Ashes Series: యాషెస్ సిరీస్‌.. కీలకంగా మారే అంశాలు ఇవేనా?

డబ్ల్యూటీసీ ఫైనల్‌ తర్వాత మళ్లీ టెస్టు మజాను అందించడానికి మరో సిరీస్‌ సిద్ధమైపోయింది. ప్రతిష్ఠాత్మకమైన యాషెస్‌ సిరీస్‌ (Ashes Series) శుక్రవారం నుంచే ప్రారంభం కానుంది.

Updated : 15 Jun 2023 15:07 IST

ఇంటర్నెట్ డెస్క్‌: క్రికెట్‌కు పుట్టినిల్లు ఇంగ్లాండ్‌ వేదికగా మరో కీలక సమరానికి సమయం ఆసన్నమైంది. శుక్రవారం నుంచి ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లాండ్‌ - ఆస్ట్రేలియా (ENG vs AUS) జట్ల మధ్య ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‌ (Ashes Series) ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌తో ఇరు జట్లకూ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ మూడో సీజన్‌ కూడా మొదలుకానుంది. గత యాషెస్‌ సిరీస్‌ను ఆసీస్ గెలుచుకోగా.. సొంతగడ్డపై తిరిగి దానిని దక్కించుకోవాలని ఇంగ్లాండ్‌ పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో మూడు కీలకాంశాలు ప్రభావం చూపే అవకాశం ఉంది. 

బ్రాడ్, అండర్సన్  VS వార్నర్, లబుషేన్, హెడ్

యాషెస్ సిరీస్‌లో ఆసీస్‌ బ్యాటర్లకు ఇంగ్లాండ్‌ బౌలర్ల మధ్య ఆసక్తికరమైన పోరు జరగడం ఖాయం. సొంతమైదానంలో ఇంగ్లాండ్ బౌలర్లను అడ్డుకోవడం అంత సులువేం కాదు. జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్‌, మార్క్‌వుడ్ పేస్‌ను ఎదుర్కొని పరుగులు సాధించాల్సి ఉంటుంది. యాషెస్‌ అనగానే డేవిడ్ వార్నర్‌, లబుషేన్, ట్రావిస్ హెడ్ దూకుడుగా ఆడేస్తారు. భారత్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ట్రావిస్‌ హెడ్‌ సెంచరీతో కదం తొక్కిన విషయం తెలిసిందే. స్టీవ్‌ స్మిత్‌ కూడా ఫామ్‌లో ఉండటం ఆసీస్‌కు కలిసొచ్చేదే. అయితే, గత 26 టెస్టుల్లో వార్నర్‌ను 14సార్లు ఔట్ చేసిన రికార్డు స్టువర్ట్ బ్రాడ్‌కు ఉంది. దీంతో వీరిద్దరి మధ్య పోరు ఆసక్తికరంగా ఉండనుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

‘బజ్‌బాల్’ క్రికెట్‌

ఇటీవల కాలంలో ఇంగ్లాండ్‌ టెస్టుల్లోనూ దూకుడుగా ఆడుతూ ఫలితాలను రాబడుతోంది. ప్రత్యర్థిపై ఆధిక్యం ప్రదర్శించేందుకు ‘బజ్‌బాల్’ క్రికెట్‌తో  దూసుకొచ్చింది. కెప్టెన్ బెన్‌స్టోక్స్, కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌ నేతృత్వంలో ప్రత్యర్థి బౌలింగ్‌కు భయపడకుండా ధాటిగా ఆడుతూ పరుగులు రాబట్టడమే ఈ రకం క్రికెట్ స్పెషాలిటీ. అయితే, ఆసీస్‌ కూడా ఈ విధంగా ఆడటంలో ముందుంటోంది. స్కాట్ బోలాండ్‌, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, హేజిల్‌వుడ్ వంటి బౌలర్లను తట్టుకుని ఇంగ్లాండ్‌ బ్యాటర్లు ‘బజ్‌బాల్’ క్రికెట్‌ ఏమేరకు ఆడతారో వేచిచూడాలి. 

స్పిన్‌ తిప్పేదెవరు?

అందరికీ గుర్తుండిపోయే ‘బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ’ నమోదైన సిరీస్‌ కూడా యాషెస్‌ కావడం విశేషం. ఇంగ్లాండ్‌పై ఆధిపత్యం ప్రదర్శించడంలో ఆసీస్‌కు స్పిన్‌ కూడా కీలకంగా మారింది. వార్న్‌ తర్వాత బ్రాడ్ హాగ్‌ ఆ బాధ్యతలు చేపట్టాడు. ఇప్పుడు నాథన్‌ లైయన్ ప్రత్యర్థులను కకావికలం చేయడంలో సిద్ధహస్తుడిగా మారాడు. తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్‌ రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ నడ్డి విరచడంలో లైయన్‌ కీలక పాత్ర పోషించాడు. పేస్‌కు సహకరించిన ఈ టెస్టులో మొత్తం ఐదు వికెట్లు తీశాడు. అతడితోపాటు టాడ్‌ మర్ఫీ ఉన్నప్పటికీ.. తుది జట్టులో ఒకరికే అవకాశం ఉండొచ్చు. మరోవైపు ఇంగ్లాండ్‌కు గాయం కారణంగా దూరమైన జాక్‌ లీచ్‌ స్థానంలో వెటరన్‌ స్పిన్నర్ మొయిన్‌ అలీ వచ్చాడు. రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకొని మరీ జట్టులోకి రావడం గమనార్హం. యువ లెగ్‌ స్పిన్నర్ రెహాన్‌ అహ్మద్‌ను వదులుకోవడం ఇంగ్లాండ్‌కు నష్టం చేస్తుందనే వాదనా ఉంది. మరి స్పిన్‌ విభాగంలో ఇరు జట్లలో ఎవరు పైచేయి సాధిస్తారో..? 

జట్లు (అంచనా)

ఇంగ్లాండ్‌: హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జో రూట్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), మొయిన్‌ అలీ, ఓలీ పోప్ (వికెట్ కీపర్), జేమ్స్ అండర్సన్, స్టువర్ట్‌ బ్రాడ్, ఓలీ రాబిన్‌సన్, మార్క్‌ వుడ్

ఆసీస్: ఉస్మాన్‌ ఖవాజా, డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, స్టీవ్‌ స్మిత్, మార్నస్‌ లబుషేన్, కామెరూన్‌ గ్రీన్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్‌ స్టార్క్‌/బోలాండ్‌, జోష్ హేజిల్‌వుడ్, నాథన్ లైయన్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని