Virat Kohli: ఇది కోహ్లి రాసిన కథ

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ప్లేఆఫ్స్‌కు చేరుతుందని ఓ నెల ముందు ఎంతమంది ఊహించివుంటారు..? బహుశా ఒక్కరూ ఉండరేమో! ఆ జట్టు ప్రదర్శన అలాంటిది మరి! ఎనిమిది మ్యాచ్‌ల్లో ఏడు ఓటములతో పట్టికలో అట్టడుగున ఉన్న ఆర్సీబీ..

Updated : 21 May 2024 04:34 IST

ఫోర్త్‌ అంపైర్‌

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ప్లేఆఫ్స్‌కు చేరుతుందని ఓ నెల ముందు ఎంతమంది ఊహించివుంటారు..? బహుశా ఒక్కరూ ఉండరేమో! ఆ జట్టు ప్రదర్శన అలాంటిది మరి! ఎనిమిది మ్యాచ్‌ల్లో ఏడు ఓటములతో పట్టికలో అట్టడుగున ఉన్న ఆర్సీబీ.. ఇంకొక్క ఓటమి చవిచూస్తే ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించే స్థితిలో నిలిచిందప్పుడు. అభిమాని సంగతి అటుంచితే.. మిగతా జట్లు దూసుకుపోతున్న వేళ.. ఆ జట్టు ఆటగాళ్లు కూడా తమ అవకాశాలపై ఆశాభావంతో ఉండి ఉండరు. కానీ జరిగింది అద్భుతం కన్నా ఏమాత్రం తక్కువ కాదు.ప్లేఆఫ్స్‌ రేసు నుంచి మొదటగా నిష్క్రమిస్తుందనుకున్న జట్టు వరుసగా ఆరు విజయాలతో ఔరా అనిపించింది. ఆశలన్నీ అడుగంటిన వేళ.. ప్రపంచమంతా తమను పక్కనపెట్టేసిన సమయాన, పట్టువదలకుండా.. ఆర్సీబీ పోరాడిన తీరు నభూతో..!

ట్టు నిండా స్టార్లేమీ లేరు. మ్యాక్స్‌వెల్‌, డుప్లెసిస్‌ లాంటి వాళ్లు ఫామ్‌తో తంటాలు పడ్డారు. అలాంటి నేపథ్యంలో ఓ నెల రోజులు గెలుపు మొహమే చూడని బెంగళూరు తన రాతను మార్చుకున్న తీరు స్ఫూర్తిదాయకం. మరి ఆర్సీబీ దశ తిరగడానికి ప్రధాన కారణమేంటి అన్న ప్రశ్న తలెత్తినప్పుడు.. జవాబుగా కనిపించేది విరాట్‌ కోహ్లి మాత్రమే. అతడు టోర్నీ ఆసాంతం అదిరే బ్యాటింగ్‌తో పరుగుల వరద పారించడం ఒక ఎత్తు.. నిరాశ దరిచేరనీయకుండా సహచరుల్లో స్ఫూర్తిని రగిలించడం మరో ఎత్తు. కెప్టెన్‌గా దిగిపోయినా నాయకత్వ పాత్రను అద్భుతంగా పోషిస్తూనే ఉన్నాడు విరాట్‌. తాను ఆడుతూ సహచరులకు ప్రేరణనిస్తూ సాగిపోతున్నాడు. ఫీల్డ్‌లో చిరుతలా కదిలే కోహ్లిని చూస్తేనే సహచరుల్లో ఎనలేని ఉత్సాహం వస్తుంది. బౌలర్‌ వికెట్‌ తీసినప్పుడో, ఫీల్డర్‌  ఓ అద్భుత క్యాచ్‌ పట్టినప్పుడో  అతడు సంబరాలు చేసుకునే తీరు, ప్రదర్శించే కసి అసంకల్పితంగానే సాటి ఆటగాళ్లకు ఉత్తేజాన్నిస్తుంది. ముఖ్యంగా జట్టులో యువ ఆటగాళ్లకు అతడు గొప్పగా మార్గనిర్దేశనం చేస్తాడు. ఓటమిని అంగీకరించని వ్యక్తిత్వం వల్ల కోహ్లి చిన్న అవకాశాన్నైనా వదలకుండా పోరాడతాడు. మాటల్లో అదే చెప్తాడు. చేతల్లోనూ అదే చేస్తాడు. నిరుడు మహిళల ప్రిమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో అమ్మాయిల ఆర్సీబీ జట్టు తొలి అయిదు మ్యాచ్‌లూ ఓడింది. అప్పుడు అమ్మాయిలకు ప్రేరణ కలిగిస్తూ.. ‘‘2019లో వరుసగా ఆరు మ్యాచ్‌లు ఓడిపోయాం. అప్పుడు నేనే కెప్టెన్‌. ఏం చేయాలో అర్థం కాలేదు. క్రికెట్‌ కెరీర్లో అంతకుముందెప్పుడూ వరుసగా 6 మ్యాచ్‌లు ఓడిపోలేదు. అనూహ్యమైన విషయాలు జరుగుతాయి. దురదృష్టమూ వెంటాడుతుంది. కానీ నమ్మకం కోల్పోవద్దు. ఒక్క శాతం అవకాశం కూడా ఉంటుంది. కొన్నిసార్లు అది సరిపోతుంది. ఆ ఒక్క శాతం గురించి ఎలా ఆలోచిస్తారన్నది కీలకం. ఆ ఒకటిని 10గా, 10ని 30గా మారుస్తూ మాయ చేయాలి. మనల్ని ఎవరూ నమ్మనప్పుడు గెలవడం అద్భుతంగా ఉంటుంది’’ అని కోహ్లి ప్రసంగించాడు. అతని మాటలు మంత్రంలా పనిచేశాయేమో అమ్మాయిల జట్టు వరుసగా తర్వాతి రెండు మ్యాచ్‌లు గెలిచింది. ఈ సీజన్‌లో ఏకంగా టైటిల్‌ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఐపీఎల్‌లోనూ బెంగళూరు అదే స్ఫూర్తితో సాగుతోంది. ఏప్రిల్‌ 21న కేకేఆర్‌  చేతిలో ఓటమితో ఏడో పరాజయాన్ని ఖాతాలో వేసుకున్నప్పుడు ప్లేఆఫ్స్‌ చేరేందుకు ఆర్సీబీకి ఉంది ఒక్క శాతం అవకాశమే. 

ఆడి.. ఆడించి!: కోహ్లి పట్టుదల, ఎలాంటి స్థితిలోనూ ఆశలు వదులుకోని తత్వమే ఆర్సీబీ ఇక్కడిదాకా రావడంలో ప్రధాన పాత్ర పోషిందనడం అతిశయోక్తి కాదు. తానెంత బాగా ఆడుతున్నా... సహచరుల ఫామ్‌తో సతమతమవుతుంటే, వరుస ఓటములు ఎదరవుతుంటే ఏ ఆటగాణ్నైనా నిరాశ ఆవహిస్తుంది. కానీ కోహ్లి కేవలం ఓ ఆటగాడు కాదు.. పోరాట యోధుడు. ఫలితాలతో సంబంధం లేకుండా పరుగుల వేటలో విరామం లేకుండా సాగిపోయాడు. అవకాశాన్ని వదలొద్దని, ఆఖరి మ్యాచ్‌ వరకూ విశ్రమించొద్దని ప్రతి ఆటగాడికి నూరిపోశాడు. తాను బ్యాటింగ్‌లో నిలకడ కొనసాగిస్తూ ఓ ఉదాహరణగా నిలిచాడు. స్ట్రైక్‌ రేట్‌పై విమర్శలకు ధనాధన్‌ ఇన్నింగ్స్‌ సమయంలోనే సమాధానమిచ్చాడు. 

సన్‌రైజర్స్‌పై 20 బంతుల్లో 42 (210 స్ట్రైక్‌ రేట్‌), గుజరాత్‌పై 44 బంతుల్లో 70 (159), పంజాబ్‌పై 47 బంతుల్లోనే 92 (195), దిల్లీపై 13 బంతుల్లో 27 (207), చెన్నైపై 29 బంతుల్లో 47 (162) పరుగులు చేసి విమర్శకుల నోళ్లు మూయించాడు. కోహ్లి అంటే అంతే మరి. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 708 పరుగులు చేసిన అతనే అత్యధిక పరుగుల వీరుడు. అతని సగటు 64.36 కాగా స్ట్రైక్‌ రేట్‌ 155.60గా ఉండటం విశేషం. అత్యధిక పరుగుల ఆటగాళ్లలో రెండో స్థానంలో ఉన్న రుతురాజ్‌ (583)కు కోహ్లికి అంతరం 100 పరుగుల పైనే. ఇది కోహ్లి ఆధిపత్యానికి నిదర్శనం. అతడు డ్రెస్సింగ్‌ రూమ్‌లో సహచరులను ఎంతగా ప్రోత్సహిస్తాడన్నది ఏ ఆటగాడిని అడిగినా చెబుతాడు. ఆరంభంలో తడబడ్డ పటీదాద్‌ లాంటి ఆటగాడు క్రమంగా పుంజుకుని చెలరేగిపోతున్నాడంటే అందులో కోహ్లి పాత్ర లేదని ఎలా చెప్పగలం. మరోవైపు తన ఫీల్డింగ్‌ నైపుణ్యాలతో, ఫిట్‌నెస్‌తో కోహ్లి ఎప్పటికప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. 35 ఏళ్ల అతను గుజరాత్‌ ఆటగాడు షారుఖ్‌  ఖాన్‌ను రనౌట్‌ చేసిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. బ్యాటర్‌ వికెట్లకు అడ్డంగా పరుగెత్తుతున్నాడు.. పాయింట్‌ నుంచి పరుగెత్తుతూ వచ్చిన కోహ్లి బంతి అందుకుని త్రో విసిరే క్రమంలో పడిపోయాడు. కానీ అతని గురి తప్పలేదు. అతని స్ఫూర్తితోనే బెంగళూరు ఆటతీరు మారింది. కోహ్లి భుజాలపై భారాన్ని సహచరులూ పంచుకోవడం మొదలు పెట్టారు . బౌలింగ్‌  కుదురుకుంది. బ్యాటింగ్‌  గాడినపడింది. కోహ్లీలోని కసి అందరికీ పాకింది. ఆ కసి ఆర్సీబీకి కప్పుతెచ్చిపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వరుస విజయాలిచ్చిన విశ్వాసమో.. ఆటగాళ్ల పోరాటం పెంచిన ధీమానో.. ఇప్పుడు ప్రతి ఆర్సీబీ అభిమాని నోట ఒకటే మాట...ఈ సాలా కప్‌ నమదే!


కొన్నిసార్లు గెలిచేందుకు ఒక్క శాతం అవకాశం ఉంటుంది. ఆ ఒక్క శాతం గురించి ఎలా ఆలోచిస్తారన్నది కీలకం. ఆ ఒకటిని 10గా, 10ని 30గా మారుస్తూ మాయ చేయాలి. మనల్ని ఎవరూ నమ్మనప్పుడు గెలవడం అద్భుతంగా ఉంటుంది


సన్‌రైజర్స్‌, కోల్‌కతా, రాజస్థాన్‌లు నిస్సంకోచంగా బలమైన జట్లే. అందులో ప్రతి జట్టుకూ కప్పు కొట్టే సత్తా ఉందనడంలో సందేహం లేదు. కానీ వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి, అసాధ్యమనుకున్న దాన్ని సుసాధ్యం చేసిన బెంగళూరు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు