Rohit - Hardik: రోహిత్-హార్దిక్‌ విషయంలో సెలక్టర్లకు కఠిన సవాల్ తప్పదు: నెహ్రా

వన్డే ప్రపంచ కప్‌ తర్వాత తొలిసారి విదేశీ పర్యటనకు భారత్‌ (IND vs SA) సిద్ధమవుతోంది. దాదాపు నెలరోజులపాటు ఈ పర్యటన కొనసాగనుంది. 

Updated : 07 Dec 2023 12:20 IST

ఇంటర్నెట్ డెస్క్: డిసెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్న దక్షిణాఫ్రికా పర్యటనకు భారత్ (IND vs SA) జట్లను బీసీసీఐ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు పరిమిత ఓవర్ల క్రికెట్‌ నుంచి కాస్త విరామం ఇచ్చింది. టెస్టు సిరీస్‌కు మాత్రం ఎంపిక చేసింది. హార్దిక్‌ పాండ్య గాయం నుంచి కోలుకుంటున్న తరుణంలో అతడికి విశ్రాంతినిస్తూ ఈ పర్యటనకు ఎంపిక చేయలేదు. టీ20 సిరీస్‌కు సూర్యకుమార్‌, వన్డేలకు కేఎల్ రాహుల్‌, టెస్టు సిరీస్‌కు రోహిత్ శర్మను కెప్టెన్లుగా నియమించింది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ఇప్పుడీ సిరీస్‌లో లేకపోవడంతో జట్టుకు నష్టం చేకూరే అవకాశం ఉందని భారత మాజీ పేసర్ ఆశిశ్ నెహ్రా అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ను హార్దిక్‌ వీడిన తర్వాత తొలిసారి నెహ్రా స్పందించాడు.

‘‘భారత జట్టు సారథ్య బాధ్యతలను రోహిత్ శర్మ నుంచి హార్దిక్‌కు అప్పగించేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పుడే దాని గురించి మాట్లాడలేను. సెలక్టర్లకూ కఠిన పరీక్ష తప్పదని అనిపిస్తోంది. ప్రస్తుతం హార్దిక్ గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఎప్పుడు తిరిగి వస్తాడనేది తెలియదు. ఒకవేళ పాండ్య నేరుగా ఐపీఎల్‌లోనే ఆడితే మాత్రం.. భారత సెలక్షన్ కమిటీకి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని టీ20 వరల్డ్ కప్‌లో ఆడించాలని మద్దతుగా నిలిచే వారూ ఉన్నారు. ఒకవేళ వారిద్దరూ ఫిట్‌గా ఉంటే మాత్రం ఫామ్‌ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా టీ20 ప్రపంచకప్‌లో వారిని చూసే అవకాశం ఉంటుంది’’ అని నెహ్రా తెలిపాడు. 

ఐపీఎల్‌లో రాణిస్తే.. వరల్డ్‌ కప్‌లో షమీకి ఛాన్స్‌

దక్షిణాఫ్రికా పర్యటనలో షమీని కేవలం టెస్టు సిరీస్‌కు మాత్రం ఎంపిక చేశారు. అదీనూ ఫిట్‌నెస్‌ నిరూపించుకుంటేనే జట్టులోకి వస్తాడు. వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా షమీ నిలిచిన సంగతి తెలిసిందే. అద్భుత ఫామ్‌లో ఉన్న షమీని వచ్చేఏడాది పొట్టి కప్‌లోనూ ఆడించాలనే డిమాండ్లూ వస్తున్నాయి. అయితే, వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో అతడి ప్రదర్శననుబట్టి టీ20 ప్రపంచకప్‌లో ఆడతాడని క్రికెట్‌ వర్గాలు వెల్లడించాయి. 

‘‘వచ్చే ఏడాది ఎక్కువగా భారత్ తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడే అవకాశం లేదు. అయితే, టెస్టులు ఆడతాడు. ఇంగ్లాండ్‌తో ఐదు, దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల్లో తలపడొచ్చు. షమీ వచ్చే ఏడాది పొట్టి  కప్‌లో ఆడాలని భావిస్తే మాత్రం ఐపీఎల్‌లో అతడి ప్రదర్శన బాగుండాలి. గత రెండు సీజన్లలో గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున షమీ టాప్‌ వికెట్‌ టేకర్‌. మరోసారి అలాంటి ప్రదర్శన పునరావృతమైతే తప్పకుండా వరల్డ్‌ కప్‌లో ఆడతాడు’’ అని ఓ మీడియా కథనం పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని