Virat Kohli: పరుగు వీర.. శతక ధీర..!

వెస్టిండీస్‌ దిగ్గజ ఓపెనర్‌ డెస్మండ్‌ హేన్స్‌ పేరిట ఉన్న అత్యధిక వన్డే శతకాల రికార్డును సచిన్‌ బద్దలు కొట్టినపుడు ఆశ్చర్యపోయింది క్రికెట్‌ ప్రపంచం. సచిన్‌కు అప్పటికి 25 ఏళ్లే.

Updated : 16 Nov 2023 07:50 IST

ఫోర్త్‌ అంపైర్‌

వెస్టిండీస్‌ దిగ్గజ ఓపెనర్‌ డెస్మండ్‌ హేన్స్‌ పేరిట ఉన్న అత్యధిక వన్డే శతకాల రికార్డును సచిన్‌ బద్దలు కొట్టినపుడు ఆశ్చర్యపోయింది క్రికెట్‌ ప్రపంచం. సచిన్‌కు అప్పటికి 25 ఏళ్లే. ఆ వయసుకే ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన మాస్టర్‌.. కెరీర్‌ ముగిసేసరికి ఎన్ని సెంచరీలు కొడతాడో అని క్రికెట్‌ అభిమానులు ఆసక్తితో చూశారు. అందరి అంచనాలను మించిపోయి ఏకంగా 49 వన్డే శతకాలతో ఔరా అనిపించాడు ఆ బ్యాటింగ్‌ మేధావి. కానీ సచిన్‌ రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నపుడు ఎవ్వరైనా ఊహించి ఉంటారా ఆ రికార్డు బద్దలవుతుందని? రికార్డు అన్నది బద్దలు కావడానికే ఉందని అంటారు కానీ.. సచిన్‌ రికార్డుల్లో చాలా వరకు ఆ కోవకు చెందనవి. అందులో ఒకటైన 49 వన్డే శతకాల రికార్డును మానవ మాత్రుడెవ్వడూ బద్దలు కొట్టలేరనే అనుకున్నారు. కానీ అభిమానులు క్రికెట్‌ దేవుడిగా పిలుచుకునే సచిన్‌ రికార్డునే బద్దలు కొట్టి చరిత్రకెక్కాడు విరాట్‌.

సచిన్‌ అంటే బ్యాటింగ్‌కు పర్యాయ పదం.. సచిన్‌ అంటే పరుగులు.. సచిన్‌ అంటే శతకాలు..! అలాంటి అసాధారణ బ్యాటర్‌ స్థాయిని అందుకోవాలంటే.. ఆ పరుగుల ప్రవాహాన్ని, ఆ శతకాల వెల్లువను అధిగమించాలంటే ఎంతటి పట్టుదల కావాలి? ఎంతగా శ్రమించాలి? ఎంతటి నిలకడను ప్రదర్శించాలి? విరాట్‌ కోహ్లి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలిచ్చాడు కాబట్టే ఈ రోజు వన్డే సెంచరీల్లో సచిన్‌ అనే ఎవరెస్టు కన్నా ఎత్తులో నిలబడ్డాడు. కెరీర్‌ ఆరంభంలో విరాట్‌ను చూసిన వాళ్లు ఈ రోజు అతనీ స్థాయిలో ఉంటాడని ఊహించి ఉండరు. కెరీర్లో కొన్నేళ్ల పాటు అందరిలో ఒకడిలాగే కనిపించాడు. కానీ తర్వాతే ఒకే ఒక్కడిగా ఎదిగాడు. దీని వెనుక నిరంతర శ్రమ, ఫిట్‌నెస్‌ కోసం పడే తపన, అసమానమైన పట్టుదల, ఎంతకీ తరగని పరుగుల ఆకలి, ఎన్నో త్యాగాలు.. ఇలా ఎన్నో కారణాలే ఉన్నాయి. ఇప్పుడు భారత క్రికెటర్లలో చాలామంది కండలు తిరిగిన దేహాలతో, ఉత్తమ ఫిట్‌నెస్‌తో కనిపిస్తున్నారంటే అది విరాట్‌ వేసిన బాటే. ఫుట్‌బాలర్లను తలపించే దేహదారుఢ్యంతో క్రికెటర్ల ఫిట్‌నెస్‌ ప్రమాణాలనే మార్చేసిన ఆటగాడు కోహ్లి. అతను తన జీవన శైలిని, ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చుకున్నా, మాంసాహారం మానేసినా.. అదంతా ఆట కోసమే. బ్యాటింగ్‌లో ఎంత పరిపూర్ణత సాధించినా సచిన్‌ లాగే ఎన్నడూ ప్రాక్టీస్‌కు దూరం కాకపోవడం, మెరుగయ్యేందుకు నిరంతరం శ్రమించడం కోహ్లి అత్యున్నత స్థాయిని చేరుకోవడానికి దోహదపడ్డాయి.

అందుకే అతను కింగ్‌: ఏ క్రికెటర్‌ జీవితంలోనైనా కెరీర్లో ఏదో ఒక దశలో వైఫల్యాలు ఎదురవడం సహజం. కొన్నాళ్లు అద్భుత ప్రదర్శన చేశాక పెరిగే అంచనాల ఒత్తిడిని తట్టుకుని దీర్ఘ కాలం నిలకడను ప్రదర్శించడం అంత తేలిక కాదు. ఉత్తమంగా ఆడుతున్న బ్యాటర్‌ మీద ప్రత్యర్థులు ప్రత్యేకంగా దృష్టిసారిస్తారు. బలహీనతలను కనిపెట్టి అందుకు అనుగుణంగా ఉచ్చుబిగిస్తుంటారు. ప్రపంచ క్రికెట్లో విరాట్‌ అత్యుత్తమ బ్యాటర్‌గా ఎదుగుతున్న దశలో అండర్సన్‌ నేతృత్వంలోని ఇంగ్లాండ్‌ బౌలింగ్‌ బృందం విరాట్‌కు అలాగే ఉచ్చుబిగించింది. 2014 ఇంగ్లాండ్‌ పర్యటనలో 5 టెస్టులాడి కేవలం 134 పరుగులే చేయడంతో కోహ్లి సామర్థ్యంపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. కానీ నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఇంగ్లాండ్‌కు వెళ్లినపుడు 5 టెస్టుల్లో అతను చేసిన పరుగులు 593. బలహీనతలను, వైఫల్యాలను అధిగమించడానికి విరాట్‌ ఎలా కష్టపడతాడో చెప్పే ఉదాహరణ ఇది. ఇక 2019-22 మధ్య ఎదుర్కొన్న పేలవ దశను అధిగమించిన తీరు కూడా ప్రత్యేకమే.

కొట్టేవాళ్లున్నారా?: సుదీర్ఘ విరామం తర్వాత నిరుడు సెంచరీ సాధించినప్పటి నుంచి కోహ్లి పరుగు ఆగట్లేదు. ఈ ఏడాది వన్డేల్లో నిలకడగా రాణించాడు. ఇక ప్రపంచకప్‌లో అతనెలా చెలరేగిపోతున్నాడో తెలిసిందే. ఈ ప్రపంచకప్‌లో కీలకమైన మూడో స్థానంలో కోహ్లి పోషించిన పాత్ర ఎంతో విలువైంది. కెప్టెన్‌ రోహిత్‌ జట్టుకు మెరుపు ఆరంభాలందిస్తుంటే.. విరాట్‌ ఇన్నింగ్స్‌కు ఇరుసులా నిలుస్తూ జట్టు భారీ స్కోర్లు సాధించడంలో, లక్ష్యాలను ఛేదించడంలో అత్యంత కీలకంగా వ్యవహరించాడు. ఒకప్పటితో పోలిస్తే కోహ్లిలో దూకుడు తగ్గిన మాట వాస్తవమే కానీ.. అతడి ఇన్నింగ్స్‌లు మాత్రం అమూల్యమైనవి. వికెట్ల మధ్య శరవేగంగా పరుగు తీస్తూ.. సింగిల్స్‌, డబుల్స్‌తో స్కోరు పెంచుతూ.. సమయోచితంగా షాట్లు ఆడుతూ.. భాగస్వామ్యాలు నిర్మిస్తూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తూ విరాట్‌ తన విశిష్ఠతను చాటాడు. కెరీర్లో ఈ దశలో ఒక ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా సచిన్‌ రికార్డును బద్దలు కొట్టడం కోహ్లి ప్రత్యేకతను చాటేదే. సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో 49వ వన్డే శతకంతో సచిన్‌ను సమం చేయడం, తాను ఆరాధించే ఆ దిగ్గజ ఆటగాడి కళ్ల ముందే 50వ సెంచరీతో చరిత్ర సృష్టించి అతడికి అభివాదం చేయడం భారత క్రికెట్‌ అభిమానులకు చిరస్మరణీయ జ్ఞాపకాలే. సచిన్‌ తర్వాత అతణ్ని కొట్టే బ్యాటర్‌ రాడనుకున్నాం. కానీ విరాట్‌ వచ్చాడు. మరి అతణ్ని దాటేవాడు వస్తాడా అన్నది సందేహమే. ఎందుకంటే వన్డేలకు ప్రాధాన్యం తగ్గిపోయింది. కోహ్లి అంత పట్టుదల, ఆ స్థాయి నిలకడను కొత్త తరం ఆటగాళ్ల నుంచి ఆశించలేం. కాబట్టి విరాట్‌ 50 సెంచరీల రికార్డు ఎప్పటికీ పదిలమే కావచ్చు.


మంచినీళ్ల ప్రాయంగా శతకాలు సాధించే కోహ్లి.. రెండున్నరేళ్ల పాటు ఒక్క సెంచరీ కూడా సాధించలేకపోయాడు. ప్రేక్షకుల కేరింతలనే ప్రేరణగా మలుచుకునే విరాట్‌కు కొవిడ్‌ రోజుల్లో ఖాళీ స్టేడియాల్లో ఆడటం ఇబ్బందిగా మారింది. ఆ సమయంలో సాధన కూడా సరిగా సాగలేదు. కెప్టెన్సీ వివాదాలు కూడా అతడి ఏకాగ్రతను దెబ్బ తీశాయి. పేలవ దశ సుదీర్ఘ కాలం సాగడంతో విరాట్‌ పనైపోయిందని చాలామంది తీర్మానించేశారు. అభిమానులు కూడా అతడిపై ఆశలు కోల్పోయారు. కానీ కోహ్లి నిబ్బరంతో నిలబడ్డాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని