Virat Kohli: కింగ్‌ కోహ్లీ @ 200 మిలియన్లు.. అతడే తొలి భారతీయుడు

ప్రస్తుత డిజిటల్‌ యుగంలో ప్రతి ఒక్కరూ సామాజిక మాధ్యమాలకు అలవాటుపడ్డారు. ముఖ్యంగా సెలబ్రిటీలు ఏం చేసినా ఇతరులతో పంచుకుంటున్నారు...

Published : 12 Jun 2022 10:22 IST

మరి తర్వాతి స్థానాల్లో ఎవరు?

ప్రస్తుత డిజిటల్‌ యుగంలో ప్రతి ఒక్కరూ సామాజిక మాధ్యమాలకు అలవాటుపడ్డారు. ముఖ్యంగా సెలబ్రిటీలు ఏం చేసినా ఇతరులతో పంచుకుంటున్నారు. దీంతో వారిని అనుసరిస్తున్న అభిమానుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌ను అనుసరించే వారి సంఖ్య తాజాగా 200 మిలియన్లు దాటింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. అయితే, అతడి తర్వాత అత్యధిక ఫాలోవర్లు కలిగిన భారత క్రీడాకారులతో పాటు టాప్‌ సెలబ్రిటీలు ఎవరో తెలుసుకుందాం..

* విరాట్‌ కోహ్లీ: విరాట్‌ కోహ్లీ ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రపంచంలోనే అత్యధిక మంది ఫాలో అవుతున్న క్రికెటర్‌గా నిలిచాడు. గత బుధవారం అతడిని అనుసరిస్తున్న వారి సంఖ్య 200 మిలియన్‌ మార్క్‌ చేరింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌, తొలి భారతీయుడిగా నిలిచాడు. అతడు మాత్రం 245 మందినే ఫాలో అవుతున్నాడు. ఇక క్రీడల్లో అత్యధిక మంది ఫాలోవర్లు కలిగిన ప్రముఖుల్లో క్రిస్టియానో రొనాల్డో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచాడు. అతడిని ప్రస్తుతం 453 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. లియోనెల్‌ మెస్సీ 336 మిలియన్లతో తర్వాతి స్థానంలో ఉన్నాడు.

* మహేంద్రసింగ్‌ ధోనీ: భారత క్రీడాకారుల్లో కోహ్లీ తర్వాత అత్యధిక మంది ఫాలో అవుతున్న ఆటగాడు టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ. అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనా అభిమానుల్లో ఏ మాత్రం క్రేజ్‌ తగ్గలేదు. మరోవైపు మిగతా ప్రముఖులతో పోలిస్తే ధోనీ సామాజిక మాధ్యమాల వినియోగం కూడా తక్కువే. అయినా, ప్రస్తుతం ఆయనను అనుసరిస్తున్న అభిమానుల సంఖ్య 38.6 మిలియన్లుగా ఉంది. అయితే, మహీ మాత్రం కేవలం నలుగురినే ఫాలో అవుతున్నాడు.

* సచిన్‌ తెందూల్కర్‌: ‘గాడ్‌ ఆఫ్‌ క్రికెట్‌’గా పేరొందిన బ్యాటింగ్‌ లెజెండ్‌ సచిన్‌ తెందూల్కర్‌ భారత క్రీడా ప్రముఖుల్లో అత్యధిక మంది ఫాలో అవుతున్న మూడో ఆటగాడిగా నిలిచాడు. ఆయనను ఇప్పుడు ఇన్‌స్టాలో అనుసరిస్తున్న అభిమానుల సంఖ్య 34.7 మిలియన్లుగా ఉంది. క్రికెట్‌కు దూరమై చాలా కాలమైనా ఇప్పటికీ మిగతా క్రికెటర్లతో పోలిస్తే మంచి ఫాలోయింగ్‌నే సొంతం చేసుకున్నాడు. సచిన్‌ అనుసరిస్తున్న వారి సంఖ్య 30గా ఉంది.

* రోహిత్‌ శర్మ: ప్రస్తుత టీమ్‌ఇండియా సారథి రోహిత్‌ శర్మకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. అయినా, ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. భారత క్రీడా ప్రముఖుల్లో సచిన్‌ తర్వాత అత్యధిక మంది ఫాలో అవుతున్న ఆటగాడిగా కొనసాగుతున్నాడు. రోహిత్‌ను ఇప్పుడు 24.1 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. అయితే, అతడు 122 మందిని ఫాలో అవుతున్నాడు.

* హార్దిక్‌ పాండ్య: ఇటీవల భారత టీ20 లీగ్ 15వ సీజన్‌లో గుజరాత్‌ లాంటి కొత్త జట్టును ఛాంపియన్‌గా నిలిపిన హార్దిక్‌ పాండ్యకు సైతం ఇన్‌స్టాలో మంచి ఫాలోయింగ్‌ ఉంది. అతడిని ప్రస్తుతం 21.38 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. దీంతో రోహిత్‌ తర్వాత అత్యధిక మంది అనుసరిస్తున్న భారత క్రీడాకారుడిగా కొనసాగుతున్నాడు. హార్దిక్‌ 359 మందిని ఫాలో అవుతున్నాడు.

* సురేశ్‌ రైనా: ఇక సురేశ్‌ రైనా టీమ్‌ఇండియాకు దూరమైనా ప్రత్యేకమైన అభిమాన గణం ఉంది. ఆయనెప్పుడూ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటాడు. బయట తానేం చేసినా నిత్యం అభిమానులతో పంచుకుంటాడు. దీంతో ఇన్‌స్టాలో రైనాను అనుసరించేవారి సంఖ్య 20.2 మిలియన్లకు చేరింది. పాండ్య తర్వాత అత్యధిక మంది ఫాలో అవుతున్న క్రీడా ప్రముఖుడిగా కొనసాగుతున్నాడు.

కోహ్లీ తర్వాత టాప్‌ 9 ప్రముఖులు..

* ప్రియాంక చోప్రా: ఇక భారత్‌లో రెండో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ప్రముఖుల్లో బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా నిలిచారు. కోహ్లీ తర్వాత ఆమె 79.3 మిలియన్ల మంది అభిమానులతో రెండో స్థానంలో ఉన్నారు. ప్రియాంక ప్రస్తుతం 696 మందిని అనుసరిస్తున్నారు.

* శ్రద్ధా కపూర్‌: మరో బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ మూడో అత్యధిక ఫాలోవర్లు కలిగిన భారత సెలబ్రిటీగా నిలిచారు. 73 మిలియన్ల మంది అభిమానులు ఆమెను అనుసరిస్తున్నారు. శ్రద్ధా అనుసరిస్తున్న వారి సంఖ్య 871.

* నేహా కక్కర్‌: బాలీవుడ్‌ సింగర్‌ నేహా కక్కర్‌కు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. ప్రస్తుతం ఆమె 70.2 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్నారు. దీంతో భారత్‌లో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. ఆమె అనుసరిస్తున్న వారి సంఖ్య 253.

* నరేంద్ర మోదీ: భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఆయనను అనుసరిస్తోన్న వారి సంఖ్య 67.8 మిలియన్లు. భారత రాజకీయ నాయకులలో అత్యధిక మంది ఫాలో అవుతున్న అగ్ర నాయకుడు మోదీనే. అయితే, ఆయన మాత్రం ఎవరినీ ఫాలో కావటం లేదు.

* దీపికా పదుకొణె: బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె ప్రస్తుతం ఈ జాబితాలో ఆరో అత్యధిక ఫాలోవర్లు కలిగిన సెలబ్రిటీగా నిలిచారు. ఆమెను ఇప్పుడు 67.3 మిలియన్ల మంది అభిమానులు అనుసరిస్తున్నారు. కాగా, దీపిక 183 మందిని ఫాలో అవుతున్నారు.

* అలియా భట్‌: ఏడో స్థానంలో కూడా బాలీవుడ్‌ హీరోయినే ఉన్నారు. యువ కథానాయిక ఆలియా భట్‌ను ఫాలో అవుతున్న వారి సంఖ్య 66.3 మిలియన్లు. ఆమె 482 మందిని అనుసరిస్తున్నారు.

* కత్రినా కైఫ్‌: కత్రినా కైఫ్‌ ఎనిమిదో స్థానంలో ఉన్నారు. ఆమెను ఇప్పుడు ఇన్‌స్టాలో 65.1 మిలియన్ల మంది అభిమానులు ఫాలో అవుతున్నారు. కత్రినా 497 మందిని అనుసరిస్తున్నారు.

* అక్షయ్‌ కుమార్‌: బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నారు. ఆయనను ప్రస్తుతం అనుసరిస్తున్న అభిమానుల సంఖ్య 62.3 మిలియన్లుగా ఉంది. ఆయన మాత్రం కేవలం ఐదు మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు.

* జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌: మరో బాలీవుడ్‌ భామ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ పదో స్థానంలో ఉన్నారు. ఆమెను ప్రస్తుతం 61.5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. అలాగే అత్యధిక మందిని ఫాలో అవుతున్న సెలబ్రిటీగానూ కొనసాగుతున్నారు. జక్వెలిన్‌ 1,192 మందిని అనుసరిస్తున్నారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని