IND vs NZ: వారిది బలమైన జట్టే.. కానీ, మా ప్రణాళికలు మాకున్నాయి: రోహిత్, విరాట్

ధర్మశాల వేదికగా మరో అద్భుతమైన మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. వన్డే ప్రపంచకప్‌లో భారత్-న్యూజిలాండ్ (IND vs NZ) జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది.

Updated : 22 Oct 2023 12:05 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచకప్ చరిత్రలో (ODI World Cup 2023) ఇప్పటివరకు భారత్ - న్యూజిలాండ్‌ (IND vs NZ) జట్లు 8 సార్లు తలపడ్డాయి. ఐదు మ్యాచుల్లో కివీస్‌ విజయం సాధించగా.. టీమ్‌ఇండియా మూడింటితో సరిపెట్టుకుంది. గత వరల్డ్‌ కప్‌ సెమీస్‌లో కివీస్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరోసారి ఈ వరల్డ్‌ కప్‌లోనూ ఇరుజట్ల మధ్య ధర్మశాల వేదికగా మ్యాచ్‌ జరగనుంది. న్యూజిలాండ్‌ అద్భుత విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అలాంటి జట్టుతో తలపడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని.. నిలకడైన ఆటతీరును ప్రదర్శించడం వల్లే న్యూజిలాండ్‌ సక్సెస్‌ అవుతోందని భారత స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. కివీస్‌తో మ్యాచ్‌పై భారత సారథి రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘‘ప్రొఫెషనల్‌ క్రికెట్ ఆడటంలో న్యూజిలాండ్‌ జట్టు ముందుంటుంది. అన్ని విభాగాల్లోనూ పటిష్ఠంగా ఉంది. నిలకడైన ఆటతీరును ప్రదర్శించడంతోనే కివీస్‌ సక్సెస్‌ అవుతోంది. ఇలాంటి జట్టుతో ఆడేటప్పుడు వారి లయను దెబ్బ తీయడానికి తీవ్రంగా శ్రమించాలి. పూర్తిస్థాయి నైపుణ్యాలను వినియోగించి ఆడితేనే విజయం సాధించేందుకు అవకాశాలు వస్తాయి. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదు. ఏ చిన్న అవకాశం దొరికినా ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెడతారు.  అదే కివీస్‌ విజయరహస్యం.. కానీ, జట్టుపరంగా మేం అన్ని విధాలుగా పటిష్ఠంగానే ఉన్నాం. తప్పకుండా మంచి పోటీ ఉంటుంది’’ అని విరాట్ కోహ్లీ తెలిపాడు.

న్యూజిలాండ్‌ వ్యూహాలను అమలు చేయడంలో దిట్టని భారత సారథి రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. ‘‘న్యూజిలాండ్‌ వ్యూహాలు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అత్యంత కట్టుదిట్టమైన వ్యూహాలను అమలు చేస్తారు. ప్రణాళికలకు అనుగుణంగా బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో రాణిస్తారు. వారితో ఆడేటప్పుడు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిపైనా ప్రణాళికలను రచించుకుని బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఐసీసీ టోర్నీల్లో మాపై విజయం సాధిస్తూ వచ్చారు. తప్పకుండా ఈసారి కివీస్‌ను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తాం. వ్యక్తిగతంగానూ, జట్టుపరంగానూ ఏం చేయాలనేదానిపై ఇప్పటికే ఓ నిర్ణయానికొచ్చాం’’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని