Virat Kohli: తీరిన టెస్టు సెంచరీ దాహం.. మూడున్నరేళ్ల తర్వాత విరాట్ శతకం

ఎట్టకేలకు విరాట్ కోహ్లీ (Virat Kohli) టెస్టు సెంచరీ దాహాన్ని తీర్చేసుకున్నాడు. ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో శతకం బాదాడు.

Updated : 12 Mar 2023 13:59 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) దాదాపు 1200 రోజుల నుంచి మోస్తున్న బరువును దింపేసుకున్నాడు. వన్డేలు, టీ20ల్లో సెంచరీలతో ఫామ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. టెస్టుల్లో మాత్రం మూడంకెల స్కోరు కోసం దాదాపు మూడున్నరేళ్లపాటు వేచి చూడాల్సి వచ్చింది. తాజాగా ఆసీస్‌తో అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ బాదాడు. విరాట్‌కిది 28వ టెస్టు శతకం కాగా.. అన్ని ఫార్మాట్లు కలిసి మొత్తంగా 75వ సెంచరీ. మ్యాచ్‌ ఆరంభం నుంచి నిలకడగా ఆడుతూ వచ్చిన విరాట్ కోహ్లీ 241బంతుల్లో శతకం పూర్తి చేశాడు. 

2019 నవంబర్‌ 22న బంగ్లాదేశ్‌పై టెస్టులో సెంచరీ నమోదు చేసిన విరాట్ కోహ్లీకి మరో శతకం సాధించడానికి దాదాపు 1200 రోజుల సమయం పట్టింది. దీని కోసం 41 టెస్టు ఇన్నింగ్స్‌లను తీసుకోవడం గమనార్హం. తన కెరీర్‌లో అత్యంత ఎక్కువ బంతులను తీసుకొని మరీ సెంచరీ సాధించడం ఇది రెండోసారి. ఇప్పుడు ఆసీస్‌పై 241 బంతుల్లో శతకం చేయగా.. గతంలో ఇంగ్లాండ్‌పై 289 బంతులను తీసుకున్నాడు.

సెంచరీ విశేషాలు: (Virat Century)

* విరాట్ కోహ్లీ స్వదేశంలో దాదాపు పదేళ్ల తర్వాత ఆసీస్‌పై సెంచరీ నమోదు చేయడం గమనార్హం. గతంలో 2013లో చెపాక్‌ వేదికగా చేశాడు. 

* దాదాపు 23 టెస్టుల్లోని 41 ఇన్నింగ్స్‌ తర్వాత విరాట్ కోహ్లీ సెంచరీ మార్క్‌ను తాకాడు. బంగ్లాదేశ్‌పై 2019 నవంబర్ 22న తన 85వ టెస్టులో శతకం కొట్టాడు. 

* విరాట్ కోహ్లీ  2018 డిసెంబర్‌ తర్వాత ఆసీస్‌పై ఇదే శతకం చేయడం. 2018/19 సీజన్‌లో బోర్డర్ - గావస్కర్‌ ట్రోఫీని దక్కించుకోవడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. 

* విరాట్ కోహ్లీకిది 28వ టెస్టు సెంచరీ కాగా.. అన్ని ఫార్మాట్లలో కలిపి 75వ శతకం. దీంతో సచిన్‌ తెందూల్కర్‌ ‘వంద’ సెంచరీల రికార్డును అందుకోవాలంటే ఇంకా 25 శతకాలు చేయాలి. సచిన్ 664 మ్యాచుల్లో ఆడగా.. విరాట్ ఇప్పటి వరకు 493 మ్యాచులను మాత్రమే ఆడాడు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు