IPL Finals: ఆఖరి బంతికి అద్భుతం.. అభిమానులను మునివేళ్లపై నిలబెట్టిన ఫైనల్స్ ఇవే!
ఉత్కంఠభరితంగా సాగిన ఐపీఎల్ 2023 సీజన్ (IPL 2023) ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ చివరి బంతికి విజయం సాధించింది. ఐపీఎల్ చరిత్రలో చివరి బంతి వరకు సాగిన ఫైనల్స్‌పై ఓ లుక్కేద్దాం.
ఇంటర్నెట్ డెస్క్: నరాలు తెగే ఉత్కంఠ రేకెత్తించిన ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్ (GT)పై చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఐదు వికెట్ల తేడాతో అపూర్వ విజయం సాధించింది. ఆఖరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్ ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టింది. మోహిత్ శర్మ వేసిన చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా.. చెన్నై ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అద్భుతమే చేశాడు. ఈ సందర్భంలో ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్‌పై ఓ లుక్కేద్దామా..!
తొలి సీజన్‌లో నుంచే ఉత్కంఠ
ఐపీఎల్ ఆరంభ సీజన్ (2008) ఫైనల్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తలపడ్డాయి. నరాలు తెగేంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో చివరి బంతికి రాజస్థాన్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.ఈ లక్ష్యాన్ని షేన్‌వార్న్ సారథ్యంలోని రాజస్థాన్.. 7 వికెట్లు కోల్పోయి చివరి బంతి వరకు పోరాడి ఛేదించింది. చివరి ఓవర్లో 8 పరుగులు అవసరం కాగా.. చెన్నై కెప్టెన్ ధోనీ పేసర్ లక్ష్మీపతి బాలాజీకి బంతిని అప్పగించాడు. తొలి మూడు బంతుల్లో రెండే పరుగులు రావడంతో సమీకరణం 3 బంతుల్లో 6గా మారింది. నాలుగో బంతికి వైడ్ రూపంలో రెండు పరుగులు వచ్చాయి. నాలుగో బంతికి షేన్ వార్న్ సింగిల్, ఐదో బంతికి సోహెల్ తన్వీర్ రెండు పరుగులు చేయడంతో స్కోర్లు సమం అయ్యాయి. చివరి బంతికి తన్వీర్ సింగిల్ తీయడంతో రాజస్థాన్ తొలి సీజన్‌లోనే ఛాంపియన్‌గా అవతరించి చరిత్ర సృష్టించింది. కానీ, ఆ తర్వాతి సీజన్లలో రాజస్థాన్ మరోసారి విజేతగా నిలవలేకపోయింది.
తక్కువ స్కోరే చేసినా కాపాడుకుంది
2017లో ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) టోర్నీ ఆరంభం నుంచే తిరుగులేని ఆధిపత్యం కనబరిచింది. 14 మ్యాచ్‌ల్లో 10 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవడమేకాక ఛాంపియన్‌గా అవతరించింది. ఫైనల్‌లో స్టీవ్ స్మిత్ సారథ్యంలోని రైజింగ్ పుణె సూపర్ జెయింట్‌తో తలపడి ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి.. 20 ఓవర్లలో 129/8కి పరిమితమైంది. కృనాల్ పాండ్య (47; 38 బంతుల్లో) ఒక్కడే రాణించాడు. ఈ స్వల్ప లక్ష్యఛేదనలో పుణె తడబడింది. రహానె (44), స్మిత్ (51) రాణించినా ఆ జట్టు విజయం సాధించలేకపోయింది. పుణె విజయానికి చివరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా.. ముంబయి బౌలర్ మిచెల్ జాన్సన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. మొదటి బంతికి బౌండరీ రావడంతో అందరూ పుణె గెలుపు ఖాయమనుకున్నారు. కానీ, వరుస బంతుల్లో మనోజ్ తివారీ, స్మిత్‌లను జాన్సన్ పెవిలియన్‌కు పంపడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. నాలుగు, ఐదు బంతుల్లో మూడు రన్స్ రావడంతో చివరి బంతికి నాలుగు పరుగులు అవసరం అయ్యాయి. క్రీజులో ఉన్న డానియల్ క్రిస్టియన్ రెండు రన్స్ తీసి మూడో పరుగు తీయబోయే క్రమంలో రనౌట్ అయ్యాడు. దీంతో ముంబయి శిబిరంలో సంబరాల్లో మునిగితేలింది. అలాగే ఓ ఐపీఎల్ ఫైనల్‌లో తక్కువ స్కోరును కాపాడుకున్న జట్టుగా ముంబయి రికార్డు సాధించింది.
ముంబయిని గెలిపించిన మలింగ
2019 ఫైనల్ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగింది. నరాలు తెగేంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబయి ఒక్క పరుగు తేడాతో గెలుపొంది నాలుగోసారి ఛాంపియన్‌గా అవతరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కీరన్ పొలార్డ్ (41; 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. జస్ప్రీత్ బుమ్రా (14/2), రాహుల్ చాహర్ (14/1) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సీఎస్కే 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 148 పరుగులే చేసింది. సీఎస్కే విజయానికి చివరి ఓవర్లో 9 పరుగులు అవసరం కాగా.. షేన్ వాట్సన్ 76, రవీంద్ర జడేజా 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి మూడు బంతుల్లో నాలుగు పరుగులు వచ్చాయి. నాలుగో బంతికి ఒక పరుగు పూర్తి చేసుకున్న తర్వాత వాట్సన్ రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో సమీకరణం 2 బంతుల్లో 4 పరుగులుగా మారింది. ఐదో బంతికి శార్దూల్ ఠాకూర్ రెండు పరుగులు చేయడంతో గెలుపుపై ఉత్కంఠ మరింత పెరిగిపోయింది. మలింగ (Lasith Malinga) ఆఖరి బంతిని తెలివిగా వేసి శార్దూల్‌ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపడంతో ముంబయి విజయానందంతో మురిసిపోయింది.
రెండుసార్లు ప్రత్యర్థి ఆర్సీబీయే
2009, 2016 ఫైనల్స్ కూడా ఉత్కంఠభరితంగానే సాగాయి. ఆఖరి ఓవర్‌కు ఫలితం తేలలేదు. ఈ రెండు ఫైనల్స్‌లోనూ హైదరాబాద్ విజయం సాధించగా.. ప్రత్యర్థి బెంగళూరే (RCB) కావడం విశేషం. 2009 ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 143/6 స్కోరు చేయగా.. బెంగళూరు 137/9కి పరిమితమైంది. దీంతో డెక్కన్ ఛార్జర్స్ (DC) 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్లో బెంగళూరు విజయానికి 15 పరుగులు అవసరం కాగా.. ఆర్పీ సింగ్ ఎనిమిది పరుగులే ఇవ్వడంతో గట్టెక్కింది. 2016 ఫైనల్‌లో 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు.. 200/7 స్కోరు చేసింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్లో ఆర్సీబీకి 18 పరుగులు అవసరం కాగా.. భువనేశ్వర్ కుమార్ 9 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.
చివరి ఓవర్‌లో కోల్‌కతా విక్టరీ
2012, 2014 ఫైనల్స్ ఫలితం కూడా చివరి ఓవర్లోనే తేలింది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ కోల్‌కతా నైట్‌రైడర్సే (KKR) విజయం సాధించింది. 2012లో చెన్నై నిర్దేశించిన 190 పరుగుల భారీ లక్ష్యాన్ని కేకేఆర్ 5 వికెట్లు కోల్పోయి రెండు బంతులు మిగిలుండగా ఛేదించింది. 2014లో పంజాబ్‌పై 3 వికెట్ల తేడాతో గెలిచింది. 200 పరుగుల టార్గెట్‌ని 19.3 ఓవర్లలో ఛేదించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ చందాదారులా? అయితే, ఈ విషయం తెలుసా?
-
Niranjan Reddy: పాలమూరు-రంగారెడ్డిపై విపక్షాలది దుష్ప్రచారం: నిరంజన్‌రెడ్డి
-
Simultaneous Polls: ‘జమిలి ఎన్నికల కమిటీ’ తొలి భేటీ.. పార్టీల అభిప్రాయాల సేకరణకు నిర్ణయం
-
Chandra babu arrest: తెలంగాణలో లేని ఆంక్షలు ఏపీలోనే ఎందుకు: నారా లోకేశ్
-
Drugs Case: ఏడేళ్ల క్రితం కాల్ లిస్ట్ ఆధారంగా విచారించారు: సినీనటుడు నవదీప్
-
Keerthy suresh: ముంబయి వీధుల్లో ఆటోరైడ్ చేస్తున్న కీర్తి సురేశ్.. వీడియో వైరల్