Six Hitting Victory: మోదీ మొన్న అన్నారు.. క్రికెటర్లు ఎప్పుడో పాటించారు!

భారీ షాట్‌తో జట్టును గెలిపిస్తే ఆ మజానే వేరు. అందులోనూ కీలక మ్యాచుల్లో అయితే అభిమానుల ఆనందానికి హద్దు ఉండదు. ఇలా భారత స్టార్‌ క్రికెటర్లు సిక్స్‌తో జట్టును గెలిపించిన సందర్భాలేంటో తెలుసుకుందాం..

Updated : 09 Aug 2023 14:38 IST

ఇంటర్నెట్ డెస్క్: ‘‘చివరి బంతికి సిక్స్‌ కొట్టండి’’.. ఇదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవిశ్వాసం సందర్భంగా తమ ఎంపీలకు చేసిన సూచన. ప్రధాని మోదీ మాటలను హార్దిక్‌ పాండ్య విన్నట్లు ఉన్నాడు. విండీస్‌తో జరిగిన మూడో టీ20లో (WI vs IND) సిక్స్‌తో జట్టును గెలిపించాడు. అయితే, చివరి బంతి కాదు కానీ కీలకమైన మ్యాచే. ఇలా సిక్స్‌తో మ్యాచ్‌లను ముగించిన ముఖ్యమైన సందర్భాలనూ మనం ఓసారి గుర్తు చేసుకుందాం..

ఎప్పటికీ ఎవర్‌గ్రీన్

దాదాపు 28 ఏళ్లపాటు రెండో వన్డే వరల్డ్‌ కప్‌ను అందుకోవాలనే కలగా అలానే ఉండిపోయిన వేళ.. స్వదేశంలో జరిగిన 2011 వరల్డ్ కప్‌ మెగా టోర్నీలో టీమ్‌ఇండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. కెప్టెన్‌ కూల్‌ నాయకత్వంలో రెండో ప్రపంచకప్‌ కావడం విశేషం. అంతకుముందు 2007లో పొట్టి కప్‌ను అందించాడు. అయితే, 2011 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో ధోనీ స్టైల్‌గా సిక్స్‌ కొట్టిన విధానం క్రికెట్ అభిమానుల్లో అలా ఉండిపోతుంది. శ్రీలంక నిర్దేశించిన 275 పరుగుల టార్గెట్‌ను 48.2 ఓవర్లలోనే భారత్ ఛేదించింది. 

డీకేకు ‘నిదహాస్‌’ నీరాజనం

శ్రీలంకలోని కొలంబో వేదికగా 2018లో జరిగిన నిదహాస్‌ ట్రోఫీ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడింది. టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ చివరి బంతికి విజయం సాధించి నిదహాస్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. బంగ్లా నిర్దేశించిన 167 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌కు చివరి ఓవర్‌లో 12 పరుగులు అవసరం. అయితే, ఐదు బంతులకు ఏడు రన్స్‌ రావడంతో ఉత్కంఠ పెరిగిపోయింది. సౌమ్యా సర్కార్‌ వేసిన ఈ ఓవర్‌ ఆఖరి బంతిని దినేశ్‌ కార్తిక్‌ సిక్స్‌గా మలిచిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఐపీఎల్‌లోనూ ఇలా ఫినిషింగ్‌ పాత్రను పోషించిన కార్తిక్‌.. గత ఏడాది మాత్రం నిరాశపరిచాడు. 

పాక్‌పైనా సిక్స్‌తో హార్దిక్‌

విండీస్‌తో కీలకమైన మ్యాచ్‌లో సిక్స్‌తో భారత్‌ను గెలిపించిన హార్దిక్‌ పాండ్య గతేడాది జరిగిన ఆసియా కప్‌లోనూ ఇలాంటి ప్రదర్శనే చేశాడు. ఆ టోర్నీలో భారత్‌ ప్రదర్శన నిరాశపరిచినా..  పాక్‌పై గెలవడం మాత్రం అభిమానులకు గుర్తుండిపోతుంది. మరీ ముఖ్యంగా పాకిస్థాన్‌ నిర్దేశించిన 148 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో భారత్ కూడా చివర్లో ఇబ్బంది పడేలా కనిపించింది. కానీ హార్దిక్‌ పాండ్య ఆత్మవిశ్వాసంతో ఆడి 17 బంతుల్లోనే 33 పరుగులు చేశాడు.


ఐపీఎల్‌లో చివరి బంతికి మనోళ్లు.. 


ఐదు సిక్స్‌ల రింకు..

ఇదే ఏడాది ఐపీఎల్‌లో ఇలా సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించిన ఆటగాడు కేకేఆర్‌ బ్యాటర్ రింకు సింగ్‌. గుజరాత్‌ టైటాన్స్‌ బౌలర్‌ యశ్‌ దయాల్ వేసిన చివరి ఓవర్‌లో విజయానికి 28 పరుగులు అవసరం కాగా.. వరుసగా ఐదు సిక్స్‌లు కొట్టిన రింకు సింగ్‌ కోల్‌కతాను గెలిపించాడు. 

హైదరాబాద్‌పై రషీద్‌ ఖాన్

చాలాఏళ్లపాటు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన రషీద్ ఖాన్‌ గతేడాది గుజరాత్ టైటాన్స్‌కు వెళ్లిపోయాడు. అయితే ఐపీఎల్‌ 2022 సీజన్‌లో హైదరాబాద్‌పైనే దూకుడైన ఇన్నింగ్స్‌ ఆడి గుజరాత్‌ను గెలిపించాడు. నాలుగు బంతుల్లో మూడు సిక్స్‌లు కొట్టడం గమనార్హం. చివరి రెండు బంతుల్లో 9 పరుగులు అవసరమైన వేళ వరుసగా రెండు సిక్స్‌లు బాదేశాడు. 

పంజాబ్‌పై తెవాతియా

గతేడాది ఐపీఎల్‌ సీజన్‌లో రాహుల్‌ తెవాతియా పేరు మారుమోగిపోయింది. మరీ ముఖ్యంగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి రెండు బంతుల్లో సిక్స్‌లు కొట్టిన తెవాతియా ఓటమి నుంచి గుజరాత్‌ను గట్టెక్కించాడు. 190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ చివరి ఓవర్‌లో 19 పరుగులు చేయాలి. ఆఖరి రెండు బంతుల్లో రెండు సిక్స్‌లు కొడితేనే గుజరాత్‌ విజయం సాధించే పరిస్థితి. ఆశలన్నీ కోల్పోయిన వేళ తెవాతియా అసాధారణ రీతిలో రెండు సిక్స్‌లు కొట్టేశాడు. 

కోల్‌కతాను హడలెత్తించిన జడ్డూ

చెన్నై జట్టు విజయవంతంగా నడవడంలో ధోనీ పాత్రతోపాటు ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కూడా కీలకం. ఇటీవల ముగిసిన సీజన్‌ ఫైనల్‌లోనూ గుజరాత్‌పై సిక్స్‌, ఫోర్‌ కొట్టి కప్‌ను అందించిన జడ్డూ.. 2020 సీజన్‌లోనూ కోల్‌కతాపై ఇలాగే కీలక సమయంలో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టి విజయం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించాడు. 

2016లో కింగ్స్‌ పంజాబ్‌పై ధోనీ

ఐపీఎల్ 2023 సీజన్‌లో ధోనీ చివరి ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి సిక్స్‌లతో రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. కీలకమైన సమయంలో భారీ సిక్స్‌లు కొట్టడం ధోనీ స్పెషాలిటీ. అంతర్జాతీయంలోనే కాకుండా ఐపీఎల్‌లోనూ ఇలాంటి ఫీట్లు సాధించాడు. రైజింగ్‌ పుణె జట్టు తరఫున 2016లో బరిలోకి దిగిన ధోనీ పంజాబ్‌ కింగ్స్‌పై ఇలానే సిక్స్‌తో జట్టును గెలిపించాడు. 

శ్రీకర్‌ ఖాతాలోనూ అరుదైన ఫీట్

టెస్టు బ్యాటర్‌గా మనకు పరిచయమున్న శ్రీకర్‌ భరత్‌ కూడా ఐపీఎల్‌లో సిక్స్‌తో తన జట్టును గెలిపించాడు. ఆర్‌సీబీ తరఫున ఆడిన భరత్‌ 2021 సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్‌పై అర్ధశతకంతో (78*) చివరి వరకు క్రీజ్‌లో ఉండి జట్టును గెలిపించాడు. చివరి బంతికి సిక్స్‌ అవసరమైన సందర్భంలో అవేశ్‌ ఖాన్‌ వేసిన ఓవర్‌లో శ్రీకర్‌ భరత్‌ సూపర్‌ సిక్స్‌ కొట్టాడు. 

రోహిత్ శర్మ కూడా..

ఫార్మాట్‌ ఏదైనా సిక్స్‌లు కొట్టడంలో కెప్టెన్ రోహిత్ శర్మ తీరే వేరు. ముంబయి ఇండియన్స్‌ జట్టు తరఫున 2012 సీజన్‌ నుంచి ఆడిన రోహిత్.. డెక్కన్ ఛార్జర్స్‌పై అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 3 బంతుల్లోనే 11 పరుగులు అవసరమైనప్పుడు రోహిత్ సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు. డెక్కన్ ఛార్జర్స్ 139 పరుగులే లక్ష్యంగా నిర్దేశించిన కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ముంబయికి ఛేదన సులువుగా సాగలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని