ICC: సెహ్వాగ్‌ సహా మరో ఇద్దరికి ఐసీసీ అత్యున్నత గౌరవం

వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు మరో ఇద్దరు దిగ్గజ క్రికెటర్లకు ప్రతిష్ఠాత్మక ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కింది.

Updated : 13 Nov 2023 18:43 IST

ICC Hall of Fame| దుబాయ్‌: భారత దిగ్గజ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు మరో ఇద్దరికి అత్యున్నత గౌరవం లభించింది. ప్రతిష్ఠాత్మక ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌(ICC Hall of Fame)లోకి వీరేంద్ర సెహ్వాగ్‌, భారత మహిళా క్రికెటర్‌ డయానా ఎడుల్జీకి చోటు దక్కింది. వీరితో పాటు శ్రీలంక దిగ్గజ ఆటగాడు అరవింద డిసిల్వా కూడా  ఈ గౌరవం దక్కించుకున్నారు. వీరి ముగ్గురినీ హాల్‌ ఆఫ్‌  ఫేమ్‌ జాబితాలో చేర్చుతున్నట్లు ఐసీసీ సోమవారం ప్రకటించింది. 

వీరేంద్ర సెహ్వాగ్‌కు భారత క్రికెట్‌లో ప్రత్యేక స్థానం ఉంది. తనదైన దూకుడైన ఆటతీరుతో టీమ్‌ఇండియా విజయంలో అనేక సందర్భాల్లో కీలక పాత్ర పోషించాడు. 2011 వరల్డ్‌కప్‌లోనూ అతడు అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. తన కెరీర్‌లో మొత్తం 104 టెస్టుల్లో 8, 586 పరుగులు చేసిన సెహ్వాగ్‌.. 251 వన్డేల్లో 8, 273 పరుగులు, 19 టీ20ల్లో 394 రన్స్‌ చేశాడు. తనను ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ 2023కి ఎంపిక చేయడంపై సెహ్వాగ్‌ హర్షం వ్యక్తం చేశాడు. తనను ఎంపిక చేసిన ఐసీసీకి, జ్యూరీలకు కృతజ్ఞతలు చెప్పాడు. అత్యంత ఇష్టమైన క్రికెట్‌లోనే తన జీవితంలో ఎక్కువ కాలం గడిపినందుకు తనెంతో ధన్యుడినని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, తనతో ఆడిన వ్యక్తులు, తన కోసం నిస్వార్థంగా ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పాడు.

మహిళా క్రికెట్‌కే గర్వకారణం: డయానా ఎడుల్జీ

భారత్‌ నుంచి తొలి మహిళా క్రికెటర్‌గా హాల్‌ ఆఫ్‌ ద ఫేమ్‌ జాబితాలో చోటు దక్కడంపై దిగ్గజ మహిళా క్రికెటర్‌ డయానా ఎడుల్జీ హర్షం వ్యక్తంచేశారు.  ఈ అత్యున్నత గౌరవానికి తనను ఎంపిక చేసినందుకు ఐసీసీ, జ్యూరీలకు కృతజ్ఞతలు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళ, పురుష క్రికెటర్ల గెలాక్సీలో చేరిన తొలి భారతీయ మహిళా క్రికెటర్‌ తానే కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఈ క్షణం తనకు పాటు తన కుటుంబ సభ్యులకే కాదు.. బీసీసీఐ, భారత మహిళా క్రికెట్‌కు గర్వకారణమని పేర్కొన్నారు. 

ఐసీసీకి థాంక్స్‌.. అరవింద డిసిల్వా

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌ చోటు దక్కడంపై శ్రీలంక దిగ్గజ క్రికెటర్‌ అరవింద డిసిల్వా సంతోషం వ్యక్తం చేశారు. తనకు గొప్ప గౌరవాన్ని కల్పించిన ఐసీసీకి థాంక్స్‌ చెప్పారు. ఈ క్షణం తన హృదయమంతా కృతజ్ఞతాభావంతో నిండిపోయిందని పేర్కొన్నారు. ఈ ఘనత తన క్రికెట్‌ ప్రయాణాన్ని తీర్చిదిద్దిన అంకితభావం, త్యాగం, ప్రేమకు దక్కిన ప్రశంస అన్నారు. తనను కుటుంబ సభ్యులు, స్నేహితులు విజయంవైపు నడిపించేందుకు ఎంతగానో ప్రోత్సహించారని, కుటుంబ సభ్యుల తిరుగులేని మద్దతు, త్యాగానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పారు. తన క్రికెట్‌ ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు