Top 5 Richest leagues: భారత టీ20 లీగ్‌ @ 2.. మిగతా నాలుగేవో తెలుసా?

ప్రపంచంలో ఎన్ని రకాల వినోదాలున్నా క్రీడలకు ఉండే క్రేజ్‌ వేరు. అవి ఏ దేశంలో జరిగినా ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రసార మాధ్యమాల్లో విప్లవాత్మక మార్పులు...

Updated : 16 Jun 2022 14:37 IST

ప్రపంచంలో ఎన్ని రకాల వినోదాలున్నా క్రీడలకు ఉండే క్రేజ్‌ వేరు. ప్రసార మాధ్యమాల్లో విప్లవాత్మక మార్పులు రావడంతో గ్రామీణ ప్రాంతాలకు అవి సులభంగా చేరుతున్నాయి. ఈ క్రమంలో టోర్నీలు/లీగ్‌ రేటింగులు దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో వాటి బ్రాండ్‌ వాల్యూ ఊహకందని రీతిలో పెరిగిపోతోంది. తాజాగా భారత టీ20 లీగ్‌.. ప్రపంచంలోనే రెండో అత్యధిక బ్రాండ్‌ వాల్యూ కలిగిన క్రీడా ఈవెంట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో టాప్‌-5లో ఉన్న మిగతా లీగ్‌ విశేషాలు తెలుసుకుందాం.


నేషనల్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌

(Photo: NFL Twitter)

అమెరికాకు చెందిన నేషనల్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ మొత్తం 32 టీమ్‌లను కలిగి ఉంది. ఇది ఏటా సెప్టెంబర్‌ నుంచి జనవరి వరకు సుమారు 5 నెలల పాటు జరుగుతుంది. ప్రపంచంలోనే అత్యధిక బ్రాండ్‌ వాల్యూ కలిగిన లీగ్‌గా దీనికి పేరుంది. 1920లో తొలుత అమెరికన్‌ ప్రొఫెషనల్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌గా ప్రారంభమైన ఈ లీగ్‌ 1922లో నేషనల్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌గా మారింది. ఈ టోర్నీలో ఒక్కో మ్యాచ్‌కు ప్రస్తుతం ప్రసారదారులు చెల్లించే సొమ్ము అక్షరాల రూ.131.9 కోట్లు. ప్రపంచంలోనే అత్యధిక మంది వీక్షించే క్రీడా ఈవెంట్‌గా ఇది నిలిచింది.


భారత టీ20 లీగ్‌

(Photo: Getty Images)

ఈ జాబితాలో భారత టీ20 లీగ్‌ తాజాగా రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. భారత క్రికెట్‌ బోర్డు నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నడిచే ఈ లీగ్‌ 2008లో ప్రారంభమవ్వగా ఇటీవలే 15 సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 10 జట్లతో కొనసాగుతోన్న ఈ టీ20 లీగ్‌.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్‌ ఈవెంట్‌గా పేరుగాంచింది. ఇక రాబోయే ఐదేళ్లకు తాజాగా నిర్వహించిన ప్రసార హక్కుల వేలంలో బీసీసీఐ ఖజానాకు రూ.48,390 కోట్ల భారీ ఆదాయం దక్కింది. దీంతో ఇది ప్రపంచంలోనే రెండో అత్యధిక బ్రాండ్‌వాల్యూ కలిగిన క్రీడా లీగ్‌గా అవతరించింది. 2023 నుంచి 2027 వరకు ఒక్కో మ్యాచ్‌కు బీసీసీఐకి ప్రసారదారులు చెల్లించే మొత్తం రూ.107.5 కోట్లు.


ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌

(Photo: EPL Twitter)

ఇక అత్యధిక మంది వీక్షించే క్రీడా ఈవెంట్‌గా ఇంగ్లాండ్‌లో జరిగే ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌కు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. 1992లో ప్రారంభమైన ఈ టోర్నీలో మొత్తం 20 క్లబ్‌లు ఆడతాయి. ఏటా ఆగస్టు నుంచి మే వరకు పది నెలల పాటు ఫుట్‌బాల్‌ ప్రియులను తెగ ఆకట్టుకుంటుంది. ఒక్కో టీమ్‌ ఇంటా, బయటా రెండేసిసార్లు ఇతర జట్లతో మొత్తం 38 మ్యాచ్‌ల్లో తలపడతాయి. అయితే, ఇన్నాళ్లూ ఇది రెండో అత్యధిక బ్రాండ్‌ వాల్యూ కలిగిన ఈవెంట్‌గా ఉండేది. తాజాగా భారత టీ20 లీగ్‌ దాన్ని వెనక్కినెట్టి రెండో స్థానాన్ని ఆక్రమించింది. ప్రస్తుతం ఈ లీగ్‌లో ప్రసారదారులు ఒక్కో మ్యాచ్‌కు సుమారు రూ.80 కోట్లు చెల్లిస్తారు. దీంతో ఇది మూడో అత్యధిక ఆదాయం కలిగిన లీగ్‌గా కొనసాగుతోంది.


మేజర్‌ లీగ్‌ బేస్‌బాల్‌

(Photo: MLB Twitter)

అమెరికాలో జరిగే మరో అతిపెద్ద క్రీడా ఈవెంట్‌.. మేజర్‌ లీగ్‌ బేస్‌బాల్‌. ఇందులో మొత్తం 30 జట్లు పోటీపడుతుంటాయి. అందులో 15 జట్లు నేషనల్‌ లీగ్‌ నుంచి, మరో 15 జట్లు అమెరికన్‌ లీగ్‌ నుంచి వస్తాయి. నేషనల్‌ లీగ్‌ అనేది 1876లో ప్రారంభమవ్వగా.. అమెరికన్‌ లీగ్‌ 1901లో ఏర్పాటైంది. అయితే, 1903లోనే ఈ రెండు సంస్థలు నేషనల్‌ అగ్రిమెంట్‌ చేసుకున్నా 2000 సంవత్సరం వరకు లీగల్‌గా వేర్వేరుగానే ఉన్నాయి. ఇది మేజర్‌ లీగ్‌ బేస్‌బాల్‌గా మారినప్పటి నుంచి మంచి ప్రాచుర్యం లభించింది. దీంతో అతిగొప్ప క్రీడా లీగ్‌ల్లో ఒకటిగా ఎదిగింది. ప్రస్తుతం ఈ టోర్నీలో ఒక్కో మ్యాచ్‌కు ప్రసారదారులు చెల్లించే మొత్తం రూ.72.7 కోట్లు. దీంతో ఇది అత్యంత ఖరీదైన నాలుగో బ్రాండ్‌ వాల్యూ కలిగిన క్రీడా లీగ్‌గా నిలిచింది.


బుండెస్‌లిగా

(Photo: Bundesliga Twitter)

ఇక ఈ జాబితాలో ఐదో అత్యంత విలువైన లీగ్‌గా జర్మనీకి చెందిన ప్రొఫెషనల్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ బుండెస్‌లిగా నిలిచింది. 1963లో ప్రారంభమైన ఈ లీగ్‌లో మొత్తం 18 జట్లు పోటీపడతాయి. ఇది కూడా ఏటా ఆగస్టు నుంచి మే వరకు జరుగుతుంది. ఇది యూరప్‌లోనే కాకుండా మిగతా దేశాల్లోనూ మంచి ఆదరణ కలిగిన లీగ్‌గా ఎదిగింది. ఈ టోర్నీలో ఒక్కో మ్యాచ్‌కు ప్రసారదారులు చెల్లించే మొత్తం సుమారు రూ.30 కోట్లు. దీంతో ఇది ఐదో ఖరీదైన లీగ్‌గా పేరుగాంచింది.


- ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని