేని, తేలిగ్గా తీసుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. ఈ ప్రపంచకప్‌లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విషయం ఇదే.

2023 వన్డే ప్రపంచకప్‌కు అఫ్గానిస్థాన్ నేరుగా అర్హత సాధిస్తే.. శ్రీలంక, వెస్టిండీస్ లాంటి జట్లు క్వాలిఫయర్స్ ఆడాల్సి వచ్చింది. దీన్ని బట్టే ప్రపంచ క్రికెట్లో వచ్చిన మార్పును అర్థం చేసుకోవచ్చు. క్వాలిఫయర్స్‌లో శ్రీలంక, వెస్టిండీస్ సునాయాసంగా గెలిచేసి ప్రపంచకప్‌కు వచ్చేస్తాయని అనుకున్నారు. ఐతే లంక బాగానే ఆడినా.. దానికి గట్టి పోటీ తప్పలేదు. ఇక వెస్టిండీస్ పరిస్థితి ఏమైందో తెలిసిందే. నెదర్లాండ్స్, స్కాట్లాండ్ జట్ల చేతిలో షాక్‌లు తిని ప్రపంచకప్‌నకే దూరం అయింది. ప్రపంచకప్ క్వాలిఫయర్స్ మునుపెన్నడూ లేనంత హోరాహోరీగా సాగాయి. స్కాట్లాండ్, జింబాబ్వే కూడా తీవ్రంగా ప్రయత్నించినా.. చివరికి శ్రీలంకతో పాటుగా నెదర్లాండ్స్ ప్రపంచకప్‌ అర్హత సాధించింది. ఐతే ప్రపంచకప్‌లో చిన్న జట్లు.. పెద్ద జట్ల నుంచి పోటీని ఏమాత్రం తట్టుకుంటాయో అనుకున్నారు. కానీ వాటి ప్రదర్శన అనూహ్యంగా సాగుతోంది.

ఒకటి రెండు కాదు..

ప్రతి ప్రపంచకప్‌లో ఒకటో రెండో సంచలనాలు నమోదు కావడం మామూలే. కానీ ఈసారి ప్రపంచకప్‌లో జరిగింది మాత్రం వేరు. అఫ్గానిస్థాన్, నెదర్లాండ్స్ జట్ల ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా ఈ టోర్నీలో అఫ్గానిస్థాన్ ప్రదర్శన గురించి చాలా ఏళ్లు మాట్లాడుకుంటారనడంలో సందేహం లేదు. దాన్ని ఇకపై పసికూన, చిన్న జట్టు అనడం పెద్దే తప్పే అవుతుందేమో. మొదట ఇంగ్లాండ్.. ఆ తర్వాత పాకిస్థాన్, శ్రీలంకలను మట్టికరిపించింది అఫ్గాన్. ఇందులో ఏ మ్యాచ్‌లోనూ ప్రత్యర్థి జట్లు అనూహ్యంగా ఏమీ కుప్పకూలిపోలేదు. అఫ్గాన్‌కు సవాలు విసిరాయి. కానీ అఫ్గాన్ దీటుగా స్పందించింది. ఆరంభం నుంచి చివరి వరకు ఒక ప్రణాళిక ప్రకారం ఆడింది. ఒక పెద్ద జట్టు స్థాయిలో సాధికారిక ప్రదర్శనతో మ్యాచ్‌లను గెలిచిన తీరు అనూహ్యం. 

దిల్లీలో బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఇంగ్లాండ్‌కు 284 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించి.. 215 పరుగులకే ప్రత్యర్థిని కట్టడి చేయడం.. చెన్నైలో బౌలింగ్ పిచ్‌పై పాక్ నిర్దేశించిన 283 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లే కోల్పోయి ఛేదించడం.. లఖ్‌నవూలో బ్యాటింగ్‌కు మరింత కష్టంగా మారిన పిచ్ మీద లంక 241 పరుగులు చేస్తే 28 బంతులుండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదన పూర్తి చేయడం అఫ్గాన్ ప్రమాణాలు ఎంత పెరిగాయో సూచిస్తుంది. ఈ ప్రపంచకప్‌తో అఫ్గాన్ ‘చిన్న జట్టు’ అనే ముద్రను పూర్తిగా తొలగించుకుంది అనడంలో సందేహం లేదు. ఇక నెదర్లాండ్స్ సైతం ఈ టోర్నీతో ఎన్నో మెట్లు ఎక్కింది. దక్షిణాఫ్రికాపై ఆ జట్టు విజయాన్ని ఎంతమాత్రం గాలివాటం అనలేం. బలమైన బౌలింగ్‌‌ను ఎదుర్కొంటూ 246 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించడమే కాక.. ఒక ప్రణాళిక ప్రకారం బౌలింగ్ చేసి 38 పరుగుల తేడాతో సాధికారికంగా గెలిచింది. ఇక బంగ్లాదేశ్ అయితే నెదర్లాండ్స్‌కు పోటీనే ఇవ్వలేకపోయింది. 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి 142కే కుప్పకూలింది.

ఐసీసీ దృష్టిసారిస్తే..

చిన్న జట్లు ప్రపంచ క్రికెట్లో ఒక స్థాయి అందుకోవడానికి.. వేగంగా ఎదుగుతుండటానికి టీ20 క్రికెట్ ప్రధాన కారణం అనడంలో సందేహం లేదు. ఈ ఫార్మాట్ జట్ల మధ్య అంతరాలను తగ్గించేసింది. 20 ఓవర్ల ఆటలో దూకుడుగా, తెగించి ఆడటం అలవాటు చేసుకుంటున్న జట్లు.. వన్డేల్లో కూడా సత్తా చాటగలుగుతున్నాయి. ఇక అసోసియేట్ దేశాల్లో భాగమైన క్రికెటర్లు చాలామంది ప్రపంచవ్యాప్తంగా అనేక టీ20 లీగ్స్‌లో ఆడుతున్నారు. పేరున్న ఆటగాళ్లతో కలిసి ఆడుతూ మంచి అనుభవం సంపాదిస్తున్నారు. దీంతో పెద్ద జట్లతో ఆడుతున్నపుడు బెరుకు ఉండట్లేదు. ఒత్తిడికి గురి కావట్లేదు. సై అంటే సై అన్నట్లు తలపడుతున్నారు. కాబట్టి మున్ముందు చిన్న, పెద్ద జట్ల మధ్య అంతరం మరింత తగ్గిపోవడం ఖాయం. 

టీ20, వన్డే ప్రపంచకప్‌ల్లో ఈ జట్లను ప్రత్యర్థులు తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. దీని వల్ల చిన్న జట్లతో మ్యాచ్ అంటే ఏకపక్షం, బోరింగ్ అనుకునే పరిస్థితి కూడా ఉండదు. ఐరోపా, గల్ఫ్ దేశాల్లో క్రికెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రతిభావంతులైన క్రికెటర్లు చాలామంది వెలుగులోకి వస్తున్నారు. అసోసియేట్ దేశాల మధ్య జరిగే సిరీస్‌లు, టోర్నీలతో పాటు.. లీగ్స్ రసవత్తరంగా జరుగుతున్నాయి. ఐసీసీ కూడా ఆయా దేశాలకు మరింత ఆర్థిక తోడ్పాటు అందించడంతో పాటు అంతర్జాతీయ సిరీస్‌ల సంఖ్య పెంచడం.. మధ్య స్థాయి జట్లతో తరచుగా సిరీస్‌లు ఆడిస్తే మున్ముందు మరిన్ని నాణ్యమైన జట్లు తయారవుతాయి. ప్రపంచ క్రికెట్లో పోటీ పెరిగి ఆటకు మరింత మేలు జరుగుతుంది.

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని