Virat Kohli: కోహ్లీ ‘18’ స్పెషల్‌.. ఆ నంబర్‌తో అనుబంధం కొనసాగుతోందిలా..

18 నంబర్‌తో విరాట్‌ కోహ్లీ(Virat Kohli)కి ప్రత్యేక అనుబంధం కొనసాగుతోంది. ఐపీఎల్‌లో తాజాగా అతడు ఆరో సెంచరీ నమోదు చేసింది కూడా ఆ తేదీనాడే.

Updated : 19 May 2023 15:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : పరుగుల వీరుడు విరాట్‌ కోహ్లీ.. ఐపీఎల్‌లో తన సెంచరీ దాహాన్ని నాలుగేళ్ల తర్వాత తీర్చుకున్నాడు. గురువారం సన్‌రైజర్స్‌పై అద్భుత శతకాన్ని(100; 63 బంతుల్లో 12×4, 4×6) బాది.. మొత్తం ఆరు శతకాలతో గేల్‌ రికార్డును విరాట్‌ సమం చేశాడు. అయితే ఈ శతకం బాదింది మే 18న. ఈ నేపథ్యంలో ‘18’ నంబర్‌తో తనకున్న అనుబంధాన్ని తాజాగా విరాట్‌ మరోసారి బయటపెట్టాడు.

‘నిజాయతీగా చెప్పాలంటే.. అండర్‌ 19 క్రికెట్‌ ఆడేటప్పుడు నా పేరుపై ఆ నంబర్‌తో జెర్సీ ఇచ్చారు. అయితే.. ఆ తర్వాత ఈ నంబర్‌ నా జీవితంలో ప్రత్యేకంగా మారింది. నేను క్రికెట్‌లో అరంగేట్రం చేసింది 18 ఆగస్టు. నా తండ్రి చనిపోయింది 18 డిసెంబర్‌. నా జీవితంలో రెండు ముఖ్యమైన క్షణాలు ఈ రోజునే జరిగాయి’ అని కోహ్లీ ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు.

ఇక 18 నంబర్‌తో కోహ్లీ అనుబంధం కొనసాగుతుందిలా..

  • కోహ్లీ (Virat Kohli ) పేరు వినగానే.. క్రికెట్‌ అభిమానులకు ‘జెర్సీ నంబరు 18 (jersey Number 18)’ కళ్ల ముందు కదలాడుతుంది. అది ఐపీఎల్‌ అయినా.. అంతర్జాతీయ టోర్నీ అయినా కోహ్లీ ఆ జెర్సీ నంబరులోనే కన్పిస్తాడు.
  • కోహ్లీ ఐపీఎల్‌లో ఆరో శతకం బాదింది మే 18 2023న. అదీ ‘18’వ ఓవర్‌లో భువనేశ్వర్‌ బౌలింగ్‌లో సిక్స్‌ బాది చేరుకోవడం.
  • ఇక కోహ్లీ తన రెండో ఐపీఎల్‌ సెంచరీ కొట్టింది కూడా మే 18 నాడే. 2016లో పంజాబ్‌పై చిన్నస్వామి స్టేడియంలో కోహ్లీ 113 పరుగులు చేశాడు. ఇదే విరాట్‌కు ఐపీఎల్‌లో అత్యుత్తమ స్కోరు.
  • కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసి తొలి వన్డే ఆడింది 18 ఆగస్టు 2008లో.
  • ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై కోహ్లీ సెంచరీ నమోదు చేసింది కూడా 18వ తేదీనే. 2012 మార్చి 18న ఢాకాలో పాకిస్థాన్‌పై జరిగిన వన్డేలో విరాట్‌ 183 పరుగులు చేశాడు. ఇదే కోహ్లీకిప్పటికీ వన్డేల్లో అత్యధిక స్కోరు.
  • కోహ్లీ టెస్టుల్లో రెండు శతకాలను ఇదే తేదీన బాదాడు. 18 ఆగస్టు 2018లో ఇంగ్లాండ్‌పై 103 పరుగులు చేయగా.. 2013 డిసెంబర్‌ 18న దక్షిణాఫ్రికాపై 119 పరుగులు చేశాడు.
  • కోహ్లీ (Virat Kohli ) 17 ఏళ్ల వయసులో అతడి తండ్రి ప్రేమ్‌ కోహ్లీ 2006 డిసెంబరు 18వ తేదీ తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. ఆ సమయంలో దిల్లీ తరఫున కర్ణాటకతో కోహ్లీ ఓ రంజీ మ్యాచ్‌ ఆడుతున్నాడు. ఓ పక్క తండ్రి మరణించినా.. కుటుంబ సభ్యులు అండగా నిలవడంతో దుఃఖాన్ని దిగమింగుకుని మైదానానికి వెళ్లాడు. ఆ రోజు మ్యాచ్‌లో ఏకంగా 90 పరుగులు చేశాడు. ఆ రోజు మ్యాచ్‌ ముగిశాక తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. తండ్రి మరణం తర్వాత మ్యాచ్‌ ఆడటంపై కోహ్లీ స్పందిస్తూ.. ఆ క్షణం తాను వ్యక్తిగా మారానని, కఠిన నిర్ణయం తీసుకున్నానని నాటి రోజుల్ని గుర్తుచేసుకున్నాడు.
  • ఈ నంబరుకు మరో ప్రత్యేకత కూడా ఉంది. కోహ్లీ తండ్రి ప్రేమ్‌ కూడా క్రికెట్‌ ఆడే రోజుల్లో జెర్సీ నంబరు 18నే వేసుకున్నారు. ఆయన జ్ఞాపకార్థం కోహ్లీ కూడా అదే నంబరుతో కన్పిస్తున్నాడు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని