IPL 2024 Auction: ఐపీఎల్‌ వేలంలో భారత ఆటగాళ్లు.. వీరికి అదృష్టం వరించేనా?

ఈసారి ఐపీఎల్‌ (IPL Auction) వేలంలోకి వచ్చిన భారత ఆటగాళ్ల జాబితాలో కాస్త పేరున్న ప్లేయర్లు చాలా తక్కువ మందే ఉన్నారు. ఎక్కువగా దేశవాళీ, అన్‌క్యాప్‌డ్ ఆటగాళ్లే ఉన్నారు.

Updated : 18 Dec 2023 16:24 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 2024 (IPL 2024) కోసం మినీ వేలానికి సమయం ఆసన్నమవుతోంది. ఇప్పటికే ఆటగాళ్ల లిస్ట్‌ సిద్ధమైంది. మొత్తం 333 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. భారత్‌కు చెందిన క్యాప్‌డ్‌, అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లు 214 మంది ఉన్నారు. కానీ, వీరిలోకెల్లా కొద్దిమందిపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందులో గతంలో కొందరు భారీ మొత్తం దక్కించుకోగా.. అమ్ముడుపోని వారూ ఉన్నారు. మరి వారెవరు? గతంలో ఎంతకు కొనుగోలు చేశారు? 

  1. శార్దూల్‌ ఠాకూర్‌: టీమ్‌ఇండియా పేస్‌ ఆల్‌రౌండర్‌గా భావించిన శార్దూల్ ఠాకూర్‌ మాత్రం తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వడంలో విఫలమయ్యాడు. రెండేళ్ల కిందట జరిగిన ఐపీఎల్‌ వేలంలో దిల్లీ రూ. 10.75 కోట్లకు సొంతం చేసుకుంది. అతడి ఆటతీరు పట్ల నిరాశ చెందిన దిల్లీ క్యాపిటల్స్‌ ఈసారి రిలీజ్‌ చేసింది. వన్డే ప్రపంచకప్‌ జట్టులోనూ ఉన్న శార్దూల్‌ కేవలం రెండు మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. రెండు వికెట్లను మాత్రమే తీసిన శార్దూల్‌ పరుగులు భారీగా సమర్పించాడు. ఫామ్‌పరంగా శార్దూల్‌ పరిస్థితి గొప్పగా ఏమీ లేదు. ఈసారి రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చాడు. 
  2. హర్షల్‌ పటేల్: 2012లో తొలిసారి ఐపీఎల్‌లోకి వచ్చిన హర్షల్‌ పటేల్ కొన్ని సీజన్లలో అదరగొట్టాడు.  2021 సీజన్‌ వేలంలో ఆర్‌సీబీ అతడిని రూ. 10.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ హర్షల్‌ పటేల్. మొత్తం 32 వికెట్లు పడగొట్టాడు. గతేడాది (2022) సీజన్‌లోనూ 15 మ్యాచుల్లో 19 వికెట్లు తీశాడు. కానీ, ఈ ఏడాది పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. కేవలం 14 వికెట్లే తీశాడు. పరుగులు భారీగా ఇచ్చాడు. దీంతో ఆర్‌సీబీ అతడిని వదులుకుంది. ఈసారి రూ. 2 కోట్ల ప్రాథమిక ధరతో వేలం బరిలోకి దిగాడు.
  3. షారుక్‌ ఖాన్‌: హార్డ్‌ హిట్టర్‌ షారుక్‌ ఖాన్‌ను అనూహ్యంగా పంజాబ్‌ కింగ్స్‌ వదిలేసుకుంది. అతడి కోసం సీఎస్‌కే, ముంబయి, సన్‌రైజర్స్‌ పోటీపడతాయని భావిస్తున్నారు. షారుఖ్‌ ఈసారి రూ. 40 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చాడు. లోయర్‌ ఆర్డర్‌లో వచ్చే షారుఖ్‌ ఖాన్‌ 2023 సీజన్‌లో 156 పరుగులు, 2022 సీజన్‌లో 117 పరుగులు, 2021 సీజన్‌లో 153 పరుగులు చేశాడు. 2021 ఐపీఎల్‌ వేలంలో షారుక్‌ను రూ. 5.25 కోట్లకు పంజాబ్‌ కింగ్స్‌ దక్కించుకుంది. భారీ షాట్లను కొట్టే షారుక్‌ ఈసారి వేలంలో హాట్‌ కేక్‌ అనడంలో సందేహం లేదు. 
  4. శివమ్‌ మావి: టీమ్ఇండియా తరఫున ఈ ఏడాదే అరంగేట్రం చేసిన శివవ్‌ మావి.. ఐపీఎల్‌లో మాత్రం ఐదు సీజన్ల నుంచి ఆడుతున్నాడు.2018 -22 వరకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడిన శివమ్‌ ఈ ఏడాది గుజరాత్‌ టైటాన్స్‌కు వచ్చాడు. గుజరాత్‌ అతడిని రూ. 6 కోట్లకు వేలంలో తీసుకుంది. అయితే ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం రాలేదు. దీంతో ఈసారి అతడిని గుజరాత్‌ వదులుకుంది. మినీ వేలంలోకి కనీస ధర రూ. 50 లక్షలతో వచ్చాడు. 
  5. సర్ఫరాజ్‌ ఖాన్‌: అద్భుతమైన ప్రతిభ ఉన్నప్పటికీ ఇటు భారత జట్టులో కానీ.. ఐపీఎల్‌ ఫ్రాంచైజీ టీమ్‌లో సరైన ప్రాధాన్యం దక్కని ఆటగాడు సర్ఫరాజ్‌ ఖాన్‌. దేశవాళీ మ్యాచుల్లో అదరగొట్టే సర్ఫరాజ్‌ జాతీయ జట్టు తరఫున మాత్రం విఫలమవుతూ వచ్చాడు. రెండేళ్ల కిందట సర్ఫరాజ్‌ ఖాన్‌ను దిల్లీ క్యాపిటల్స్‌ కేవలం రూ. 20 లక్షలకే దక్కించుకుంది. అయినా ఆడే అవకాశం రాలేదు. ఇప్పుడు జట్టులో నుంచే తప్పించింది. డొమిస్టిక్ ఫామ్‌ను చూస్తే ఈసారి మంచి ధర లభించే అవకాశం ఉంది. 
  6. మనీశ్ పాండే: ఐపీఎల్‌లో ఏడు ఫ్రాంచైజీల తరఫున ఆడిన బ్యాటర్ మనీశ్ పాండే. టీమ్‌ఇండియాకూ ప్రాతినిధ్యం వహించిన పాండే జట్టులో స్థిరమైన స్థానం మాత్రం దక్కలేదు. ఫామ్‌ లేమితో ఇబ్బంది పడుతున్న మనీశ్‌పై నమ్మకంతో గత సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ రూ. 2.40 కోట్లకు తీసుకుంది. పది మ్యాచ్‌లు ఆడిన పాండే కేవలం 160 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిని డీసీ వదులుకుంది. ఈ సారి వేలంలోకి రూ. 50 లక్షలతో వచ్చాడు. ఫామ్‌పరంగా గొప్ప స్థాయిలో లేని పాండేను ఏ ఫ్రాంచైజీ తీసుకుంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
  7. ఉమేశ్ యాదవ్: టీమ్‌ఇండియా సీనియర్‌ ఆటగాడు ఉమేశ్‌ యాదవ్ కూడా రూ. 2 కోట్లతో వేలంలోకి వచ్చాడు. కోల్‌కతాకు ప్రాతినిధ్యం వహించిన ఉమేశ్‌ ఐపీఎల్‌ 2022 సీజన్‌లో 12 మ్యాచుల్లో 16 వికెట్లు పడగొట్టాడు. ఆ జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్. అయితే, గత సీజన్‌ నాటికి ప్రదర్శన దిగజారిపోయింది. ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన ఉమేశ్‌ కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే ఇచ్చాడు. భారీగా పరుగులు సమర్పించాడు. దీంతో కేకేఆర్‌ ఈసారి అతడిని వదిలేసింది. భారత్‌ తరఫున చివరిసారిగా 2022లో టీ20 ఆడిన ఉమేశ్‌ యాదవ్‌ను ఎవరు తీసుకుంటారో చూడాలి మరి..
  8. కేఎస్‌ భరత్‌: తెలుగు కుర్రాడు కేఎస్‌ భరత్ అడపాదడపా భారత జట్టులోకి వస్తున్నాడు. 2015లో దిల్లీ డేర్‌డెవిల్స్‌ రూ. 10 లక్షలకు భరత్‌ను దక్కించుకుంది. అయితే ఒక్క మ్యాచ్‌ ఆడలేదు. ఇక 2021 సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఎనిమిది మ్యాచుల్లో 191 పరుగులు చేశాడు. దూకుడుగా ఆడటంతో 2022 సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, అప్పుడూ ఒక్క మ్యాచ్‌లో ఆడలేకపోయాడు. గత సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ రూ. 1.2 కోట్ల వెచ్చించింది. రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. ఈసారి రూ. 50 లక్షలతో వేలానికి వచ్చాడు.
  9. హనుమ విహారి: మరో తెలుగు ఆటగాడు హనుమ విహారి. భారత్ తరఫున టెస్టులు మాత్రమే ఆడి.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లోకి అరంగేట్రం కూడా చేయలేదు. 2013లో తొలిసారి ఐపీఎల్‌లో అప్పటి హైదరాబాద్‌ జట్టులో ఆడాడు. ఆర్‌సీబీపై తొలి ఓవర్‌ వేసి హార్డ్‌ హిట్టర్‌ క్రిస్‌ గేల్‌ను ఒక్క పరుగుకే పెవిలియన్‌కు పంపాడు. ఆ మ్యాచ్‌లో కీలకమైన 46 పరుగులను విహారి సాధించాడు. ఆ సీజన్‌లో విహారి 17 మ్యాచ్‌లు ఆడి 241 పరుగులు చేశాడు. 2015 సీజన్‌లో ఆరుమ్యాచుల్లో కేవలం 39 పరుగులు మాత్రమే చేశాడు. చివరగా 2019లో ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత వేలంలోకి వస్తున్నా ఎవరూ ఆసక్తి చూపలేదు. మరోసారి రూ. 50 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చాడు.
  10. చేతన్‌ సకారియా:  ఐపీఎల్‌లో 19 మ్యాచ్‌లు ఆడిన చేతన్‌ సకారియాను 2022 వేలంలో రూ. 4.20 కోట్లకు దిల్లీ క్యాపిటల్స్‌ దక్కించుకుంది. ఆ సీజన్‌లో కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన సకారియా 11 ఓవర్లు వేసి 84 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. గత ఎడిషన్‌లో రెండు మ్యాచుల్లో మాత్రమే ఆడే అవకాశం వచ్చింది. 8 ఓవర్లు వేసిన సకారియా మూడు వికెట్లు పడగొట్టాడు. దిల్లీ అతడిని రిలీజ్‌ చేయడంతో రూ. 50 లక్షలతో వేలంలోకి వచ్చాడు.  
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని