Virat Kohli: అత్యంత కఠినమైన సమయమిదే.. రెండో ఓటమిపై విరాట్ కోహ్లీ

వ్యక్తిగత ప్రదర్శన బాగున్నా.. జట్టు విజయం సాధించకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో విరాట్ కోహ్లీకి తెలుసు. గత మూడు మ్యాచుల్లోనూ అతడు రాణించినా.. రెండు ఓటములను చవిచూడాల్సి వచ్చింది.

Published : 30 Mar 2024 16:17 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సొంత మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోవడం అత్యంత బాధాకరంగా ఉందని బెంగళూరు స్టార్‌ ఆటగాడు విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఐపీఎల్‌లో కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ 59 బంతుల్లో 83 పరుగులు చేశాడు. బెంగళూరు ఇన్నింగ్స్‌లో కీలక పాత్ర పోషించాడు. అయితే, 183 పరుగుల లక్ష్య ఛేదనను కోల్‌కతా మరో 19 బంతులు ఉండగానే పూర్తి చేసింది. కోల్‌కతాపై అదిరిపోయే ఇన్నింగ్స్‌ ఆడిన కోహ్లీకి బెంగళూరు డ్రెస్సింగ్‌ రూమ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. అది స్వీకరించిన తర్వాత కోహ్లీ కాస్త ఇబ్బందికరంగానే స్పందించాడు. కోహ్లీ మాట్లాడిన వీడియోను బెంగళూరు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. 

‘‘మనకు ఇది కఠినమైన రోజు. ఆ విషయం మనందరికీ తెలుసు. మనం ఇంకాస్త ఉత్తమంగా ఆడాల్సిందే. దానిని అంగీకరించి ముందుకుసాగుదాం. ఇదే పోరాట స్ఫూర్తి, మన శక్తి సామర్థ్యాలపై నమ్మకంతో మున్ముందు మ్యాచుల్లో రాణించి విజయం సాధించేందుకు ప్రయత్నిద్దాం. ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఉందాం’’ అని కోహ్లీ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఐపీఎల్‌ 17వ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. మూడు మ్యాచుల్లో 181 పరుగులు చేశాడు. దీంతో ‘ఆరెంజ్ క్యాప్’ ప్రస్తుతం అతడి వద్దే ఉంది. కోహ్లీ తర్వాత హెన్రిచ్ క్లాసెన్ (2 మ్యాచుల్లో 143), రియాన్ పరాగ్ (2 మ్యాచుల్లో 127) రేసులో ఉన్నారు. 

సమతూకంగా అనిపించడం లేదు: స్టువర్ట్ బ్రాడ్

మూడు మ్యాచుల్లో రెండు ఓటములతో బెంగళూరు ఐపీఎల్‌లో తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. తాజాగా చిన్నస్వామి స్టేడియం వేదికలోనూ పరాజయం చవిచూసింది. బ్యాటింగ్‌లో ఫర్వాలేదు కానీ.. బౌలింగ్‌లో ఇబ్బందిపడటంపై ఇంగ్లాండ్‌ మాజీ పేసర్ స్టువర్ట్‌ బ్రాడ్ స్పందించాడు. ‘‘కోల్‌కతా బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. కానీ, బెంగళూరు బౌలింగ్‌ మాత్రం మ్యాచ్‌ను గెలిపించే స్థాయిలో లేదు. కోల్‌కతా బౌలర్లు కట్టర్స్‌, స్లో డెలివరీలతో బెంగళూరు జట్టును కట్టడి చేశారు. కానీ, ఆర్సీబీ బౌలర్లలో వైశాఖ్‌ మినహా మిగతా వారి ప్రదర్శన దారుణంగా ఉంది. గత కొన్నేళ్లుగా బెంగళూరు బ్యాటింగ్‌ బలంగా ఉంటోంది. కానీ, బౌలింగ్‌పై వారు పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదు. అందుకే, ఆ జట్టు సమతూకంగా అనిపించడం లేదు. టోర్నీల్లో ఛాంపియన్‌గా నిలవాలంటే రెండు విభాగాలూ కీలకమే’’ అని బ్రాడ్ తెలిపాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని