IPL 2024: పేరుకు ‘అన్‌క్యాప్‌డ్‌’ ప్లేయర్లే.. కానీ, వేలంలో టాపర్లే!

వీరెవరూ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించలేదు. కానీ, ఐపీఎల్‌ వేలంలో మాత్రం భారీగానే ధరను దక్కించుకున్నారు.

Updated : 22 Dec 2023 13:42 IST

ఒకరు.. అమ్మ కలను నెరవేరుద్దామని క్రికెట్‌లో అడుగు పెట్టారు.. 

మరొకరు.. పాన్‌ స్టాల్‌ను నడిపే నాన్న కష్టాన్ని చూస్తూ పెరిగారు.. 

ఇంకొకరు.. తండ్రి అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు వెన్నాడినా పట్టు వదలని క్రికెటర్.. 

స్నేహితుడి సాయంతో కెరీర్‌లో దూసుకొచ్చిన ప్లేయరొకరు.. 

ఇలా ప్రతి క్రికెటర్‌ వెనుక చెప్పలేని కన్నీటి వ్యథలెన్నో.. అయితే, వాటన్నింటినీ అధిగమించి సత్తా చాటితే కాసుల వర్షం కురుస్తోందని నిరూపించారు. అలాంటి ఆటగాళ్లందరికి ఐపీఎల్‌ 2024 వేలం వరంగా మారింది. కుటుంబం పడిన శ్రమకు తగ్గ ఫలితం అందుకొనే సమయం ఆసన్నమైంది. జాతీయ జట్టులోకి రాకుండానే.. దేశవాళీ ప్రదర్శనతో భారీ మొత్తం దక్కించుకున్న వారూ ఉన్నారు. వీరిలో ఒకరిద్దరు ఐపీఎల్‌లో ఆడిన అనుభవం కలిగిన వారు ఉన్నప్పటికీ.. వీరంతా ‘అన్‌క్యాప్‌డ్‌ కాస్ట్‌లీ ప్లేయర్లే’. 


అంకుల్‌ కోచింగ్‌లో రాటుదేలి.. 

చెన్నై సూపర్‌ కింగ్స్‌ కొత్త కుర్రాళ్లపై ఎక్కువగా వెచ్చించదు. తక్కువ మొత్తానికే తీసుకుని వారిని తీర్చిదిద్దుతుంది. అలాంటి ఫ్రాంచైజీ 20 ఏళ్ల సమీర్‌ రిజ్వీపై రూ. 8.40 కోట్లు పెట్టడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. మరి ఇతనిలో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది. ఎందుకంటే ప్రతి దానిని లెక్కగట్టే ఎంఎస్ ధోనీ సారథ్యంలోని సీఎస్‌కేలో అడుగు పెడితే స్టార్‌ క్రికెటర్‌గా మారడం ఖాయం. 17 ఏళ్ల వయసులోనే (2020లో) అండర్ -19 జట్టులోకి వచ్చిన రిజ్వీ తన సత్తా ఏంటో చూపించాడు. తన అంకుల్‌ తన్కీబ్‌ అక్తర్‌ కోచింగ్‌లోనే తొలుత రాటుదేలాడు. సమీర్‌ తండ్రి హసీన్‌ రిజ్వి ఓ ప్రాపర్టీ డీలర్‌. తల్లి రుక్సానా రిజ్వి గృహిణి. ఇటీవల జరిగిన యూపీ టీ20 లీగ్‌లో సమీర్‌ రిజ్వీ కేవలం 9 ఇన్నింగ్స్‌ల్లోనే 455 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. 


హార్డ్‌ హిట్టింగ్‌ అనుభవం..

ఐపీఎల్‌లో ఆడిన అనుభవం ఉన్న షారుఖ్‌ ఖాన్‌కు డిమాండ్ వస్తుందని అంతా అంచనా వేశారు. మిడిలార్డర్‌లో భారీ హిట్టింగ్‌ చేసే షారుఖ్‌ ప్రదర్శన మెరుగ్గానే ఉంది. గత ఐపీఎల్‌ సీజన్‌లో పెద్దగా పరుగులు చేయలేకపోయినప్పటికీ.. ఇటీవల తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లో అదరగొట్టాడు. బౌలింగ్‌ చేయడమూ అతడికి ప్లస్‌పాయింట్‌. రిటెన్షన్‌/రిలీజ్‌ ప్రక్రియలో పంజాబ్‌ కింగ్స్‌ అతడిని వదిలేసుకుంది. ఇప్పుడు వేలంలో గుజరాత్‌ టైటాన్స్‌ రూ. 7.4 కోట్లకు దక్కించుకుంది. తమిళనాడు లీగ్‌లో బ్యాటింగ్‌లో పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ, బౌలింగ్‌లో 9 మ్యాచుల్లో 17 వికెట్లు తీసి టాపర్‌గా నిలిచాడు. తమిళనాడుకు చెందిన షారుఖ్‌ ఖాన్‌ తల్లిదండ్రులు మసూద్‌ ఖాన్‌, లుబ్నా ఖాన్‌. 


పాక్‌ దిగ్గజం రికార్డును బద్దలు కొట్టి..

పన్నెండేళ్ల వయసులో వినూ మన్కడ్‌ ట్రోఫీలోకి అడుగు పెట్టిన యువ క్రికెటర్ కుమార్‌ కుశాగ్రాపై ఈసారి ఐపీఎల్‌ వేలంలో కాసుల వర్షం కురిసింది. 2019లో కేవలం 15 ఏళ్లకే అండర్‌ -19 జట్టులోకి వచ్చాడు. ఇక 17ఏళ్ల వయసులో రంజీ ట్రోఫీలో 266 పరుగుల ఇన్నింగ్స్‌ ఆడాడు. దీంతో అతిపిన్న వయస్సులో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 250+స్కోరు చేసిన ఆటగాడిగా పాక్‌ దిగ్గజం జావెద్ మియాందాద్‌ రికార్డును ఈ ఝార్ఖండ్‌ వికెట్‌ కీపర్‌ బద్దలు కొట్టాడు. క్రికెట్‌లోని టెక్నిక్స్‌ను తన కొడుకు నేర్చుకొనేందుకు పుస్తకాలతో కూడిన లైబ్రరీని కుశాగ్రా తండ్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం విశేషం. దాదాపు 60 నుంచి 70 షాట్లతో కూడిన జాబితాను తయారు చేసి.. ప్రతి రోజూ కుమార్‌ కుశాగ్రాతో ప్రాక్టీస్‌ చేయించేవాడట. కుమార్‌ తండ్రి శ్రీకాంత్ కుశాగ్రా జీఎస్టీ శాఖలో జిల్లా కమిషనర్‌. 


దిగువ మధ్య తరగతి నుంచి.. 

నాగ్‌పుర్‌కు చెందిన శుభమ్‌ దూబె దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టాడు. తండ్రి బద్రీప్రసాద్‌ దూబె పాన్‌ షాప్‌ను నిర్వహించేవాడు. కుటుంబం పెద్దది కావడంతో ఆ సంపాదన ఏమాత్రం సరిపోయేది కాదు. అయినా సరే క్రికెటర్ కావాలనే కాంక్ష మాత్రం తగ్గించుకోలేదు. విదర్భ మాజీ ఆటగాడు సుదీప్‌ జైస్వాల్‌ పరిచయం కావడం దూబె కెరీర్‌ను మలుపు తిప్పింది. శుభమ్‌ను ఎంతో ప్రోత్సహించిన సుదీప్‌ అతడి పరిస్థితిని చూసి కిట్‌తోపాటు ఆర్థిక సాయం అందించాడు. అలాగే ఓ క్లబ్‌కు చెందిన న్యాయవాది కూడా సహకారం అందించాడని పలు సందర్భాల్లో శుభమ్‌ వెల్లడించాడు. సయ్యద్ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శనతో ఫ్రాంచైజీలు అతడివైపు మొగ్గుచూపాయి. మరీముఖ్యంగా ఆ టోర్నీలోనే భారీ లక్ష్య ఛేదనలో (290 పరుగులు) కేవలం 20 బంతుల్లోనే 58 పరుగులు చేసి బెంగాల్‌పై విదర్భ జట్టును గెలిపించాడు. ఈ క్రమంలో 18 బంతుల్లోనే వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించాడు.


ఆ ఐదు సిక్స్‌ల నుంచి బయటపడాలి..

గత సీజన్‌లో కోల్‌కతా బ్యాటర్ రింకు సింగ్‌ బ్యాట్‌ నుంచి ఒకే ఓవర్‌లో ఐదు సిక్స్‌లు వచ్చిన మ్యాచ్‌ గుర్తుంది కదా.. ఆ బౌలర్‌ యశ్‌ దయాల్‌. అప్పుడు గుజరాత్‌కు ఆడిన యశ్‌కు ఆ ఓవర్‌ మాత్రం పీడకలగా మిగిలిపోయింది. అలాంటి ఆటగాడిని ఈ వేలంలో ఎవరు కొంటారని? చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ, రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఏకంగా రూ. 5 కోట్లను వెచ్చించి దక్కించుకోవడం గమనార్హం. కోల్‌కతాపై ఐదు సిక్స్‌లు ఇచ్చిన తర్వాత యశ్‌ దయాల్‌ ఆరోగ్యం కూడా దెబ్బతిన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. మానసికంగా ఇబ్బంది పడ్డాడని జట్టులోని సహచరులూ చెప్పారు. అయితే, వచ్చే సీజన్‌ను తాజాగా ప్రారంభించాల్సిన అవసరం ఉంది. తన తల్లి కలను నిజం చేసేందుకు క్రికెటర్‌గా మారినట్లు యశ్‌ పలు సందర్భాల్లో వెల్లడించాడు.


రిటైర్డ్‌ ఆర్మీమ్యాన్‌ కుమారుడు.. 

ఝార్ఖండ్‌కు చెందిన రాబిన్‌ మింజ్‌కు ఈ మొత్తం దక్కడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ముంబయి, ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌, గుజరాత్ టైటాన్స్‌ పోటీపడటం గమనార్హం. చివరికి గుజరాత్‌ రూ. 3.6 కోట్లతో దక్కించుకుంది. ఝార్ఖండ్‌ సీనియర్‌ జట్టు తరఫున ఒక్క మ్యాచ్‌ ఆడకపోయినా ఈ 21 ఏళ్ల ప్లేయర్‌పై గుజరాత్‌ గురి పెట్టింది. అండర్‌ -19 జట్టులో (2021లో) ముంబయి ఇండియన్స్‌తో యూకేకు వెళ్లిన మింజ్‌ అక్కడ మంచి ప్రదర్శన చేశాడు. భారీగా హిట్టింగ్‌ చేసే మింజ్‌ ఝార్ఖండ్‌ తరఫున అండర్ -19 టోర్నీల్లో కేవలం ఐదు మ్యాచుల్లోనే మూడు సెంచరీలు బాదాడు. అయితే, అనారోగ్యం కారణంగా ఆటకు కాస్త దూరమైన మింజ్‌.. తిరిగి కోలుకుని వచ్చాక ఇప్పుడు ఐపీఎల్‌ వేలంలో మెరిశాడు. ఎంఎస్ ధోనీ చిన్ననాటి కోచ్‌ చంచల్‌ భట్టాచార్య వద్దనే క్రికెట్‌ పాఠాలను మింజ్‌ నేర్చుకున్నాడు. 


ఐపీఎల్‌లో ఉన్నా.. ఒక్క మ్యాచ్‌ ఆడలేదు..

తమిళనాడుకు చెందిన మణిమారన్‌ సిద్ధార్థ్ 2020లోనే ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పుడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ, ఒక్క మ్యాచ్‌ ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాత దిల్లీ క్యాపిటల్స్ కూడా ఇదే మొత్తం వద్ద దక్కించుకుంది. అక్కడా సిద్ధార్థ్‌కు నిరాశే ఎదురైంది. ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేకపోయాడు. తాజాగా అతడి కోసం బెంగళూరు, లఖ్‌నవూ పోటీపడ్డాయి. చివరికి లఖ్‌నవూ రూ. 2.4 కోట్లతో సిద్ధార్థ్‌ను సొంతం చేసుకుంది. తమిళనాడు తరఫున ఇటీవల దేశీయ క్రికెట్‌లో కేవలం ఏడు టీ20 మ్యాచుల్లోనే 18 వికెట్లు తీశాడు. అందులో నాలుగు వికెట్ల ప్రదర్శన మూడు సార్లు చేయడం విశేషం.


ఇంతకుమించిన ఆనందం ఉంటుందా..?

కుమారుడి భవిష్యత్తు కోసం చేస్తున్న ఉద్యోగం, ఊరును వదిలి వేరే ప్రాంతానికి వెళ్లడానికి ఏ తండ్రైనా కాస్త ఆలోచిస్తాడు. కానీ, సుశాంత్‌ మిశ్రా తండ్రి సమీర్‌ మిశ్రా మాత్రం కొడుకు భవిష్యత్తు కోసం ముందడుగు వేశారు. సుశాంత్‌ శిక్షణ తరగతుల కోసం చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. తల్లిదండ్రుల కష్టానికి తోడు తానుపడిన శ్రమకు ఫలితం దక్కింది. గుజరాత్ టైటాన్స్‌ రూ. 2.2 కోట్లకు సొంతం చేసుకుంది. 2021లో లిస్ట్‌ ఏ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన సుశాంత్‌ గతంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు నెట్‌ బౌలర్‌గానూ సేవలందించాడు. ఎడమచేతివాటం మీడియం పేసర్‌ అయిన సుశాంత్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో కేవలం 7 మ్యాచుల్లోనే 20 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో 4 మ్యాచ్‌లకుగాను 7 వికెట్లు తీశాడు. గతేడాది సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎంపికైనప్పటికీ ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం రాలేదు. 


ఈ ఆల్‌రౌండర్‌.. మ్యాచ్‌ విన్నరే

అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్ల జాబితాలో సుమిత్ కుమార్‌కు భారీ ధర వస్తుందని చాలా మంది క్రికెట్ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ, దిల్లీ క్యాపిటల్స్‌ రూ. కోటికే దక్కించుకుంది. ఆల్‌రౌండర్‌ అయిన సుమిత్‌ కుమార్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌లో జట్టును గెలిపించగల సత్తా ఉన్న ఆటగాడు. లోయర్‌ ఆర్డర్‌లో దూకుడుగా పరుగులు చేస్తాడనే పేరుంది. ఆలస్యంగా (2019లో) ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన సుమిత్ 9 మ్యాచుల్లో 492 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ 10 వికెట్లు తీశాడు. గతేడాది విజయ్ హజారే ట్రోఫీలో పది మ్యాచుల్లో 18 వికెట్లు తీసి రెండో టాపర్‌గా నిలిచాడు.

-ఇంటర్నెట్ డెస్క్‌ ప్రత్యేకం..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని