Foreign Players: కొందరు హిట్‌.. కొందరు ఫట్‌..!

ఏటా భారత టీ20 లీగ్‌ జరుగుతుందంటే ఎక్కువగా ఆసక్తి కొలిపే విషయం విదేశీ ఆటగాళ్లలో ఎవరెక్కువ ధరకు అమ్ముడుపోయారనేది...

Updated : 31 May 2022 18:33 IST

భారీ ధర దక్కించుకున్న విదేశీయుల్లో ఎవరెలా ఆడారంటే..?

ఏటా భారత్‌లో టీ20 లీగ్‌ జరుగుతుందంటే ఎక్కువగా ఆసక్తి కొలిపే విషయం విదేశీ ఆటగాళ్లలో ఎవరెక్కువ ధరకు అమ్ముడుపోయారనేది. ఈసారి కూడా పలు ఫ్రాంఛైజీలు కొందరు ఆటగాళ్లని ఊహించని ధరకు కొనుగోలు చేశాయి. అందులో కొందరు తాము తీసుకున్న ధరకు న్యాయం చేస్తూ హిట్టవ్వగా.. మరికొందరు ఫట్టయ్యారు. వారు ఎవరో.. ఎలాంటి ప్రదర్శన చేశారో చూద్దాం..

* సిక్సర్లతో అలరించిన లివింగ్‌స్టోన్‌‌..

(Photo: Liam Livingstone Instagram)

విదేశీ ఆటగాళ్లలో ఈసారి అత్యధిక ధరకు అమ్ముడుపోయింది ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ లియామ్‌ లివింగ్‌స్టోన్‌. అతడిని పంజాబ్‌ మెగా వేలంలో రూ.11.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ జట్టు నమ్మకాన్ని కాపాడుకున్న అతడు 14 మ్యాచ్‌ల్లో 437 పరుగులు చేశాడు. 182.08 అదిరిపోయే స్ట్రైక్‌రేట్‌తో 36.42 సగటు సాధించాడు. అందులో 34 సిక్సర్లు కూడా దంచికొట్టాడు. అత్యధిక పరుగుల వీరుడు జోస్‌ బట్లర్‌ (45) తర్వాత లివింగ్‌స్టోనే ఎక్కువ సిక్సర్లు సంధించాడు.

* వికెట్ల పండగ చేసుకున్న హసరంగ..

(Photo: Wanindu Hasaranga Instagram)

ఇక రెండో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడు వానిండు హసరంగ. బెంగళూరు మెగా వేలంలో అతడిని రూ.10.75 కోట్లకు దక్కించుకుంది. దీంతో అంచనాలకు తగ్గట్టే రాణించాడు ఈ శ్రీలంక స్పిన్‌ ఆల్‌రౌండర్‌‌. బ్యాట్‌తో మెరవకపోయినా బౌలింగ్‌లో అదరగొట్టాడు. మొత్తం 16 మ్యాచ్‌ల్లో 26 వికెట్లు తీసి రెండో అత్యధిక వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. బెంగళూరు క్వాలిఫయర్-2లో ఓడిపోయింది కానీ, ఫైనల్‌ చేరి ఉంటే హసరంగ రాజస్థాన్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ (27)ను అధిగమించే అవకాశం ఉండింది.

* దంచికొట్టలేకపోయిన నికోలస్‌ పూరన్‌..

(Photo: Nicholas Pooran Instagram)

అవకాశం దొరికితే చెలరేగిపోయే విండీస్ వికెట్ కీపర్, హిట్టర్ నికోలస్‌ పూరన్ ఈసారి మెగా వేలంలో రూ.10.75 కోట్లకు అమ్ముడుపోయాడు. హైదరాబాద్‌ టీమ్ అతడిపై భారీ అంచనాలు పెట్టుకొని నిరాశపడింది. ఈ సీజన్‌లో మొత్తం 14 మ్యాచ్‌ల్లో ఆడిన అతడు 306 పరుగులే చేశాడు. 144.33 స్ట్రైక్‌రేట్‌, సగటు 38.25 బాగున్నా అతడు తీసుకునే సొమ్ముకు న్యాయం చేయలేదు. కేవలం రెండు మూడు ఇన్నింగ్స్‌ల్లో రాణించడానికే పరిమితమయ్యాడు.

* పెద్దగా రాణించని ఫెర్గూసన్‌..

(Photo: Lockie Ferguson Instagram)

న్యూజిలాండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ లాకీ ఫెర్గూసన్‌ సైతం ఈ సీజన్‌ మెగా వేలంలో రూ.10 కోట్ల అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు. ఛాంపియన్‌ గుజరాత్‌ టీమ్‌ అతడిని కొనుగోలు చేసింది. అయితే, అతడు బౌలింగ్ పరంగా కొన్ని మ్యాచ్‌ల్లో ఆకట్టుకున్నా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. కానీ, ఫైనల్లో 157.03 కిమీ వేగంతో బౌలింగ్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. మొత్తం అతడు 13 మ్యాచ్‌లు ఆడి 12 వికెట్లే తీసి సాదాసీదా బౌలర్‌లా అనిపించాడు. ఎకానమీ సైతం 8.95 ఏమంత గొప్పగా లేదు.

* రబాడ ప్రత్యర్థులకు దడదడ..

(Photo: Kagiso Rabada Instagram)

ఎప్పటిలాగే దక్షిణాఫ్రికా పేసర్‌ రబాడ చెలరేగిపోయాడు. పంజాబ్‌ జట్టు అతడిని మెగా వేలంలో రూ.9.25 కోట్ల ధరకు కొనుగోలు చేసింది. ఆ జట్టు నమ్మకాన్ని నిలబెట్టుకున్న అతడు మరోసారి తన సత్తా చాటాడు. ఈ సీజ్‌లో మొత్తం 13 మ్యాచ్‌ల్లో 23 వికెట్లు తీసి అత్యధిక వికెట్ల బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. దీంతో అతడికి దక్కిన సొమ్ముకు రబాడ న్యాయం చేశాడు. కానీ, పంజాబ్‌ లీగ్‌ దశకే పరిమితమవ్వడం విచారకరం.

* హోల్డర్‌ బౌలింగ్‌లో ఓకే..

(Photo: Jason Holder Instagram)

వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ జేసన్‌ హోల్డర్‌ ఈ సీజన్‌లో లఖ్‌నవూ జట్టుకు ఆడాడు. అతడిని వేలంలో రూ.8.75 కోట్లకు ఆ జట్టు కొనుగోలు చేసింది. అయితే, డెత్‌ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్‌ చేస్తూ, లోయర్‌ ఆర్డర్‌లో హిట్టింగ్‌ చేసే సత్తా ఉన్న అతడు ఈ సీజన్‌లో చెప్పుకునే స్థాయిలో రాణించలేదు. బంతితో 12 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసి అంతంతమాత్రంగానే రాణించాడు. ఇక బ్యాటింగ్‌లో 8 ఇన్నింగ్స్‌లు ఆడినా కేవలం 58 పరుగులే చేసి పూర్తిగా నిరాశపరిచాడు.

* హెట్‌మెయర్‌ కూడా మెరవలేదు..

(Photo: Shimron Hetmyer Instagram)

రాజస్థాన్‌ హిట్‌మ్యాన్‌గా చెలరేగుతాడని ఆశించిన షిమ్రన్‌ హెట్‌మెయర్‌ ఈసారి ఏమాత్రం ఆకట్టుకోలేదు. మెగా వేలంలో ఆ జట్టు అతడిని రూ. 8.5 కోట్లకు కొనుగోలు చేసినా కేవలం ఒకే ఒక్క ఇన్నింగ్స్‌లో మాత్రమే అలరించాడు. 15 మ్యాచ్‌ల్లో 314 పరుగులే చేసిన అతడు సగటు 44.86, స్ట్రైక్‌రేట్‌లో 153.92 మాత్రం ఫర్వాలేదనిపించాడు. అయితే, అతడు తీసుకునే సొమ్ముకు న్యాయం చేయలేకపోయాడు.

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని