Shreyas - Gill: విమర్శలను నిజం చేస్తున్న గిల్‌.. అయ్యర్‌... ఇదే ఆఖరి మ్యాచా?

కీలక స్థానాల్లో బ్యాటింగ్‌కు వస్తూ.. జట్టును ముందుండి నడిపించాల్సిన ఇద్దరు బ్యాటర్లు ఇప్పుడు తమ స్థానాలనే ప్రమాదంలోకి నెట్టుకున్నారు.

Published : 03 Feb 2024 02:16 IST

 

సీనియర్ల స్థానంలో వచ్చారు... సత్తా చాటుతారనుకుంటే... ఒకరేమో పెవిలియన్‌కు వచ్చేద్దామా అన్నట్లు ఆడుతున్నాడు. మరొకరు కాసేపు బాగానే ఆడినా చివరి వరకూ నిలబడలేకపోతున్నాడు. టీమ్‌ ఇండియాను ఫాలో అయ్యేవాళ్లు ఈ ఇద్దరూ శుభ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓవైపు వాళ్ల స్థానాల్లోకి రావడానికి కొత్త కుర్రాళ్లు రెడీగా ఉన్నా... ఆ భయమే గిల్‌ - అయ్యర్‌లో కనిపించడం లేదు. 

ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానె జట్టులో ఉండటంతో మొన్నటివరకూ శ్రేయస్‌ అయ్యర్‌కు (Shreyas Iyer) అవకాశం రాలేదు. ఒకవేళ వచ్చినా ఒకట్రెండు మ్యాచులే. ఆ సీనియర్లు ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడటంతో గిల్, అయ్యర్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. మిడిలార్డర్‌లో జట్టును కాచుకుంటారని ఆశిస్తే తరచూ విఫలం కావడం అభిమానులకు రుచించడం లేదు. దీంతో ‘ఈ టెస్టులో ఆడకపోతే ఇదే ఆఖరు’, ‘మీరు పక్కకు తప్పుకొని కొత్తవాళ్లకు ఛాన్స్‌ ఇవ్వండి’ అని అభిమానులు అనే పరిస్థితి వచ్చింది.

వికెట్ పారేసుకుని...

శ్రేయస్‌ విషయానికొస్తే... ఇంగ్లాండ్‌తో (IND vs ENG) తొలి టెస్టులో 35, 13 పరుగులు చేశాడు. రెండో మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 27 పరుగులు. గత 11 ఇన్నింగ్స్‌ల్లో అతడి నుంచి ఒక్క హాఫ్ సెంచరీ కూడా రాలేదు. ధాటిగా ఆరంభిస్తున్నా... వాటిని అర్ధ శతకాలుగా, సెంచరీలుగా మలచలేకపోతున్నాడు. టెస్టుల్లో అతి ముఖ్యమైన ఓపిక అతనిలో కనిపించడం లేదు. అందుకే వికెట్ పారేసుకుంటున్నాడని మాజీలు విమర్శిస్తున్నారు. 

ఎక్కడా జి‘గిల్‌’

‘మూడో స్థానానికొస్తా... నేనేంటో చూపిస్తా’ అంటూ ఓపెనర్‌ ప్లేస్‌ను వదిలి వన్‌ డౌన్‌కి వచ్చాడు గిల్‌ (Shubman Gill). అలా కిందకొచ్చిన శుభ్‌మన్‌ బ్యాటింగ్‌ ప్రదర్శన ఇంకా కిందకు పడుతూనే ఉంది. గత ఐదు టెస్టుల్లో అతని అత్యధిక స్కోరు 36. తాజాగా వైజాగ్‌ టెస్టులో 34 పరుగులు చేసి జోరు మీద కనిపించి హాఫ్‌ సెంచరీ చేస్తాడన్న అభిమానుల ఆశ నెరవేరలేదు. నిజానికి ఈ మ్యాచ్‌ ముందు కూడా గిల్‌కు అవకాశం ఇవ్వడం అవసరమా? అనే వ్యాఖ్యలు వినిపించాయి.

పేస్‌ పిచ్‌ల మీద ఇబ్బందిపడతాడు... స్పిన్‌ను ఆటాడుకుంటాడన్న శ్రేయస్‌ ఉసూరుమనిపిస్తుంటే... అదే స్పిన్‌కు దాసోహమంటున్నాడు గిల్‌. ఇద్దరు ఇండియన్‌ బ్యాటర్లు ఇలా స్పిన్‌ను ఎదుర్కోలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రెండో ఇన్నింగ్స్‌లో అవకాశం వచ్చి... ఇద్దరూ ఇలానే నిరాశపరిస్తే... ఆ స్థానాలను చేజేతులా కొత్త వాళ్లకు అప్పగించినట్లు అవుతుంది. మరి రాణించి జట్టులో ఉంటారో? లేక బెంచ్‌కే పరిమితమవుతారో చూడాలి.

ఆ ఇద్దరు వీరేనా?

ఫస్ట్‌ డౌన్‌ వద్దు ఓపెనర్‌గా వెళ్తా అని గిల్‌ అనుకుంటే... ఆ స్థానాన్ని ‘వదిలేదే లే’ అని శతకంతో చెప్పకనే చెప్పాడు జైస్వాల్‌. కాబట్టి గిల్‌కు ఆ ప్లేస్‌లో ఛాన్సే లేదు. ఇక అయ్యర్‌ను పక్కన పెడదాం అంటే సర్ఫరాజ్‌ ఖాన్‌ రెడీగా ఉన్నాడు. విశాఖ టెస్టులో దక్కాల్సిన మెయిడెన్‌ క్యాప్‌ రాజ్‌ కోట్‌లో అందుకునే అవకాశం ఉంది. మిగిలిన మూడు టెస్టులకు ఈ వారంలో జట్టును అనౌన్స్‌ చేస్తారు. ఆ జాబితా వస్తే పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. 

- ఇంటర్నెట్ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని