IND vs WI : సమస్యలను అధిగమించాలి.. ఆధిక్యంలోకి దూసుకెళ్లాలి!

విజయాలు సాధించే వరకు ఎలాంటి ప్రయోగాలు చేసినా అందరూ ఆమోదిస్తారు. ఒక్క పరాజయం ఎదురైతే చాలు ఇక జట్టు పనైపోయింది.. బ్యాటింగ్‌, బౌలింగ్‌ ఆర్డర్‌ సరిగాలేదనే...

Updated : 02 Aug 2022 17:18 IST

రాత్రి 9.30గంటలకు భారత్‌, విండీస్‌ జట్ల మధ్య మూడో టీ20

ఇంటర్నెట్ డెస్క్‌: విజయాలు సాధించే వరకూ ఎలాంటి ప్రయోగాలు చేసినా అందరూ ఆమోదిస్తారు. ఒక్క పరాజయం ఎదురైతే చాలు ఇక జట్టు పనైపోయింది.. బ్యాటింగ్‌, బౌలింగ్‌ ఆర్డర్‌ సరిగాలేదనే విమర్శలు చేస్తారు. అయితే టీమ్‌లోని సహచరులపై కెప్టెన్‌, యాజమాన్యం నమ్మకం ఉంచితేనే సత్ఫలితాలు వస్తాయి. ఈ విషయంలో రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్‌ను అనడానికేమీ లేదు. వారిద్దరూ ఆటగాళ్లకు స్వేచ్ఛ ఇవ్వడంలో ముందుంటారు. ఈ క్రమంలో మూడో టీ20లోతీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఓసారి తెలుసుకుందాం..  

బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఇబ్బందా..? 

తొలి టీ20లో ఘన విజయం సాధించిన టీమ్‌ఇండియా రెండో మ్యాచ్‌లో కుదేలైంది. బ్యాటింగ్‌లో లోపాలు బయట పడ్డాయి. మిడిలార్డర్‌లో హార్దిక్‌ పాండ్య (31), రవీంద్ర జడేజా (27), రిషభ్‌ పంత్ (24) కాస్త బ్యాట్‌ను ఝులిపించడంతో 138 పరుగులైనా చేయగలిగింది. మరి ఇలాంటి ప్రదర్శనే పునరావృతమైతే మాత్రం సిరీస్‌పైనే కాకుండా వచ్చే ప్రపంచకప్‌ సన్నాహాలపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే ఇవాళ జరిగే మూడో టీ20లో తప్పులను సరిదిద్దుకోవాలి. రోహిత్ శర్మకు తోడుగా సూర్యకుమార్‌ యాదవ్‌ ఓపెనర్‌ అవతారమెత్తాడు. మొదటి టీ20తోపాటు రెండో మ్యాచ్‌లోనూ ఫర్వాలేదనిపించినా భారీ ఇన్నింగ్స్‌లుగా మలచడంలో విఫలమవుతున్నాడు. ఇక కెప్టెన్‌ రోహిత్‌ సంగతికొస్తే.. ఫస్ట్‌మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ చేసిన రోహిత్ రెండో టీ20లో గోల్డెన్‌ డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. అటు వన్‌డౌన్‌లో శ్రేయస్‌ అయ్యర్ (0, 10) రెండు మ్యాచుల్లోనూ విఫలమయ్యాడు. దీంతో అయ్యర్ స్థానంలో దీపక్‌ హుడాను తీసుకోవాలని విశ్లేషకులు చెబుతున్నారు. లోయర్ఆర్డర్‌లో దూకుడుగా ఆడే దినేశ్‌ కార్తిక్‌ను అడ్డుకోవడంలో విండీస్‌ బౌలర్లు విజయవంతమయ్యారు. తొలి మూడు స్థానాలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.

బౌలింగ్‌ బాగానే ఉంది కానీ.. 

టీమ్‌ఇండియా బౌలింగ్‌ పరంగా బాగానే ఉంది కానీ.. కీలక సమయంలో ఆఖరి ఓవర్‌ను యువ బౌలర్‌కు ఇవ్వడం సమంజసం కాదనే వాదనా వినిపించింది. ప్రయోగాల్లో భాగమైనప్పటికీ సిరీస్‌ కైవసం చేసుకున్న తర్వాత ఇలాంటివి చేస్తే బాగుంటుందని పలువురు మాజీల అభిప్రాయం. రెండో టీ20 మ్యాచ్‌నే ఉదాహరణగా తీసుకుంటే.. ఆఖరి ఓవర్‌లో విండీస్‌ విజయానికి పది పరుగులు అవసరమైన వేళ పెద్దగా అనుభవం లేని అవేశ్‌ ఖాన్‌ చేతికి రోహిత్ బంతినిచ్చాడు. అప్పటికీ భువనేశ్వర్‌ కుమార్‌కు ఇంకా రెండు ఓవర్లు మిగిలే ఉన్నాయి. ఒత్తిడిని తట్టుకోలేని అవేశ్ రెండు బంతుల్లోనే మ్యాచ్‌ను విండీస్‌కు అప్పగించాడు. బౌలింగ్‌లో పెద్దగా మార్పులు అవసరం లేకపోయినా.. మ్యాచ్‌ ఫలితం తేలే ఓవర్లను అనుభజ్ఞులకు ఇస్తేనే ఉత్తమంగా ఉంటుంది.

వారిని తక్కువ అంచనా వేయొద్దు.. 

పొట్టి ఫార్మాట్‌ అంటేనే ఎప్పుడేం జరుగుతుందో అంచనా వేయలేం. అసలే విండీస్‌ ఆటగాళ్లకు టీ20లు బాగా అలవాటు. అంతేకాకుండా గత కొన్ని మ్యాచుల్లో చివరి వరకు వచ్చి ఓటమిపాలైన సందర్భాలు ఉన్నాయి. దీంతో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు విండీస్‌ ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో రెండో టీ20లో ఆ జట్టు బౌలర్‌ మెకాయ్‌ తొలి బంతి నుంచే టీమ్‌ఇండియాపై దాడి చేశాడు. అందుకే విండీస్‌ బౌలర్లను ఆచితూచి ఆడాల్సి ఉంటుంది. వెస్టిండీస్‌ బ్యాటర్లు బ్రాండన్ కింగ్, డేవన్‌ థామస్‌, కేల్‌ మయేర్స్‌ ఫామ్‌లో ఉన్నారు. పూరన్‌, హెట్మయేర్‌ కూడా ఫామ్‌లోకి వస్తే మాత్రం విండీస్‌ను ఆపడం కష్టతరమే. లోయర్‌ ఆర్డర్‌లో రోవ్‌మన్‌ పావెల్, ఒడియన్‌ స్మిత్‌తో కూడిన బ్యాటింగ్ దళం విండీస్‌ సొంతం. అందుకే భారత బౌలర్లూ బహుపరాక్‌. 

పిచ్‌ పరిస్థితేంటి..? 

మూడో మ్యాచ్‌ జరిగే సెయింట్‌ కిట్స్‌లోని వార్నర్‌ పార్క్‌ మైదానం పిచ్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండింటికీ సహకారం అందిస్తుంది. నిన్న రెండో టీ20లోనూ తొలుత బౌలింగ్‌ అనుకులంగా అనిపించినా.. క్రీజ్‌లో కుదురుకుంటే మాత్రం పరుగులు రాబట్టవచ్చని బ్రాండన్‌ కింగ్‌ ఇన్నింగ్సే నిరూపించింది. భారత  జట్టులోనూ పలు మార్పులు చేసే అవకాశం ఉంది. బెంచ్‌కే పరిమితమైన సంజూ శాంసన్, దీపక్ హుడా, అక్షర్‌ పటేల్, హర్షల్‌ పటేల్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. 

జట్లు వివరాలు (అంచనా) : 

భారత్‌: రోహిత్ శర్మ (కెప్టెన్‌), సూర్యకుమార్‌ యాదవ్, సంజూ శాంసన్‌, రిషభ్‌ పంత్, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, దీపక్ హుడా, దినేశ్‌ కార్తిక్‌, అక్షర్ పటేల్, భువనేశ్వర్‌ కుమార్, అర్ష్‌దీప్‌ సింగ్ 

విండీస్‌: కేల్ మయేర్స్, బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్ (కెప్టెన్‌), రోవ్‌మన్‌ పావెల్, హట్మయేర్‌, డేవన్ థామస్, జాసన్‌ హోల్డర్‌, అకీల్ హోసీన్, ఒడియన్‌ స్మిత్, అల్జారీ జోసెఫ్‌, మెకాయ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని