WTC Final: వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఓటమి.. కారణాలు ఇవేనా?

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో (WTC Final 2023) టీమ్‌ఇండియాకు వరుసగా రెండోసారి ఓటమి ఎదురైంది. ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 209 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. టాప్‌ ఆర్డర్‌ ఘోరంగా విఫలం కావడం తీవ్రంగా నిరాశపరిచింది.

Updated : 11 Jun 2023 23:17 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు (WTC Final)చేరుకోవడమే చాలా కష్టం. టెస్టు దేశాలతో పోటీ పడి మరీ టాప్‌ -2లో నిలవాలి.  అలాంటిది వరుసగా రెండుసార్లు ఫైనల్‌కు చేరిన టీమ్‌ఇండియా మాత్రం ఛాంపియన్‌గా నిలవడంలో విఫలం కావడం అభిమానులను నిరాశకు గురి చేసింది. టెస్టు ‘గద’ ను దక్కించుకొనే కీలక మ్యాచ్‌ అంటే అన్ని రంగాల్లో రాణించాలి. కానీ భారత్‌ మాత్రం ఆసీస్‌పై తేలిపోవడం గమనార్హం. అసలు ఇంతకీ భారత పరాభవానికి గల కారణాలు ఏంటో ఓసారి పరిశీలిద్దాం..

అక్కడే తొలి పొరపాటు 

ఇంగ్లాండ్ పిచ్‌లు పేస్‌కు అనుకూలం. అందులో సందేహం లేదు. కానీ, స్పిన్‌కూ అనుకూలించే అవకాశం ఉందని పిచ్‌ను పరిశీలించిన విశ్లేషకుల అంచనా. మన జట్టులో కనీసం పార్ట్‌ టైమ్‌ స్పిన్నర్‌ కూడా లేడు. జడేజాతోనే బరిలోకి దిగాం. అశ్విన్‌ ఉంటే తన వైవిధ్యమైన బౌలింగ్‌తో మార్పు వచ్చేదేమో. ఆసీస్‌పైనా, డబ్ల్యూటీసీ సీజన్‌లోనూ అత్యధిక వికెట్లు తీసిన అశ్విన్‌ను పక్కన పెట్టేసింది. బ్యాటింగ్‌లోనూ అండగా నిలిచే సత్తా అతడి సొంతం. 

పేసర్లు రివర్స్‌ 

టాస్‌ నెగ్గి తర్వాత బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌కు తొలి సెషన్‌ మినహా ఏది కలిసిరాలేదు. పేస్‌కు అనుకూలంగా ఉన్నా మన బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు. షమీ, సిరాజ్‌ వికెట్లు తీసినప్పటికీ భారీగానే పరుగులు సమర్పించారు. బౌన్సీ పిచ్‌లపై రాణిస్తాడని ఆశించిన ఉమేశ్ యాదవ్‌ తొలి ఇన్నింగ్స్‌లో తేలిపోయాడు. రెండో ఇన్నింగ్స్‌లో కీలక వికెట్లు తీసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఫుల్లర్‌ లెంగ్త్‌ డెలివరీలను వేస్తే బ్యాటర్లు ఇబ్బంది పడే అవకాశం ఉందని మాజీలు చెబుతున్నా.. ఏమాత్రం పట్టించుకోలేకపోయారు. సెంచరీ బాదిన ట్రావిస్ హెడ్‌ షార్ట్‌ పిచ్‌ బంతులను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడ్డాడు. కానీ, నిలకడగా అలాంటి బాల్స్‌ వేయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. 

ఇంకా ఆ మూడ్‌లోనే ఉన్నారా..?

భారత బ్యాటింగ్‌ లైనప్‌లో అజింక్య రహానె మినహా మిగతా వారి గురించి చెప్పడానికి ఏమీ లేదు. గిల్, కోహ్లీ, రోహిత్ నేరుగా ఐపీఎల్‌ నుంచి వచ్చారు. ఇంకా ఆ మూడ్‌లో నుంచి బయటకు రాలేదని తెలుస్తోంది. క్రీజ్‌లో పాతుకు పోయి ఆడటంలో విఫలమయ్యారు. వీరంతా స్టార్‌ ఆటగాళ్లు అయినా పొట్టి ఫార్మాట్‌ నుంచి సుదీర్ఘ ఫార్మాట్‌కు తమను మలుచుకోవడంలో విఫలం కావడం మ్యాచ్‌లో తీవ్ర ప్రభావం చూపించింది. అక్కడ వందల పరుగులు కొట్టిన వాళ్లు ఇక్కడ వంద నిమిషాలు కూడా క్రీజ్‌లో ఉండలేకపోయారు.

పుజారా పట్టుమని...

ఇంగ్లాండ్‌లో గత కొన్ని రోజులుగా కౌంటీల్లో అదరగొట్టిన పుజారా అసలు మ్యాచ్‌కు వచ్చేసరికి తేలిపోయాడు. పుజారా కంటే చాలా రోజులుగా టెస్టులకు దూరంగా ఉన్న రహానె కీలక ఇన్నింగ్స్‌లు ఆడటం గమనార్హం. అందరికీ మార్గనిర్దేశకుడిగా ఉంటూ సహచరులకు విలువైన సూచనలు ఇవ్వాల్సిన పుజారానే విఫలం కావడం కూడా భారత్‌ ఓటమికి ప్రధాన కారణంగా భావించొచ్చు. కీలకమైన డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు కనీసం వార్మప్‌ అవడానికి వీలుగా మ్యాచ్‌లు పెట్టకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మాటల్లోని దూకుడు... చేతల్లో లేదు

బౌలింగ్‌ ఎటాక్‌కు వెళ్లినప్పుడు మహ్మద్‌ సిరాజ్‌ ప్రత్యర్థులపై దూకుడు ప్రదర్శించడం ఈ మ్యాచ్‌లోనూ మనం చూశాం. అయితే, ఆసీస్ బ్యాటర్లను రెచ్చగొట్టేలా ఉన్న అతడి చర్యలు.. భారత్‌ను మాత్రం కాపాడలేకపోయాయి. సిరాజ్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కలిపి ఐదు వికెట్లు తీసి 188 పరుగులు ఇచ్చాడు.  ఓ పక్క ఆస్ట్రేలియా బౌలర్లు నిశ్శబ్దంగా వికెట్లు తీస్తూ తమ జట్టును గెలిపించారు. రెండో ఇన్నింగ్స్‌లో 125/5 స్కోరుతో ఉన్న ఆసీస్‌ను కట్టడి చేయడంలో మన బౌలర్లు విఫలమయ్యారు.

అంపైర్‌ నిర్ణయమూ కారణమే..

భారత్‌ ఓటమికి బౌలింగ్‌, బ్యాటింగ్‌లో విఫలం కావడంతోపాటు అంపైర్ల నిర్ణయాలు కూడా ఓ కారణమనే వాదనా ఉంది. మరీ ముఖ్యంగా భారీ లక్ష్య ఛేదనకు దిగిన సమయంలో శుభ్‌మన్‌ గిల్ క్యాచ్‌ తీవ్ర వివాదాస్పదమైంది.  అంపైర్‌ నిర్ణయంపై సోషల్‌ మీడియాలో విమర్శలు రేగాయి. రోహిత్‌తో కలిసి మంచి భాగస్వామ్యం అందించే క్రమంలో గిల్‌ ఔట్‌ కావడంతో భారత్‌ ఒత్తిడికి గురైంది.

ఇంగ్లాండ్‌ అయినా ఆసీస్‌కే...

ఇంగ్లాండ్‌లోని ఓవల్‌ మైదానం ఈ ఫైనల్‌కి పేరుకే న్యూట్రల్‌ వేదికైనా ఆస్ట్రేలియాకు కలిసొచ్చింది అని చెప్పొచ్చు. ఇంగ్లిష్‌ పిచ్‌లు ఆసీస్‌ పిచ్‌లకు దగ్గరగా ఉంటాయి. మన వాళ్లు ఇటీవల కాలంలో అలాంటి పిచ్‌లకు అలవాటుపడినా, WTC ఫైనల్‌ లాంటి వాటికి ఒక టీమ్‌కు మాత్రమే అనువైన పిచ్‌లు ఉండటం సరికాదు అనే విమర్శలు మ్యాచ్‌ తొలినాళ్లలోనే వచ్చాయి. మ్యాచ్‌ ఫలితానికి ఇది మొత్తంగా కారణం కాకపోయినా... ప్రభావం చూపించిన అంశాల్లో మాత్రం ఇదొక్కటి అని చెప్పొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని