IND vs AUS: మూడో టెస్టులో భారత్‌ ఓటమి.. టాస్‌ నుంచి అన్నీ ప్రతికూలతలే..!

వరుసగా రెండు టెస్టుల్లో గెలిచి ఊపు మీదున్న టీమ్‌ఇండియాకు (Team India) ఆసీస్‌ గట్టి షాక్‌ ఇచ్చింది. మూడు రోజుల్లోపే ముగిసిన ఇందౌర్‌ టెస్టులో భారత్‌పై ఆసీస్‌ (IND vs AUS) విజయం సాధించింది.

Published : 03 Mar 2023 17:40 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మూడు రోజుల్లోనే సంబరం ముగిసింది. స్పిన్‌ మంత్రమంటూ ప్రత్యర్థిని (IND vs AUS) ఉక్కిరిబిక్కిరి చేసేద్దామని ప్రణాళికలను రచించిన టీమ్‌ఇండియాకు (Team India) అదే పెను శాపమైంది. తీరా పర్యాటక టీమ్‌ బౌలర్లు (Bowling) ఆధిపత్యం ప్రదర్శించి గెలుపును ఎగరేసుకుపోయారు. బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar Trophy) తొలి రెండు టెస్టుల్లో అద్భుత విజయాలను (IND vs AUS) నమోదు చేసిన టీమ్‌ఇండియా (Team India).. మూడో మ్యాచ్‌లో మాత్రం ఆసీస్‌ (Australia) చేతిలో  ఓడి చతికిలపడింది. ఇలా ఓటమి చెందడానికి పలు కారణాలు ఉన్నాయనేది కాదనలేని సత్యం. 

టాస్‌ గెలిచి మరీ.. (Toss)

భారత్‌లో టెస్టులు అనగానే స్పిన్‌ పిచ్‌లు అని మనందరికీ తెలుసు. ప్రత్యర్థులు కూడా అలాగే ప్రిపేర్‌ అవుతారు. భారత్‌ పర్యటనకు వచ్చిన ఆసీస్‌ కూడా తొలి రెండు టెస్టుల్లో ఇలానే ఇబ్బంది పడింది. ఇందౌర్ పిచ్‌ కూడా స్పిన్‌కు అనుకూలం. మరి అలాంటి మైదానంలో తలపడేటప్పుడు ప్రతి విషయంపైనా దృష్టిపెట్టాలి. కానీ, టీమ్‌ఇండియా మాత్రం భారీ తప్పిదంతోనే మ్యాచ్‌ను ప్రారంభించింది. ఇలాంటి మ్యాచ్‌లో టాస్‌ చాలా కీలకం. అలాంటిది భారత సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) టాస్‌ నెగ్గి మరీ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకోవడం క్రికెట్‌ విశ్లేషకులను విస్మయానికి గురి చేసింది. వచ్చిన అవకాశాలను ఆసీస్‌ బౌలర్లు చక్కగా వినియోగించుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను 109 పరుగులకే ఆలౌట్‌ చేశారు. ఇక్కడే ఆసీస్‌ విజయానికి.. భారత్‌ ఓటమికి నాంది పడింది. 

అదేం ఆట‌.. ఒక్కరైనా.. (Attacking Game)

ఆసీస్‌ స్పిన్నర్లు ఎటాకింగ్‌ బౌలింగ్‌ చేస్తూ భారత (Team India) బ్యాటింగ్‌ లైనప్‌ను చిందరవందర చేశారు. టీమ్‌ఇండియా ఆటగాళ్లు వారి బౌలింగ్‌ దాడికి దాసోహమన్నారు. కనీసం, భారీ షాట్లు కొడదామనే ఆలోచన కూడా వచ్చినట్లు లేదు. స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఓ వైపు పుజారా (Pujara) గోడలా క్రీజ్‌లో పాతుకుపోతే.. మరోవైపు కనీసం దూకుడుగా ఆడదామనే ఆలోచన కూడా రాలేదు. శ్రేయస్‌ అయ్యర్‌ (Shreya iyer) ఏదో కాసేపు అలరించినా.. ప్రయోజనం మాత్రం లేదు. ఇదే సమయంలో రిషభ్‌ పంత్‌ (Rishabh Pant) గుర్తుకు రావడం సహజం. జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు దూకుడుగా ఆడి ప్రత్యర్థిని డిఫెన్స్‌లో పడేస్తాడనే నమ్మకం అతడిపై ఉండేది. టీ20ల్లో విధ్వంసం సృష్టించిన సూర్యకుమార్‌ యాదవ్ కూడా వేగంగానే ఆడతాడు. కానీ, వన్డేలు, టెస్టుల్లో విఫలం కావడం అతడికి జట్టులో స్థానం దక్కకపోవడానికి ప్రధాన కారణం. యువ బ్యాటర్‌ శ్రీకర్‌ భరత్‌ ఆ బాధ్యతను తీసుకుంటే బాగుండేది. 

‘స్పిన్‌’ మంత్రం ఏమైంది..? (Spin Bowling)

స్వదేశంలో భారత బ్యాటింగ్‌ లైనప్‌ను అడ్డుకోవాలంటే ప్రత్యర్థి బౌలర్లకు అంత సులువేం కాదు. కానీ, మూడో టెస్టు మ్యాచ్‌లో మన బ్యాటింగ్‌ను చూస్తే.. ఎక్కడో విదేశాల్లో ఆడినట్లు అనిపించింది. ఆసీస్‌ యువ బౌలర్లు కున్‌మన్‌, మర్ఫీని ఎదుర్కోవడానికి సీనియర్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇబ్బంది పడటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆసీస్‌ బ్యాటర్లూ కాస్త ఇబ్బంది పడినా..  ఛేదనలో మాత్రం దూకుడు ప్రదర్శించి ఫలితం రాబట్టారు. అలాంటి ఎటాకింగ్‌ గేమ్‌ మన దగ్గర లేకుండా పోయింది. మరోవైపు బౌలింగ్‌లోనూ ఆసీస్‌తో పోలిస్తే భారత స్పిన్నర్లు తేలిపోయారు. ఏకంగా 18 వికెట్లను ఆసీస్ స్పిన్‌ బౌలర్లు పడగొట్టగా.. భారత టాప్‌ స్పిన్నర్లు మాత్రం 8 వికెట్లను మాత్రమే తీశారు. నాథన్‌ లైయన్‌ ఒకే ఇన్నింగ్స్‌లో (భారత్‌ రెండో ఇన్నింగ్స్‌) ఎనిమిది వికెట్లు పడగొట్టి అబ్బుర పరిచాడు. జడేజా, అశ్విన్‌ వికెట్లు తీసినప్పటికీ.. అక్షర్ పటేల్‌ మాత్రం ఈ మ్యాచ్‌లో ఒక్క వికెట్టూ పడగొట్టలేకపోవడం గమనార్హం. కీలక సమయాల్లో ఫీల్డింగ్‌ వైఫల్యం కూడా భారత్ ఓటమికి ఒక కారణం. ఆసీస్‌ అద్భుతమైన ఫీల్డింగ్‌తో క్యాచ్‌లను ఒడిసి పట్టింది.

అదనంగా ఓ బ్యాటర్‌ ఉంటే.. (Extra Batter)

అహ్మదాబాద్ టెస్టు మ్యాచ్‌ భారత్‌కు మూడు రకాలుగా కీలకం కానుంది. బోర్డర్‌ - గావస్కర్ (Border - Gavaskar Trophy) ట్రోఫీని గెలవడంతోపాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు (WTV Final) దూసుకెళ్లడం, ఐసీసీ (ICC) టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానానికి చేరుకొనేందుకు అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి టెస్టు మ్యాచ్‌లోనైనా భారత్ విజయం సాధించాలంటే.. తుది జట్టు ఎంపిక చాలా కీలకం. ఇప్పటి వరకు జరిగిన మూడు టెస్టుల్లో ఇద్దరు ఫాస్ట్‌ బౌలర్ల అవసరం పెద్దగా లేదు. కాబట్టి, ఇప్పుడున్న ఉమేశ్‌, సిరాజ్‌లో ఒకరికి మాత్రమే అవకాశం ఇచ్చి.. అదనంగా మరో బ్యాటర్‌ను ఆడించాలి. పరిస్థితులను పట్టించుకోకుండా కాస్త దూకుడుగా ఆడే సూర్యకుమార్‌ యాదవ్‌కు (Surya kumar Yadav) అవకాశం ఇస్తే బాగుంటుందనేది క్రికెట్‌ విశ్లేషకుల సూచన. ఓ నాలుగు భారీ షాట్లు ఆడితే ప్రత్యర్థి బౌలింగ్‌ గాడి తప్పేందుకు ఛాన్స్ ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని