Sachin - Kohli: ‘సచిన్‌ 100 సెంచరీల రికార్డును కోహ్లీ బ్రేక్‌ చేయడం చాలా కష్టం’

క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్ పేరిట ఉన్న 100 సెంచరీల రికార్డును విరాట్ కోహ్లీ (Virat Kohli) బద్దలు కొట్టడం చాలా కష్టమని వెస్టిండీస్‌ దిగ్గజం బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు.

Published : 07 Dec 2023 22:58 IST

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ దిగ్గజం సచిన్ టెందూల్కర్ (Sachin Tendulkar) తన కెరీర్‌లో లెక్కలెనన్ని రికార్డులు నెలకొల్పాడు. చాలాసార్లు తన రికార్డులను తానే తిరగరాశాడు. ముఖ్యంగా అతడు నెలకొల్పిన 100 సెంచరీల రికార్డు ఇంకా పదిలంగానే ఉంది. అయితే, ఈ రికార్డును భారత స్టార్‌ క్రికెటర్‌ విరాట్ కోహ్లీ (Virat Kohli) బ్రేక్ చేసే అవకాశముంది. వన్డేల్లో సచిన్‌ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల(49)రికార్డును ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌లో కోహ్లీ (50 సెంచరీలు) బద్దలు కొట్టాడు. 35 ఏళ్ల విరాట్ మరో 21 సెంచరీలు చేస్తే సచిన్  శతకాల రికార్డును బ్రేక్ చేసి సరికొత్త చరిత్ర సృష్టిస్తాడు. అయితే, సచిన్‌ పేరిట ఉన్న 100 సెంచరీల రికార్డును కోహ్లీ బద్దలు కొట్టడం చాలా కష్టమని వెస్టిండీస్‌ దిగ్గజం బ్రయాన్ లారా (Brian Lara) అభిప్రాయపడ్డాడు.

‘‘ప్రస్తుతం కోహ్లీ వయసు 35 సంవత్సరాలు. ఇప్పటివరకు 80 సెంచరీలు చేశాడు. అతనికింకా 20 సెంచరీలు కావాలి. ఏడాదికి ఐదు శతకాల చొప్పున బాదినా.. సచిన్‌ రికార్డును సమం చేయడానికి నాలుగేళ్లు పడుతుంది. అంటే అప్పటికి కోహ్లీ 39 సంవత్సరాలకు చేరుకుంటాడు. ఈ వయసులో సెంచరీలు చేయడం చాలా కష్టం. అయితే, సచిన్‌ 100 సెంచరీల రికార్డును కోహ్లీ బ్రేక్ చేస్తాడని నేను కచ్చితంగా చెప్పలేను. నేనే కాదు ఎవరూ చెప్పలేరు. 100 సెంచరీల రికార్డును బ్రేక్‌ చేస్తాడని చెబుతున్నవారు క్రికెట్‌ లాజిక్‌ను పరిగణనలోకి తీసుకోరు. 20 సెంచరీలు చాలా దూరంలో ఉన్నాయి. చాలామంది క్రికెటర్లు తమ కెరీర్‌ మొత్తంలో 20 శతకాలు చేయలేరు. కాబట్టి,  కోహ్లీ చేస్తాడని చెప్పలేను. వయసు ఎవరికీ ఆగదు. రానున్న రోజుల్లో విరాట్ మరెన్నో రికార్డులు బద్దలు కొడతాడు. కానీ, 100 సెంచరీల రికార్డు మాత్రం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఒకవేళ ఎవరైనా చేయగలరా? అంటే అది కోహ్లీయే అని చెప్పడం మర్చిపోవద్దు. కోహ్లీ క్రమశిక్షణకు, అంకితభావానికి నేను పెద్ద అభిమానిని. ఒకవేళ సచిన్‌లా కోహ్లీ 100 సెంచరీలు చేస్తే చాలా సంతోషిస్తా. సచిన్ నా ప్రియమైన స్నేహితుడు. ముందుగా చెప్పినట్లుగానే కోహ్లీకి పెద్ద అభిమానిని’’ అని బ్రయాన్ లారా వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని